డిజైన్లలో మళ్లీ మార్పులు

1 Aug, 2020 04:00 IST|Sakshi

కొత్త సచివాలయం నిర్మాణంపై సీఎం కేసీఆర్‌ సుదీర్ఘ సమీక్ష

తదుపరి భేటీలో డిజైన్ల ఖరారు

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ మళ్లీ కొన్ని మార్పులు సూచించడంతో మూడో సమావేశంలోనూ నూతన సచివాలయ డిజైన్లు ఖరారు కాలేదు. రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టేలా కొత్త సచివాలయ భవన సముదాయం నిర్మా ణం జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభిలషించారు. బయట నుంచి భవనం ఆకృతి అందంగా, ఆకట్టుకునేలా ఉండాలని కోరారు. లోపల సకల సదుపాయాలు ఉండాలని ఆదేశించారు. కొత్త సచివాలయం నిర్మాణంపై శుక్రవారం రాత్రి వరకు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.   చెన్నైకి చెందిన ఆర్కిటెక్టులు ఆస్కార్‌–పొన్ని రూపొందించిన డిజైన్ల ఆధారంగా సచివాలయం నిర్మించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

గత రెండు సమావేశాల్లో సీఎం కేసీఆర్‌ చేసిన సూచనల మేరకు ఆర్కిటెక్టులు సచివాలయం డిజైన్లకు మెరుగులు దిద్ది శుక్రవారం నాటి సమీక్షలో సీఎం ముందు ఉంచారు. ఈ డిజైన్లపై సీఎం కేసీఆర్‌ సుదీర్ఘంగా చర్చించారు. మరికొన్ని మార్పుచేర్పులు సూచించారు. మరిన్ని మెరుగులు దిద్దాలని సీఎం కోరినట్టు తెలిసింది. దీంతో ఇంకా తుది డిజైన్‌ ఖరారు కాలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరో వారం రోజుల్లో సీఎం సవరించిన డిజైన్లపై సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటారని అధికారులు తెలిపారు. సమీక్షా సమావేశంలో రోడ్లు, భవనాల శాఖ అధికారులు, ఆర్కిటెక్టులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు