కొంగొత్త అంగడి.. నగరంలో ఇక ప్రతిరోజు మార్కెటే!

8 Apr, 2021 18:13 IST|Sakshi

ఒకే చోట ఫ్యాన్సీ, జనరల్‌ ఐటెమ్స్‌ రోడ్ల వెంబడి

ఖాళీ స్థలాల్లో ఏర్పాటు సిద్ధమవుతోన్న జీహెచ్‌ఎంసీ  

 పైలట్‌ ప్రాజెక్టుగా మెట్టుగూడలో.. త్వరలో ప్రారంభం  

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో వెరైటీ కొంగొత్త మార్కెట్లు రూపుదిద్దుకుంటున్నాయి. కాలనీల్లో ఇప్పుడు వారం వారం నిర్వహిస్తున్న కూరగాయల సంతల మాదిరిగానే కొన్నిచోట్ల రోజూ మార్కెట్‌ నిర్వహించేలా జీహెచ్‌ఎంసీ ఆలోచన చేసింది. ఇందుకు ప్రభుత్వ ఖాళీ స్థలాలు, రోడ్ల వెంబడి ఉన్న స్థలాలను ఎంపిక చేశారు. ఇక్కడ జనరల్, ఫ్యాన్సీ తదితర సామగ్రి అమ్మకాలను చేపడతారు. రోడ్ల పక్కన ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాలు చెత్త నిలయాలుగా, జులాయిలకు అడ్డాలుగా మారుతుండటంతో ఆ పరిస్థితిని మార్చే ందుకు చేసిన ఆలోచనల్లోంచి జనరల్, ఫ్యాన్సీ, తదితర వస్తువులమ్మే ఈ వెరైటీ మార్కెట్‌ ఆవిర్భవించింది.  
మార్కెట్లు ఇలా.. 

► ఆయా ఖాళీ ప్రదేశాలలో దుకాణాలు ఏర్పాటు చేసుకునేలా పైన కప్పుతో పాటు కనీస సదుపాయాలు కలిపించి అంగడి మాదిరిగా చిరువ్యాపారులు తమ సరుకులు అమ్ముకునేందుకు ఏర్పాట్లు చేస్తారు.  

 వీటిల్లో స్థలాలను ఎవరికీ పర్మినెంట్‌గా కేటాయించరు. ఎవరు ముందు వస్తే వారు ఖాళీగా ఉన్న ప్రదేశంలో సరుకుల్ని అమ్ముకోవచ్చు.  

 ఇందుకు ఎలాంటి చార్జీ వసూలు చేయరు. పరిశుభ్రంగా నిర్వహణ చేయాల్సి ఉంటుంది.   

 ప్లాస్టిక్‌ బకెట్లు, మగ్గులు, దువ్వెన్లు, అద్దాలు వంటివాటి నుంచి లేడీస్‌ కార్నర్‌లో లభించే అన్ని వస్తువులు, ఇతరత్రా వివిధ రకాల ఫ్యాన్సీ, జనరల్‌  సామాగ్రిని చిరు వ్యాపారులు ఈ మార్కెట్‌లో అమ్ముకోవచ్చు.  చిన్న చిన్న వస్తువులు, సరుకులు అవసరమైన స్థానికులకే కాక, ఆ దారిలో  వెళ్లే వారికి  కూడా   ఈమార్కెట్‌లు ఎక్కువగా ఉపయోగపడగలవని భావిస్తున్నారు.  

 మెట్టుగూడలో ఖాళీగా ఉన్న ప్రదేశంలో రూ.50 లక్షల వ్యయంతో ఇలాంటి మార్కెట్‌ను సిద్ధం చేశారు. త్వరలోనే దీన్ని ప్రారంభించనున్నట్లు సికింద్రాబాద్‌ జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి తెలిపారు. దాదాపు అరవై మంది చిరువ్యాపారులకు  ఇది ఉపయోగపడగలదన్నారు. ప్రతిరోజూ ఉండే ఈ మార్కెట్‌లో చిరువ్యాపారులు పాటించాల్సిన విధివిధానాలు, తదితరమైనవి రూపొందించి  త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.   

మరిన్ని వార్తలు