ఒకప్పుడు మన రాజధాని కందూరు.. తాజాగా వెలుగులోకి

23 Jun, 2021 04:37 IST|Sakshi
కందూరులో పరిశీలిస్తున్న చరిత్రకారులు

సాక్షి, హైదరాబాద్‌: కందూరు.. ఇది మహబూబ్‌నగర్‌ జడ్చర్ల సమీపంలో ఉంది. ఇప్పుడు ఓ గ్రామంగా ఉన్న ఈ ప్రాంతం ఒకప్పుడు కందూరు చోళుల రాజధానిగా వెలుగొందింది. క్రీస్తుశకం 1025-1248 మధ్య కాలంలో కల్యాణి చాళుక్యులు, కాకతీయులకు సామంతులుగా కందూరు చోళులు స్వతంత్ర పాలన నిర్వహించారు. ఆనాటì  ఈ ప్రాంత వైభవం ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోయింది. తరచుగా వెలుగు చూస్తున్న అలనాటి గుర్తులు అప్పటి వైభవాన్ని చాటి చెబుతున్నాయి. తాజాగా విశ్రాంత పురావస్తు అధికారి, చరిత్ర పరిశోధకుడు, విజయవాడ కల్చరల్‌ సెంటర్‌ సీఈఓ ఈమని శివనాగిరెడ్డి మంగళవారం ఆ ప్రాంతాన్ని పరిశీలించి నాటి వివరాలు మరికొన్ని వెలుగులోకి తెచ్చారు. ఇనుప యుగం నాటి అరుదైన మానవ సమాధులు, కందూరు చోళుల పాలన కాలం నాటి శిల్పాలు, మందిర ఆనవాళ్లపై స్థానికులకు అవగాహన కల్పించారు. నాటి జ్ఞాపకాలు చెదిరిపోకుండా కాపాడాలని స్థానిక సర్పంచ్‌ మున్నూరు శ్రీకాంత్‌కు సూచించారు. శివనాగిరెడ్డి వెంట నల్లమల నేచర్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు పట్నం కృష్ణంరాజు తదితరులున్నారు.

అరుదైన రాక్షస గుళ్లు 
ఇది క్రీస్తుపూర్వం వెయ్యేళ్ల కిందటి ఇనుప యుగం నాటి మానవ సమాధి. సమాధి పైభాగంలో భారీ రాళ్లను వృత్తాకారంలో పేర్చి ఉండే ఈ నిర్మాణాలను రాక్షస గుళ్లుగా పేర్కొంటారు. కానీ వృత్తాకారంలో రాళ్లు రెండు వరసలుగా ఉండటం చాలా అరుదు. అలాంటి అరుదైన రాకాసి గుళ్ల సమాధి ఇది. రెండో వరస రాళ్ల పైభాగపు మొనలు మాత్రమే ఉపరితలంలో కనిపిస్తున్నాయి. వ్యవసాయం విస్తరణ కోసం అవగాహన లేక రైతులు తొలగించగా కేవలం నాలుగు మాత్రమే మిగిలాయి. ఇవి కూడా మాయమైతే స్థానిక భావితరాలకు వీటిని చూసే అవకాశం ఉండదు.

అద్భుత శిల్పకళా చాతుర్యం 
అద్భుత అలంకరణతో చిన్నచిన్న వివరాలను కూడా ఇట్టే గుర్తించగలిగే శిల్పకళా చాతుర్యం.. వెరసి ఇదో కమనీయ శిల్పం. 12వ శతాబ్దపు కల్యాణిచాళుక్యుల కాలం నాటి శిల్పుల నేర్పరితనానికి నిలువుటద్దం ఈ చెన్నకేశవస్వామి విగ్రహం. ఇటీవల అభివృద్ధి పనులు చేస్తుండగా ఇలా భూగర్భం నుంచి బయటపడింది. స్థానిక దేవాలయంలో పూజలందుకునే వేళ ముష్కరుల దాడిలో కొంత ధ్వంసమైంది. చేతి భాగాలు విరిగి ఉన్నాయి. మిగతా విగ్రహం అపురూపంగా కనిపిస్తోంది.

గుండుపై వీరగల్లు
ఇది ఓ వీరగల్లు. యుద్ధంలో వందమందిని మట్టి కరిపించిన స్థానిక వీరుడి స్మారకం. సాధారణంగా వీరగల్లులు విడిగా శిల్పాలుగా ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇలా గుండుపై చెక్కినవి చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ ఓ యుద్ధంలో శత్రువులను చీల్చి చెండాడి వీరమరణం పొందిన వీరుడిని నిరంతరం తలుచుకునేలా ఇలా గుండుపై చెక్కి సగర్వంగా నిలిపారు.   

మరిన్ని వార్తలు