Tiger: గబ్బర్‌ పులి వచ్చింది..

22 Aug, 2021 08:10 IST|Sakshi
ఇటీవల కిన్వట్‌ అటవీ ప్రాంతంలో పశువును వేటాడి కెమెరాకు చిక్కిన గబ్బర్‌ అనే మగపులి

సాక్షి, మంచిర్యాల(ఆదిలాబాద్‌): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అడవుల్లోకి మరో పులి అడుగుపెట్టింది. తిప్పేశ్వర్‌ నుంచి వచ్చిన గబ్బర్‌ పులి ఆదిలాబాద్‌ డివిజన్‌ సరిహద్దుల్లో సంచరిస్తోంది. మూడేళ్ల వయస్సున్న ఈ మగ పులి మహారాష్ట్ర, జిల్లాకు సరిహద్దుల్లో కిన్వట్, తలమడుగు అటవీ ప్రాంతంలో సంచరిస్తూ కెమెరాకు చిక్కింది. గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలోనే సంచరిస్తున్న ఈ బెబ్బులి కవ్వాల్‌ వైపు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

పెన్‌గంగా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి సమీపంలో కొత్త ఆవాసాన్ని వెతుక్కుంటూ ఇటువైపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పెన్‌గంగా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి చెందిన ఈ పులి ఆ ప్రాంతంలో కనిపించడం లేదని అక్కడి అటవీ అధికారులు గుర్తించారు. తిప్పేశ్వర్‌ టైగర్‌ రిజర్వులో పులుల సంఖ్య పెరిగి ఆవాసం, తోడుììæ పులుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంటున్నాయి. దీంతో తోడు, ఆవాసం కోసం ఇతర ప్రాంతాలను వెతుక్కుంటూ ఇటువైపు వస్తున్నవి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో పులి ఈ ప్రాంతంలోకి అడుపెట్టడంతో స్థానిక అధికారులు సంచరించే ప్రాంతంపై అప్రమత్తం అయ్యారు. 

కారిడార్‌లోనే నిత్యం సంచారం
కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు పరిధిలో కోర్‌ ప్రాంతంగా ఉన్న మంచిర్యాల జిల్లా జన్నారం డివిజన్‌ కవ్వాల్‌లో కన్నా బఫర్‌ ప్రాంతాల్లో పులుల సంచారం అధికమైంది. పులులు ఆదిలాబాద్‌ డివిజన్‌లోకి తిప్పేశ్వర్‌ నుంచి ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌ డివిజన్లకు తడోబా అందేరి పులుల సంరక్షణ కేంద్రం నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. ఎగువన పెన్‌గంగా, దిగువన ప్రాణహిత తీరాలను దాటుతూ కవ్వాల్‌లోకి అడుగుపెడుతున్నాయి.

కోర్‌ ప్రాంతంగా గుర్తించిన చోట కాకుండా బఫర్‌ ప్రాంతంగా టైగర్‌ కారిడార్‌లోనే పు లుల ఆవాసాలు పెరుగుతున్నాయి. తాజాగా గబ్బర్‌ పులి సైతం కారిడార్‌కే పరిమితం కాకుండా భీంపూర్, తలమడుగు, కిన్వాట్, బోథ్‌ మీదుగా కవ్వాల్‌ వైపు వెళ్లే అవకాశాలు లేకపోలేదు. గతంలోనూ జే1 అనే మగ పులి జన్నారంలో కోర్‌ ఏరియాలో కొంతకాలం సంచరించి తిరిగి కాగజ్‌నగర్‌ డివిజన్‌లోకే వెళ్లిపోయింది. ప్రస్తుతం అక్కడే సంచరిస్తోంది.

కాగజ్‌నగర్‌ డివిజన్‌లో పెద్దవాగు, ప్రాణహిత తీరాల్లో పులులు సంచరిస్తూ అక్కడే సంతానోత్పత్తిని పెంచుకుంటున్నాయి. తరచూ అక్కడ అడవులకు వెళ్లిన పశువులను వేటాడుతూ ఆకలి తీర్చుకుంటున్నాయి. అటవీ శాఖ కవ్వాల్‌లోని కోర్‌ ఏరియాలో పులుల స్థిర ఆవాసం కోసం గడ్డిక్షేత్రాల పెంపు, శాకాహార జంతువుల సంఖ్యను వృద్ధి చేయడం వంటి చర్యలు చేపట్టినా అక్కడ ఒక్క పులి స్థిర నివాసం ఏర్పర్చుకోలేకపోయింది. చుట్టపు చూ పుగా వస్తూ వెళ్తున్నాయే తప్ప ఇక్కడే ఆవాసం ఏర్పర్చుకోవడం లేదు. ఖానాపూర్‌ డివిజన్‌లో కోర్‌ గ్రామాల తరలింపు ప్రక్రియలో జాప్యం జరుగుతుండడంతో పులులు కారిడార్‌కే పరిమితం అవుతున్నాయి. 

పులి అలజడి 
పెంచికల్‌పేట్‌(సిర్పూర్‌): పెంచికల్‌పేట్, బెజ్జూర్‌ ప్రధాన రహదారిలోని లోడ్‌పల్లి అటవీ ప్రాంతంలో శనివారం పులి సంచరించింది. మోటార్‌సైకిళ్లపై వెళ్తున్న పలువురు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. పెంచికల్‌పేట్‌ రేంజ్‌ పరిధిలోని కొండపల్లి, లోడ్‌పల్లి, ఎల్లూర్, ఆగర్‌గూడ గ్రామ సమీపంలో సంచరిస్తూ పశువులపై దాడులకు తెగబడుతోంది. 15 రోజుల క్రితం లోడ్‌పల్లి ప్రధాన రహదారి పై సంచరించిన పెద్దపులి గ్రామ సమీపానికి వచ్చి మూడు పశువులపై దాడిచేసి హతమార్చింది.

వారం రోజుల క్రితం ఎల్లూర్‌ అటవీ ప్రాంతంలోకి మేతకు వెళ్లిన పశువుల మందపై దాడి చేసి మూడింటిని చంపింది. నిత్యం రేంజ్‌ పరిధిలోని ఏదో ఒకచోట దాడులకు తెగబడుతుండడంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పులుల సంచారంపై పెంచికల్‌పేట్‌ రేంజ్‌ అధికారి ఎస్‌.వేణుగోపాల్‌ను సంప్రదించగా.. రేంజ్‌ పరిధిలో నాలుగు పెద్ద పులులు ఏ1, ఏ2, కె8, ఎస్‌8 సంచారం ఉందని, అటవీ ప్రాంతంలో కి పశువుల కాపారులు, ప్రజలు వెళ్లరాదని సూ చించారు. లోడ్‌పల్లి, సల్గుపల్లి అటవీ ప్రాంతంలో సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రయాణాలు చేయరాదని సూచించారు.  

మరిన్ని వార్తలు