ఆర్టీసీకి లాభాల రుచి చూపాలి

22 Oct, 2021 03:26 IST|Sakshi
మేధోమథన సదస్సులో మాట్లాడుతున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌   

రెండు, మూడేళ్లలో బ్రేక్‌ ఈవెన్‌ 

భారీ కసరత్తు ప్రారంభించిన సజ్జనార్‌ బృందం 

చమురు ధర రూపాయి పెరిగితే సాలీనా ఆర్టీసీపై రూ.200 కోట్ల అదనపు భారం పడుతోంది. దీన్ని నివారించాలంటే అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరల హెచ్చుతగ్గులను అంచనా వేసి ఆయిల్‌ ప్రైస్‌ హెడ్జింగ్‌ ద్వారా ముందుగానే చమురు ధరను కోట్‌ చేసి బల్క్‌గా ఆర్డరిస్తే భారీ ఆదా అవుతుంది. నగరంలో ప్రధాన ప్రాంతాల్లో ఉన్న ఆర్టీసీ డిపోల్లో సింహభాగం వాటిని ఖాళీ చేసి ఔటర్‌ రింగురోడ్డు చేరువలో కొత్త డిపోలు ఏర్పాటు చేసుకోవాలి. నగరంలోని స్థలాలను వాణిజ్యపరంగా అభివృద్ధి చేస్తే ఆర్టీసీకి భారీగా ఆదాయం వస్తుంది.     
– సాక్షి, హైదరాబాద్‌ 

ఇవన్నీ ఆర్టీసీ అధికారుల ద్వారా వ్యక్తమైన కొన్ని సూచనలు. నష్టాలు, ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీని రెండు, మూడేళ్లలో బ్రేక్‌ ఈవెన్‌ స్థాయికి తీసుకెళ్లి క్రమంగా లాభాల బాటన నడిపించేందుక సంస్థ ఎండీ సజ్జనార్‌ భారీ కసరత్తు ప్రారంభించారు. అందులో భాగంగా అధికారులతో మేధోమథన సదస్సు నిర్వహించారు. వీటిని ఫలప్రదం అయ్యేలా నిర్వహించటంలో అనుభవం ఉన్న హంస ఈక్విటీ పార్ట్‌నర్స్‌ సంస్థ సౌజన్యంతో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సమావేశం నిర్వహించారు. బస్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రయంలో ఈడీలు, అన్ని విభాగాల అధిపతులు, కొందరు ఎంపిక చేసిన డీవీఎంలు, కొందరు డిపో మేనేజర్లు పాల్గొన్నారు. 

మూడు అంశాలు ప్రామాణికంగా.. 
ప్రయాణికుల సంతృప్తి.. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం.. ప్రభుత్వంపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఖర్చులు తగ్గించి ఆదాయాన్ని పెంచుకోవటం.. ఈ మూడు అంశాలు ప్రధాన ఎజెండాగా ఈ సదస్సు జరిగింది. పాల్గొన్న వారిని ఐదు సమూహాలుగా విభజించి, ప్రధాన ఎజెండాలోని మూడు అంశాలపై అంతర్గతంగా చర్చించుకుని సలహాలు ఆహ్వానించారు. వారి నుంచి వచ్చిన సూచనలపై చర్చిస్తూ సదస్సును నిర్వహించారు.

కొంతకాలంగా ఆర్టీసీకి దూరమవుతున్న ప్రయాణికులను తిరిగి రప్పించటం, వారి సంఖ్యను మరింత పెంచుతూ ఆర్టీసీని ప్రజలకు చేరువ చేయాలంటే పాటించాల్సిన అంశాలు, ఉద్యోగుల సంక్షేమం విషయంలో చేయాల్సిన మార్పులు, ఆర్టీసీ, కార్గో లాంటి దాని అనుబంధ విభాగాల్లో ఖర్చు తగ్గించి ఆదాయం మరింత పెరగాలంటే చేయాల్సిన పనులు.. ఇలా ఎన్నో సూచనలు వచ్చాయి. వాటి సాధ్యాసాధ్యాలపై చర్చించారు. 

నాలుగు బృందాలు.. నాలుగు సెమినార్లు.. 
ఇందులో వ్యక్తమైన అంశాలే కాకుండా, భవిష్యత్తులో మరిన్ని కొత్త ఆలోచనలను ప్రోది చేసి వాటిని ప్రాక్టికల్‌గా అన్వయించుకోవటం, చేయాల్సిన మార్పులపై సూచనలు చేయటం కోసం ఈడీల ఆధ్వర్యంలో నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు కొంతకాలం ఈ మేధోమధనంలో పనిచేయాల్సి ఉంటుంది. ఇందుకోసం మరో నాలుగు సెమినార్లు ఏర్పాటు చేస్తున్నారు. అవి పూర్తయ్యాక, అనుసంరించాల్సిన అంశాలపై ఓ స్పష్టత తెచ్చుకుని, ప్రాక్టికల్‌గా ఫలవంతమయ్యే వాటిని ఎంపిక చేసి అమలు ప్రారంభించాలని నిర్ణయించారు. ఇలా మరో రెండు నెలల తర్వాత అమలు కార్యాచరణ ప్రారంభించాలని నిర్ణయించారు. 

సూచనలు ఇవీ.. 
బస్సులు శుభ్రంగా ఉండాలి, ఆకట్టుకునేలా సిబ్బంది యూనిఫాంలో కనిపించాలి. ప్రయాణికులతో స్నేహంగా మెలగాలి. 
బస్సులు వేళకు రావాలి. వాటి నిర్వహణ, సమయ పట్టిక పూర్తి శాస్త్రీయం గా ఉండాలి. బస్సులు ఎక్కడ ఉన్నాయో, ఎప్పుడు వస్తాయో ప్రయాణికులకు తెలిసేలా జీపీఎస్‌ ఆధారిత ఆధునిక, సులభ పరిజ్ఞానం అమలు చేయాలి. 
ఒకటో తేదీన తప్పకుండా జీతాలు ఇస్తూ, కార్మికులు చనిపోతే కనీసం రూ.10 లక్షలు చెల్లించే బీమా వసతి ఉండాలి. 
ఆర్టీసీ కోఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ (సీసీఎస్‌)కి పూర్తి బకాయిలు చెల్లించి దాన్ని పూర్తిస్థాయిలో పునరుద్ధరించి దాని ద్వారా ఉద్యోగులు రుణాలు పొందే పరిస్థితి అవసరం.  
స్లీపర్‌ సర్వీసులను ఆర్టీసీలో ప్రారంభించాలి. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాం తాల్లో వీలైనన్ని ఎక్కువ ట్రిప్పులు తి ప్పుతూ, రద్దీ అంతంత మాత్రంగా ఉ న్న ప్రాంతాల్లో ట్రిప్పుల సంఖ్య తగ్గించాలి. ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించే వారికి రాయితీ ధరలు కల్పించాలి.  

మరిన్ని వార్తలు