హైదరాబాద్‌లో ఉచితంగా 57 పరీక్షలు

22 Jan, 2021 12:57 IST|Sakshi

8 తెలంగాణ డయాగ్నోస్టిక్‌ కేంద్రాలు ప్రారంభం

హాజరైన మంత్రులు ఈటల, కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: భాగ్యనగరంలో రక్త, మూత్ర పరీక్షలతో పాటు ఇకపై ఎక్స్‌ రే, ఈసీజీ, ఆల్ట్రాసౌండ్‌, రేడియాలజీ పరీక్షలు ఉచితంగా అందనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో 8 తెలంగాణ డయాగ్నస్టిక్స్‌ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. లాలాపేట, శ్రీరాంనగర్‌, అంబర్‌పేట్‌, బార్కాస్‌, జంగంపేట, పానీపురా, పురానాపూల్‌, సీతాఫల్‌మండిల్లో ఉప ముఖ్యమంత్రి, మహమూద్‌ అలీ, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు, మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌, స్థానిక ఎమ్మెల్యేలు ప్రారంభించారు.

బస్తీ దవాఖానాల్లో పేదలకు ఉచిత వైద్య పరీక్షల కోసం డయాగ్నొస్టిక్స్‌ కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నట్లు వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. పేదలు వేలాది రూపాయలు ఖర్చుచేసి వేద్యం చేయించుకునే పరిస్థితి లేదని, వారికి అందుబాటులో ఉండేలా డయాగ్నోస్టిక్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కేంద్రాల్లో రోగులకు అవసరమైన పరీక్షలు నిర్వహిస్తారని లాలాపేట డయాగ్నొస్టిక్స్‌ కేంద్రం ప్రారంభోత్సవంలో మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే గాంధీ ఆస్పత్రిలో రూ.35 కోట్లతో అత్యాధునిక కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

57 రకాల పరీక్షలు
జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోని శ్రీరామ్‌నగర్‌లో ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలంగాణ డయాగ్నోస్టిక్‌ కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ కేంద్రాల ఏర్పాటుతో ర‌క్త ప‌రీక్ష‌లు, మూత్ర ప‌రీక్ష‌లు ఇప్ప‌టికే అందుబాటులోకి వ‌చ్చాయ‌ని, ఇప్పుడు కొత్త‌గా ఎంఆర్ఐ, ఆల్ర్టా సౌండ్, సిటీ స్కాన్ వంటి ప‌రీక్ష‌లు కూడా అందుబాటులోకి వస్తాయని మంత్రి కేటీఆర్‌ వివరించారు. డ‌యాగ్నోస్టిక్ సెంట‌ర్ల‌లో మొత్తం 57 ర‌కాల ర‌క్త ప‌రీక్ష‌ల‌ను చేస్తున్న‌ట్లు తెలిపారు. ప‌ట్ట‌ణ పేద‌ల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. డ‌యాగ్నోస్టిక్ సెంట‌ర్ల‌ను భ‌విష్య‌త్‌లో జిల్లా కేంద్రాల‌కు విస్త‌రించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని మంత్రి చెప్పారు.

మరిన్ని వార్తలు