మగ్గం నేసి.. భళా అనేసి!

16 Aug, 2022 15:17 IST|Sakshi

భూదాన్‌పోచంపల్లి: ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌వేల్‌ గవర్నర్‌ మార్గరేట్‌ బీజ్‌లీ ఏసీబీక్యూ చేనేత మగ్గంపై పోచంపల్లి ఇక్కత్‌ వస్త్రం నేసి అబ్బురపర్చారు. స్వాతంత్య్ర వజ్రో­త్స­వా­లను పురస్కరించుకుని ఇండియన్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమో­షన్, కేంద్ర జౌళి శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న పవర్‌హౌస్‌­మ్యూజియంలో ‘చరఖా అండ్‌ కర్గా’ పేరిట నిర్వహించిన చేనేత ఇక్కత్‌ కళా ప్రదర్శనలో పోచంపల్లికి చెందిన నేషనల్‌ హ్యాండ్లూమ్‌ మెరిట్‌ సర్టిఫికెట్‌ విన్నర్‌ తడక రమేశ్‌ ఇక్కత్‌ వస్త్రాల తయారీ ప్రత్యక్ష ప్రదర్శనను ఏర్పాటు చేశారు. 

సోమవారం భారతదేశ రాయబారి మనీష్‌ గుప్తా ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఆమె బీజ్‌లీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక్కత్‌ కళ ఎంతో నైపుణ్యంతో కూడుకొన్నదని కొనియాడారు. సిడ్నీలో మొదటిసారిగా ఇక్కత్‌ వస్త్ర తయారీ ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం తడక రమేశ్, మాస్టర్‌వీవర్‌ పాలాది యాదగిరిని భారత రాయబారి శాలువా కప్పి సన్మానించారు. (క్లిక్: సిడ్నీలో పోచంపల్లి ఇక్కత్‌ నేత ప్రదర్శన)

మరిన్ని వార్తలు