కొత్త స్ట్రెయిన్లతో ‘దడ’.. తెలంగాణకు పొంచివున్న ముప్పు

22 Feb, 2021 00:42 IST|Sakshi

మహారాష్ట్రలో పుట్టుకొచ్చిన రెండు కరోనా వేరియంట్లు 

ఒకదానికి దక్షిణాఫ్రికా... మరోదానికి ఎన్‌–440కే స్ట్రెయిన్‌లతో పోలిక 

వేగంగా విస్తరించే లక్షణం ఉండటంతో భారీగా కేసులు 

వైరస్‌ సోకిన ఒకట్రెండు రోజుల్లోనే ఉపిరితిత్తుల్లో నిమ్ము 

వేగంగా క్షీణిస్తున్న అక్కడి రోగుల ఆరోగ్యం

సాక్షి, హైదరాబాద్‌: ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుతున్నాయని, వ్యాక్సిన్‌ పుణ్యమాని ఇక వైరస్‌ నిర్వీర్యం అవుతుందన్న భావనలో ఉండగా... మహారాష్ట్ర ముప్పు వణికిస్తోంది. అక్కడ పుట్టుకొచ్చిన రెండు కొత్త స్ట్రెయిన్లు దడ పుట్టిస్తున్నాయి. దేశంలో కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్‌ రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మొన్న మొన్నటివరకు యూకే కొత్త స్ట్రెయిన్‌తో గజగజ వణికిపోయాం. దక్షిణాఫ్రికా స్ట్రెయిన్‌తోనూ ఆందోళనకు గురయ్యాం. ఇప్పుడు మహారాష్ట్రలో పుట్టుకొచ్చిన రెండు కొత్త కరోనా వేరియంట్లతో వైరస్‌ వ్యాప్తి వేగంగా జరుగుతోంది.

అంతేకాదు మొదటి వేరియంట్‌కు భిన్నంగా ఈ కొత్త స్ట్రెయిన్లు రోగులపై పంజా విసురుతున్నాయి. మొదట్లో వచ్చిన స్ట్రెయిన్ల వల్ల వారం పది రోజులకు కొందరి ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరగా, ఇప్పుడు ఒకట్రెండు రోజులకే నిమ్ము చేరి పరిస్థితి సీరియస్‌ అవుతోంది. ఈ స్ట్రెయిన్లు ఇతర రాష్ట్రాలకు పాకితే పరిస్థితి ఏంటనే ఆందోళన అందరినీ వేధిస్తోంది. మహారాష్ట్రలో కొత్త స్ట్రెయిన్లు ఉన్నట్లు నిర్థారణ కావడంతో, సరిహద్దు రాష్ట్రం కర్ణాటక ప్రజా రవాణా వ్యవస్థలపైనా, ప్రయాణికుల రాకపోకలపైనా ఆంక్షలు విధించింది. మనదగ్గరి నుంచీ పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రకు నిత్యం రాకపోకలు అధికంగా ఉంటాయి. కానీ తెలంగాణ వైద్య యంత్రాంగం మాత్రం ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

అమరావతి, యావత్మాల్‌ జిల్లాల్లో పుట్టిన స్ట్రెయిన్లు 
మొదటి విడత కరోనాతో మహారాష్ట్ర అతలాకుతలమైంది. దేశంలో అత్యధికంగా అక్కడే కేసులు నమోదయ్యాయి. ఇప్పుడక్కడ మళ్లీ కరోనా కొత్త రూపంలో రాజుకుంది. మరో రెండు కొత్త స్ట్రెయిన్లు పుట్టుకొచ్చాయి. మహారాష్ట్రలో కోవిడ్‌ నియంత్రణ చర్యలు దేశంలోనే అధ్వానంగా ఉన్నాయని ఇటీవలి ఇండియన్‌ ఎకనమిక్‌ సర్వే తేల్చి చెప్పింది. అక్కడి అమరావతి జిల్లాలో నిత్యం వెయ్యి కేసుల వరకు నమోదు అవుతున్నాయి. దీంతో అక్కడ కరోనా వచ్చిన నలుగురు రోగులపై జన్యు విశ్లేషణ చేశారు. వారిలో కొత్తగా ఇ–484క్యూ అనే మ్యుటేషన్‌ను కనుగొన్నారు. ప్రమాదకరమైన దక్షిణాఫ్రికా వేరియంట్‌ ఇ–484కే అనే మ్యుటేషన్‌కు దగ్గరగా ఈ కొత్త వేరియంట్‌లో జన్యు మార్పులు కనిపించాయి. అలాగే అదే రాష్ట్రం యావత్మాల్‌ జిల్లాలో నలుగురిపై జన్యు విశ్లేషణ చేస్తే, గతంలో దక్షిణాది రాష్ట్రాల్లో కనిపించిన ఎన్‌–440కే మ్యుటేషన్‌కు దగ్గరగా ఉందని తేల్చారు. కేసుల వ్యాప్తిని ఆపకపోతే, ఇలాగే కొత్త స్ట్రెయిన్లు పుట్టుకొస్తాయని, మళ్లీ దేశమంతా విస్తరించే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

