ఫోన్లు చేయరు.. చాటింగ్‌ ద్వారా సం‍ప్రదించి..

8 Feb, 2021 05:10 IST|Sakshi

చైనా యాప్‌ల కొత్త దందా

కొత్తరూపంలో మళ్లీ తెరపైకి క్యాష్‌బ్యాక్‌ యాప్‌లు

గూగుల్‌ ట్రాన్స్‌లేటర్ల సాయంతో యూట్యూబర్లకు వినతి

తమ ఫోంజి యాప్‌లకు ప్రచారం చేయాలని డబ్బులు ఎర

ప్రతి వీడియోకు రూ.5,000 నుంచి రూ.50,000 వరకు చెల్లింపు

సాక్షి, హైదరాబాద్‌: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు.. అంటే ఇదేనేమో! అరాచకాలకు పాల్పడి అడ్డంగా బుక్కైన చైనా లోన్, ఫోంజి యాప్‌ నిర్వాహకులు ఇప్పుడు సరికొత్త రూపంలో దందాలకు తెరలేపారు. కొంతకాలంగా ఈ లోన్‌ యాప్‌ల కారణంగా దేశంలో అలజడి రేగడంతో అప్పటి నుంచి అకస్మాత్తుగా వీటి కార్యకలాపాలు నిలిచిపోయాయి. తాజాగా పేరు మార్చుకుని వస్తున్న ఈ ఫోంజి యాప్‌ (సులువుగా డబ్బు సంపాదించే)లకు ప్రచారం కల్పించేందుకు మనదేశంలోని యూట్యూబర్లకు యాడ్స్‌ పేరిట ఎరవేస్తున్నారు. బయటివారు ఇచ్చే దానికి పదింతలు అధికంగా చెల్లిస్తామని ఆశ చూపడంతో తమకు తెలియకుండానే అనేకమంది యూట్యూబర్లు చైనా యాజమాన్యాలకు సహకరిస్తున్నారు. 

వచ్చీ రాని ఇంగ్లిష్‌లో..
యూట్యూబర్లను సంప్రదించేవారిలో అధికంగా చైనీయులే. యూట్యూబర్లను నేరుగా ఫోన్లో సంప్రదించకుండా ఎక్కువగా వాట్సాప్‌ ద్వారా చాటింగ్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందుకోసం తొలుత లక్షల సంఖ్యలో సబ్‌స్క్రైబర్లు ఉన్న యూట్యూబర్లను ఎంచుకుంటున్నారు. చైనా భాషను గూగుల్‌ ట్రాన్స్‌లేటర్‌లో వేసి, అలా వచ్చిన ఇంగ్లిష్‌ కాపీని తిరిగి ఇక్కడివారికి పంపిస్తున్నారు.

ఒక్కోసారి పొరబాటున చైనా భాషనే పంపించి వెంటనే డిలిట్‌ చేస్తున్నారు. దీనిపై బెంగళూరుకు చెందిన ఓ యూట్యూబర్‌ తనతో సంప్రదించేది చైనీయులు అని అనుమానించాడు. అదే సమయంలో తనకు రూ.500 ఇవ్వాల్సిన చోట రూ.5,000 ఇస్తామని, ఇంకా కావాలంటే రూ.50,000 కూడా ఇస్తామని ఆఫర్‌ చేయడంతో అతడు అప్రమత్తమయ్యాడు. వారి కుట్రలను అర్థం చేసుకోలేని చాలామంది డబ్బు కోసం వారికి వీడియోలు చేసి పెడుతూ చైనా యాప్‌ యాజమాన్యాలకు సహకరిస్తున్నారు.

నమ్మించి నట్టేట ముంచే యాప్‌లు..
బుర్స్, క్యాష్‌బ్యాక్, వాల్‌మార్‌ తదితర పేర్లతోటి మొన్నటిదాకా ప్లేస్టోర్‌లో ఈ యాప్‌లు అందుబాటులో ఉండేవి. ఆన్‌లైన్‌లో తమ ఉత్పత్తులకు లైక్‌ కొట్టే పార్ట్‌ టైం జాబులో చేరితే రోజూ కొంత డబ్బు చెల్లిస్తామని ఎరవేస్తారు. ఇందులో రూ.5,000 నుంచి రూ.1,50,000 వరకు ప్లాన్లు ఉంటాయి. ఈ చెల్లింపులన్నీ ఫోన్‌పే, గూగుల్‌ పే ద్వారానే. ఉదాహరణకు రూ.5,000 కట్టి బేసిక్‌ స్కీంలో చేరినవారు ఆయా ఉత్పత్తులకు లైక్‌ కొడితే వారి ఖాతాలో రోజుకు రూ.400 వేస్తారు. ఇందులో ట్యాక్సులు పోను రూ.328 జమా అవుతాయి. రూ.లక్షకుపైగా కట్టి స్కీంలో చేరితే రోజుకు రూ.9,000 పడతాయి.

రెండువారాలు కొనసాగితే తమ డబ్బు తిరిగి వచ్చేస్తుంది. ఇక్కడే యాప్‌ నిర్వాహకులు తమ తెలివితేటలు ప్రదర్శిస్తారు. సెల్‌ లోకేషన్‌ ఆధారంగా తమ వినియోగదారుల్లో ఎక్కువమందిని పల్లెటూరు, బస్తీలను ఎంచుకుంటారు. వీరిలో కొందరికి రోజూ డబ్బులు ఠంఛన్‌గా ఇస్తారు. ఉదాహరణకు మీరు రిఫర్‌ చేసిన వ్యక్తి రూ.30,000 స్కీములో చేరితే మీకు రోజూ అదనంగా రూ.300 వస్తాయి. అదే అతడు రూ.లక్ష స్కీములో చేరితే రోజూ రూ.600 వరకు చెల్లిస్తారు. ఓ శుభముహూర్తాన యాప్‌ పనిచేయదు. అంతా పేదలు, గ్రామీణులు కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేయరన్నది వీరి ధీమా. లాక్‌డౌన్‌ కాలాన్ని ఈ యాప్‌ నిర్వాహకులు తమకు అనుకూలంగా మలచుకున్నారు. ముఖ్యంగా ఉపాధి కోల్పోయినవారు, విద్యార్థులు వీరి ఎత్తుగడలకు జేబులు ఖాళీ చేసుకున్నారు.   

మరిన్ని వార్తలు