కరోనా రోగుల పర్యవేక్షణకు కొత్త పరికరం

4 Aug, 2020 04:23 IST|Sakshi

రోగి వేలికి తొడిగితే చాలు  వివరాలన్నీ చిటికెలో నమోదు

ఉష్ణోగ్రత, శ్వాస, గుండె వేగం, ఆక్సిజన్‌ స్థాయిని వైద్యులు దూరం నుంచే తెలుసుకునే వీలు

ఆ సమాచారమంతా మొబైల్‌ లేదా సెంట్రల్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌కు అందేలా ఏర్పాటు

మద్రాస్‌ ఐఐటీతో కలసి అభివృద్ధి చేసిన స్టార్టప్‌ కంపెనీ హెలిక్సన్‌

ధర రూ. 2,500–రూ. 10 వేలు.. ఏడాదిపాటు పనిచేసేలా తయారీ

సాక్షి, హైదరాబాద్‌: కరోనా రోగులను పర్యవేక్షించడం డాక్టర్లకూ కత్తిమీద సామే. పీపీ ఈ కిట్లు, మాస్కులు, తరచూ శానిటైజేషన్‌ తప్పనిసరి! మరి ఇవేవీ లేకుండా.. ఆ మాటకొస్తే సమీపంలోకి వెళ్లకుండానే రోగి తాలూకూ వివరాలన్నీ పొందగలిగితే? వైద్యుల పని సులువవుతుంది. ఈ అద్భుతాన్ని మద్రాస్‌ ఐఐటీ సాధించింది. కరోనా రోగుల చికిత్సకు కీలకమైన గుండె కొట్టుకునే వేగం, ఉష్ణోగ్రత, ఊపిరి తీసుకొనే వేగం, రక్తంలో ఆక్సిజన్‌ మోతాదులను దూరం నుంచే చూసేందుకు ఓ పరికరాన్ని అభివృద్ధి చేసింది.

హెల్త్‌కేర్‌ టెక్నాలజీ ఇన్నోవేషన్‌ సెంటర్‌ (హెచ్‌టీఐసీ)తోపాటు హేలిక్సన్‌ అనే స్టార్టప్‌ కంపెనీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ వినూత్న పరికరాన్ని ఇప్పటికే సుమారు 2 వేల మంది రోగులకు ఉపయోగించారు. మరో 5 వేల మంది పర్యవేక్షణకు పరికరాలు సిద్ధమవుతున్నాయి. పరికరం స్థాయి, అందులోని కొలమానాలను బట్టి దీని ధర రూ. 2,500 నుంచి రూ.10 వేల మధ్య ఉంది. ఒకసారి ఈ పరికరాన్ని రోగి వేలికి తొడిగితే చాలు.. వివరాలన్నీ మొబైల్‌ ఫోన్‌కు లేదా సెంట్రల్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌కు చేరతాయి. రోగి శరీర ఉష్ణోగ్రతలను చంకల నుంచి సేకరిస్తే.. ఆక్సిజన్‌ మోతాదులు, ఇతర వివరాలను వేలి నుంచే తీసుకోవచ్చు. ఏడాదిపాటు పనిచేసే ఈ పరికరాన్ని మళ్లీమళ్లీ వాడుకోవచ్చు కూడా.

కరోనా తదనంతరం కూడా...
కరోనా తదనంతర పరిస్థితుల్లోనూ ఆసుపత్రుల్లో ఈ పరికరాన్ని వాడుకోవచ్చని హెచ్‌టీఐసీలో పనిచేస్తున్న ప్రొఫెసర్‌ మోహన్‌ శంకర్‌ శివప్రకాశం తెలిపారు. శరీర వివరాలను తెలిపే పరికరాలు మార్కెట్‌లో ఇప్పటికే కొన్ని వాణిజ్యస్థాయిలో అందుబాటులో ఉన్నప్పటికీ అవేవీ కచ్చితమైన వివరాలు ఇవ్వవని, అందుకే వైద్యులు ఆసుపత్రుల్లో వాటిని వాడేందుకు ఇష్టపడరని ఆయన చెప్పారు. తాము అభివృద్ధి చేసిన పరికరం ఆసుపత్రుల్లో ఉపయోగించే మానిటరింగ్‌ వ్యవస్థలతో సమానమైన ఫలితాలిస్తుందని చెప్పారు. ఏడాదిపాటు చెన్నై, చుట్టుపక్కల ఉన్న అనేక ఆసుపత్రుల్లో తాము ఈ పరికరంపై పరీక్షలు జరిపామని, కచ్చితమైన ఫలితాలు సాధించామని ఆయన వివరించారు.

కరోనా సమయంలో వైద్యులు, నర్సులు రోగుల సమీపానికి వెళ్లే అవసరం లేకుండా చేసేందుకు... తద్వారా ఖర్చులు తగ్గించేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుందని చెప్పారు. ఆక్సిజన్‌ మోతాదును గుర్తించే పరికరాన్ని జోడించడం ద్వారా ఈ పరికరం ఆసుపత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బందిపై పనిభారం గణనీయంగా తగిస్తుందని, అదే సమయంలో ఇళ్లలో ఉన్నవారి వివరాలను కూడా గమనిస్తూ తగిన సూచనలు ఇచ్చేందుకు ఉపయోగపడుతుందని హేలిక్సన్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ విజయ్‌శంకర్‌రాజా తెలిపారు. వందల మంది రోగుల వివరాలను ఒకేచోట నుంచి పర్యవేక్షించే స్థాయికి ఈ పరికరాన్ని అభివృద్ధి చేయవచ్చని, ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ సాయంతో విషమ పరిస్థితి ఎదుర్కొంటున్న రోగులను వెంటనే గుర్తించవచ్చని తెలిపారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా