Rear Seat Belt: ‘కారు సీటు బెల్ట్‌’పై తర్జనభర్జన! 

14 Nov, 2022 02:36 IST|Sakshi

వెనక కూర్చొన్న వ్యక్తీ ధరించాలనేది నిబంధన 

అమలులో క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు 

పునరాలోచనలో ట్రాఫిక్‌ ఉన్నతాధికారులు 

సాక్షి, హైదరాబాద్: కారు ప్రయాణంలో సీటు బెల్ట్‌ పెట్టుకోకపోవటంతో జరిగే ప్రమాదాలను నివారించేందుకు కేంద్రం వాహన చట్టం నిబంధనలను మరింత కఠినతరం చేసింది. కారు నడిపే డ్రైవర్‌ మాత్రమే కాదు వెనకాల కూర్చున్న వ్యక్తులూ సీటు బెల్ట్‌ పెట్టుకోవాల్సిందేనని, లేకపోతే మోటారు వాహన చట్టం సెక్షన్‌ 194 బీ ప్రకారం రూ.1,000 జరిమానా విధించాలని నిర్ణయించింది. 8 సీట్ల లో పు ఉన్న అన్ని ప్యాసింజర్‌ వాహనాలకు ఈ చ ట్టం వర్తిస్తుంది. అయితే ఈ నిర్ణయం అమలులో క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు కలుగుతాయని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసు ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. దీంతో ఆయా నిబంధనల అమలుపై అధికారులు పునరాలోచనలో పడినట్లు తెలిసింది. 

విజన్‌ ఉండదు.. 
బైక్‌ రైడర్‌కి హెల్మెట్, కారు నడిపేవారికి సీటు బెల్ట్‌ రక్షణ కల్పిస్తుంది. కానీ, కారులో డ్రైవర్‌ మినహా ముందు, వెనక కూర్చున్న వారు సీటు బెల్ట్‌ను పెట్టుకోవటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. పోలీసులు కూడా బెల్ట్‌ పెట్టుకోని డ్రైవర్‌ను మాత్రమే గుర్తించి జరిమానా విధించేవారు. కారు ప్రమాదంలో వెనకాల వ్యక్తులకూ ప్రాణ నష్టం వాటిల్లుతుండటంతో కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అ యితే ఈ నిబంధన అమలు సాంకేతికంగా ట్రాఫిక్‌ సమస్యలకు కారణమవుతోంది.

రోడ్డు మీద జంక్షన్‌లో ఉన్న కానిస్టేబుల్‌కు వేగం కారణంగా వాహనాల లోపల వ్యక్తులు స్పష్టంగా కనిపించరు. నిరిష్టంగా వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తే తప్ప వెనకాల వ్యక్తి సీటు బెల్టు పెట్టుకున్నాడో లేదో తెలియదు. పోనీ ప్రయాణంలో ఉన్న కారును రోడ్డు మీద ఆపి తనిఖీ చేస్తే ట్రాఫిక్‌ జాం అయ్యే ప్రమాదం ఉంది. ఇతర వాహనదారులకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉందని పలువురు ట్రాఫిక్‌ కానిస్టేబుల్స్‌ ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావించారు.  

ఇలా చేస్తే బెటర్‌.. 
దీంతో ఈ నిబంధనను అమలు చేసేందుకు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించారు. ఇతర ట్రాఫిక్‌ నిబంధనల అతిక్రమణ సమయంలో కారును ఆపినప్పుడు వెనకాల వ్యక్తి సీటు బెల్టు పెట్టుకున్నాడో లేదా గమనించి, ఒకవేళ పెట్టుకోకుంటే చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దీనికంటే ముందు సీటు బెల్ట్‌ ప్రాధాన్యతపై వాహనదారులకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు.

సీటు బెల్ట్‌ పెట్టుకోకపోవటం వల్ల జరిగే ప్రమాదాలను వివరిస్తూ ప్రత్యేక అవగాహన ఆల్బమ్‌ను రూపొందిస్తున్నారు. ట్రాఫిక్‌ జంక్షన్ల వద్ద అవగాహన కల్పించనున్నారు. డ్రైవ్‌ చేసే వారితో పాటు కారులోని మిగతా వారికీ ప్రమాదాల గురించి వివరించనున్నారు. కరపత్రాలు, డిజిటల్‌ సూచికలతో ప్రచారం చేసేలా ప్లాన్‌ చేశారు.  

మరిన్ని వార్తలు