దేశంలో 31 జిల్లాల్లో భారీగా కేసులు 
దేశంలో 718 జిల్లాలకు గాను, 31 జిల్లాల్లో రోజుకు 100కు పైగా కేసులు వస్తున్నాయి. అందులో కేరళలో మొత్తం 13 జిల్లాల్లో 100కు పైగా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలోనూ 13 జిల్లాల్లో 100కు పైగా కొత్త కేసులు వస్తున్నాయి. 20వ తేదీన అమరావతి జిల్లాలో ఒకేరోజు వెయ్యి కేసులు నమోదయ్యాయి. పుణే, ముంబై, థానే, నాగ్‌పూర్, అమరావతి జిల్లాల్లో రోజుకు 500కు పైగా నమోదవుతున్నాయి. గత వారంలో కేరళలో ప్రతి పది లక్షల జనాభాలో 750 మందికి కొత్తగా వైరస్‌ సోకింది. ఈ సంఖ్య దేశంలోనే ఎక్కువ. అలాగే మహారాష్ట్రలో పది లక్షల జనాభాకు గత వారంలో 250 మందికి వైరస్‌ సోకింది. దేశవ్యాప్తంగా తీసుకుంటే సగటున ప్రతి పది లక్షల్లో గత వారంలో 60 మందికి కరోనా సోకింది. తెలంగాణలో 40 మందికి సోకినట్లు నిర్ధారణ అయింది. అయితే కేరళలో పంచాయతీ ఎన్నికలు, ఓనం పండుగ తర్వాత భారీగా కేసులు పెరిగాయి. అప్పటి నుంచి అదే ట్రెండ్‌ కొనసాగుతోంది. 

మరిన్ని కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం 
మహారాష్ట్రలో లాగా ఇతర ప్రాంతాల్లోనూ కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదముంది. మహారాష్ట్రలో రెండు కొత్త కరోనా వేరియంట్లు ప్రమాదకరంగా ఉన్నాయి. ఇతర ప్రాంతాల్లో కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయా లేదా అన్నదానిపై జన్యు విశ్లేషణ చేయాలి. కరోనా వ్యాక్సిన్‌ అందరికీ అందాకే ప్రమాదం పోతుంది. అందువల్ల జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. జనవరిలో దేశంలో ప్రతి వంద కేసుల్లో ఐదింటిపై జన్యువిశ్లేషణ చేయాలనుకున్నారు. కానీ అది పూర్తిస్థాయిలో జరగలేదు. ఇప్పటివరకు దేశంలో 8 వేల జన్యు విశ్లేషణలు చేశారు. అంటే 1,250 కేసుల్లో ఒక దానికి జన్యు విశ్లేషణ చేశారు. యూకేలో ప్రతీ 10 కేసుల్లో ఒకదానికి, ప్రపంచంలో ప్రతి 200కు ఒక జన్యు విశ్లేషణ చేశారు.
– డాక్టర్‌ కిరణ్‌ మాదల, క్రిటికల్‌ కేర్‌ విభాగాధిపతి, నిజామాబాద్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ 

వేగంగా విస్తరణ... 
ఇప్పటివరకు దేశంలో ఉన్న కరోనా మ్యుటేషన్ల వల్ల వైరస్‌ వ్యాప్తి జరిగిన దానికంటే... కొత్త వేరియంట్లు మరింత వేగంగా విస్తరిస్తున్నాయి. అంతేకాదు సాధారణ మ్యుటేషన్‌  సోకిన కరోనా రోగుల్లో కొందరిలో ఊపిరితిత్తుల్లో నిమ్ము వారం పది రోజుల్లో వస్తే, ప్రస్తుతం అమరావతి కొత్త వేరియంట్ల రోగుల ఊపిరితిత్తుల్లో ఒకట్రెండు రోజుల్లోనే నిమ్ము వచ్చినట్లు జన్యు విశ్లేషణలో తేలింది. నాగ్‌పూర్‌ నుంచి ఔరంగాబాద్‌ మధ్య రహదారి కనెక్టివిటీ ఎక్కువగా ఉండటం వల్ల భారీగా కేసులు నమోదవుతున్నాయని అంచనా.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు