తెలంగాణలో కొత్తగా పంటల బీమా!

25 Jan, 2023 03:49 IST|Sakshi

అమలు చేసేందుకు వ్యవసాయశాఖ కసరత్తు

బడ్జెట్‌లో ప్రవేశపెట్టే యోచన

ఏటా రూ. 500 కోట్లతో అమలుకు ప్రతిపాదన

రైతు యూనిట్‌గా బీమా పథకానికి రూపకల్పన

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా పంటల బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వానికి వ్యవసాయశాఖ ప్రతిపాదించింది. రానున్న బడ్జెట్‌ సమావేశాల్లో అందుకు దాదాపు రూ. 500 కోట్ల మేర నిధులు కేటాయించాలని నివేదించినట్లు సమాచారం. బడ్జెట్‌లో కొత్త పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెడితే వచ్చే వానాకాలం సీజన్‌ నుంచి దీన్ని అమలు చేస్తామని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన నుంచి 2020లో వైదొలిగాక రాష్ట్రంలో ఎలాంటి పంటల బీమా పథకం అమలు కావడంలేదు. దీంతో పంట నష్టం జరిగినా రైతులకు పరిహారం అందని పరిస్థితి నెలకొంది. దీనిపై సర్వత్రా విమర్శలు రావడంతో వ్యవసాయ శాఖ సొంత పంటల బీమాపై దృష్టిసారించింది.

బెంగాల్‌ తరహాలో...: పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న తరహాలోనే రాష్ట్రంలోనూ బీమా పథకాన్ని అమలు చేసే అవకాశముంది. దీనిపై సీఎం కేసీఆర్‌ గతంలోనే అసెంబ్లీలో ప్రకటన చేశారు. బెంగాల్‌ ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనలో మార్పులు చేసి బంగ్లా సస్య బీమా యోజన పేరుతో సొంత పథకం తీసుకొచి్చంది. నాలుగేళ్లుగా దీన్ని అమలు చేస్తోంది.

బెంగాల్‌ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆలుగడ్డ, చెరకు పంట విలువలో 4.85 శాతాన్ని ప్రీమియంగా రైతుల నుంచి వసూలు చేస్తుండగా, ఆహార ధాన్యాలు, వంట నూనెలకు సంబంధించిన పంటలకు రైతుల తరఫున పూర్తి ప్రీమియంను బెంగాల్‌ ప్రభుత్వమే భరిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ సొంతంగా పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని సర్కారు భావిస్తోంది. అంతేగాక రైతు యూనిట్‌గా బీమా పథకాన్ని తీసుకురావాలన్న అంశంపై కసరత్తు చేస్తోంది.

ఇప్పటివరకు బీమా కంపెనీల దోపిడీ...
పంటల బీమా విషయంలో బీమా కంపెనీలు ఇప్పటివరకు లాభాలను పెంచుకోవడంపైనే ఎక్కువగా దృష్టి సారించాయి. లాభాలు గణనీయంగా ఉన్నా ఏటా ప్రీమియం రేట్లను భారీగా పెంచేవి. 2013–14లో రైతులు, ప్రభుత్వం కలిపి పంటల ప్రీమియంగా రూ. 137.60 కోట్ల మేర చెల్లిస్తే రైతులకు క్లెయిమ్స్‌ కింద అందింది కేవలం రూ. 56.39 కోట్లే. ఆ ఏడాది 8.52 లక్షల మంది రైతులు ప్రీమియం చెల్లిస్తే కేవలం 1.18 లక్షల మంది రైతులే లబ్ధి పొందారు.

2012–13 వ్యవసాయ సీజన్‌లో 10 లక్షల మంది రైతులు రూ. 145.97 కోట్ల ప్రీమియం చెల్లిస్తే కేవలం 1.80 లక్షల మంది రైతులకు రూ. 78.86 కోట్ల మేర పరిహారం లభించింది. 2015–16లో మాత్రం 7.73 లక్షల మంది రైతులు రూ. 145.71 కోట్లు ప్రీమియం చెల్లిస్తే బీమా సంస్థలు రూ. 441.79 కోట్లను పరిహారంగా ఇచ్చాయని వ్యవసాయశాఖ లెక్కలు చెబుతున్నాయి. 2016–17లో మళ్లీ బీమా కంపెనీలకే లాభాలు సమకూరాయి.

ఆ ఏడాది 9.75 లక్షల మంది రైతులు రూ. 294.29 కోట్లు చెల్లిస్తే 2.35 లక్షల మంది రైతులకు రూ. 178.49 కోట్లు పరిహారం లభించింది.

కేంద్ర పథకంతో లాభం లేదని...
బీమా కంపెనీలు భారీ లాభాలు గడిస్తున్నా ప్రీమియం ధరలు ఎందుకు పెంచుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది. ముఖ్యంగా తెలంగాణలో రబీలో చెల్లించే ప్రీమియం మొత్తం దాదాపు బీమా కంపెనీలను బాగు చేయడానికే అన్నట్లుగా అమలైంది. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన కింద ప్రైవేటు బీమా కంపెనీలకు అవకాశం కల్పించడంతో ఈ పరిస్థితి మరింత దిగజారింది.

పీఎంఎఫ్‌బీవై కింద వరి, జొన్న, మొక్కజొన్న, కంది, పెసర, మినుములకు రైతులు 2 శాతం, పసుపు రైతులు 5 శాతం ప్రీమియం చెల్లించాలి. పునరుద్ధరించిన వాతావరణ ఆధారిత బీమా కింద పత్తి, పత్తి, మిరప, ఆయిల్‌పాం, బత్తాయి పంటలకు పంట రుణంలో 5 శాతం రైతు ప్రీమియం కట్టాలి. జిల్లా జిల్లాకు ప్రీమియం ధరలు మారుతుంటాయి. అలాగే కేంద్ర పథకంలో గ్రామాన్ని యూనిట్‌గా కాకుండా మండలాన్ని యూనిట్‌గా తీసుకోవడంతో పెద్దగా ప్రయోజనం లేదన్న భావన నెలకొంది.

వడగళ్లు, పెనుగాలులకు పంట నష్టపోతే తక్షణం 25 శాతం పరిహారం ఇవ్వాలనే నిబంధనను ప్రైవేటు బీమా కంపెనీలు అమలు చేయకపోవడం, అధిక సంఖ్యలో రైతులకు పరిహారం అందేలా కేంద్ర పథకం లేదన్న భావనతో 2020 నుంచి రాష్ట్ర ప్రభుత్వం దాన్నుంచి బయటకు వచ్చింది.  

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు