6 Lane Highway-Telangana: ఆరు వరుసల్లో హాయిగా.. బెంగళూరు, నిజామాబాద్‌ హైవే.. ఇంకా మరిన్ని..

29 Jan, 2022 02:42 IST|Sakshi

ఎన్‌హెచ్‌ఏఐ ఆధ్వర్యంలో కొత్త హైవేల నిర్మాణం 

డీపీఆర్‌లకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆమోదం 

ఈ ఏడాదిలోనే ప్రారంభం కానున్న పనులు 

ప్రమాదాల నివారణ.. వేగంగా గమ్యానికి 

అక్కల్‌కోట్‌–కర్నూలు ఎకనమిక్‌ కారిడార్‌ రూపంలో పూర్తి కొత్త రోడ్డు 
గద్వాల రోడ్డుపై కర్ణాటక–తెలంగాణ సరిహద్దు నుంచి కర్నూలు వరకు నిర్మాణం 
కొత్తూరు నుంచి తొండుపల్లి వరకు బెంగళూరు హైవే విస్తరణ 
బోయిన్‌పల్లి నుంచి కాల్లకల్‌ వరకు నిజామాబాద్‌ హైవే విస్తరణ 

సాక్షి, హైదరాబాద్‌: కొత్తగా ఆరు వరుసల హైవేలొస్తున్నాయి. గతంలో రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారులుగా ఉన్న కొన్నింటిని ఇటీవల కేంద్ర ప్రభుత్వం జాతీయ రహ దారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) పరిధిలోకి తెచ్చింది. ఇప్పుడు ఆ సంస్థ వాటిని ఆరు వరసల జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయనుంది. దీనికి సంబంధించి ఇటీవల డీపీఆర్‌లు రూపొందించి పంపగా, కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఆమోదముద్ర వేసింది.

ఇప్పుడు వాటికి క్రమంగా టెండర్లు పిలుస్తూ ఈ సంవత్సరంలోనే పనులు ప్రారంభించబోతోంది. ఇంతకాలం నగరంలో మినహా, వెలుపల ఆరువరసల రోడ్లు పెద్దగా పరిచయం లేదు. కీలక రహదారులు కావటంతో, ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకపోవటం, ప్రమాదాలు లేకుండా వాహనాలు వేగంగా గమ్యం చేరటం లక్ష్యాలుగా వీటిని ఆరు వరసలకు అభివృద్ధి చేయనున్నారు.  

సూరత్‌– చెన్నై ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రత్యేక ఎకనమిక్‌ కారిడార్‌ 
దేశంలో ఉత్తర–దక్షిణ రాష్ట్రాలను అనుసంధానిస్తూ కొత్తగా ఎక్స్‌ప్రెస్‌వేలను కేంద్రం అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గుజరాత్‌లోని సూరత్‌ నుంచి చెన్నై వరకు యాక్సెస్‌ కంట్రోల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మించనున్నారు. ఇందులో భాగంగా కొన్ని పట్టణాల మధ్య ఎకనమిక్‌ కారిడార్లను అభివృద్ధి చేస్తున్నారు.

అందులో ఒకటి 280 కి.మీ. నిడివి గల మహారాష్ట్రలోని అక్కల్‌కోట్‌ పట్టణం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు వరకు నిర్మించే కారిడార్‌. ఇందులో.. కర్ణాటక–తెలంగాణ సరిహద్దులో రాయచూర్‌–గద్వాల్‌ రోడ్డు నుంచి జూలెకల్‌ గ్రామం వరకు ఒక ప్యాకేజీగా, అక్కడి నుంచి కర్నూలు వరకు రెండో ప్యాకేజీగా ఇప్పుడు టెండర్లు పిలిచారు. రూ.1,870 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించనున్నారు.  

బెంగళూరు హైవేపై.. 
హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్లే 44వ నంబర్‌ జాతీయ రహదారిపై కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ రద్దీ అధికంగా ఉంది. దీంతో దాన్ని ప్యాకేజీలుగా చేసి ఆరు వరసల రోడ్డుగా విస్తరించాలని నిర్ణయించారు. హెచ్‌ఎండీఏ లిమిట్స్‌ ముగియగానే శంషాబాద్‌ దాటిన తర్వాత ఔటర్‌ జంక్షన్‌వద్ద ఉండే తొండుపల్లి నుంచి ఎగువన కొత్తూరు కూడలి వరకు 12 కి.మీ. ప్రాంతాన్ని ఆరు వరసలకు విస్తరించబోతున్నారు. ఇందుకు రూ. 410 కోట్లు వ్యయం చేయనున్నారు.  

అప్పా జంక్షన్‌–మన్నెగూడ విస్తరణకు టెండర్లు.. 
హైదరాబాద్‌ శివారులోని అప్పా జంక్షన్‌నుంచి వికారాబాద్‌ రోడ్డుపై పరిగి మలుపు సమీపంలో ఉండే మన్నెగూడ కూడలి వరకు 45.5 కి.మీ. మేర రోడ్డును నాలుగు వరసలు గా నిర్మించనున్న విషయం తెలిసిందే. రెండున్నరేళ్లలో ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  

నిజామాబాద్‌ హైవేలో.. 
హైదరాబాద్‌–నిజామాబాద్‌ జాతీయ రహదారిపై నగర శివారులో కొత్త కాలనీలు, వాణిజ్య కేంద్రాలు ఎక్కువగా వెలుస్తుండటంతో కొన్నేళ్లుగా ట్రాఫిక్‌ రద్దీ విపరీతంగా పెరుగుతూ వస్తోంది. దీంతో నగర శివారులోని బోయిన్‌పల్లి నుంచి మేడ్చల్‌ దాటిన తర్వాత కల్లకల్‌ వరకు రోడ్డును ఆరు వరసలుగా విస్తరించనున్నారు. దీన్ని రెండు ప్యాకేజీలుగా చేసి వెడల్పు చేయనున్నారు. బోయిన్‌పల్లి నుంచి గుండ్లపోచంపల్లి వరకు 10 కి.మీ. నిడివి రోడ్డును రూ.521 కోట్లతో విస్తరిస్తారు.

గుండ్లపోచంపల్లి నుంచి కల్లకల్‌ వరకు 17 కి.మీ. నిడివిని రూ.730 కోట్ల భారీ వ్యయంతో విస్తరించనున్నారు. ఈ రోడ్డులో కొంపల్లి–దూలపల్లి కూడలి వద్ద, జీడిమెడ్ల కూడలి వద్ద సినీప్లానెట్‌ సమీపంలో, రద్దీగా ఉండే సుచిత్ర కూడలిలో భారీ ఫ్లైఓవర్లు రానున్నాయి. ఇక ఇరుకుగా మారి తరచూ రోడ్డు ప్రమాదాలతో హడలెత్తిస్తున్న వరంగల్‌–కరీంనగర్‌ జాతీయ రహదారిని నాలుగు వరసలుగా విస్తరించబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే టెండర్లు పిలిచారు.   

మరిన్ని వార్తలు