ట్విస్ట్‌ : శ్రీశైలం అగ్ని ప్రమాదంలో కొత్త కోణం

25 Aug, 2020 15:35 IST|Sakshi

శ్రీశైలం అగ్ని  ప్రమాదంపై భిన్న స్వరాలు

సాంకేతిక లోపమా..? లేక మానవ తప్పిదమా..?

సాక్షి, హైదరాబాద్‌ : శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. విద్యుత్ షార్ట్ సర్క్యుట్ కారణమని అంతా భావిస్తున్న నేపథ్యంలో.. తాజాగా మరో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ప్రమాద సమయంలో కొత్త బ్యాటరీలు అమర్చున్న తరణంలోనే అగ్ని ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. అర్దరాత్రి వేళ బ్యాటరీలు మార్చాల్సిన అవసరం ఏముంది..? బ్యాటరీలు అమర్చే సమయంలో జరిగిన పొరపాటే 9 మంది ప్రాణాలు బలితీసుకున్నాయా..? ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు జన్‌కోలో పనిచేసి ఉద్యోగుల్లో వ్యక్తమవుతుంది.

శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ ప్రమాదంపై సీఐడి విచారణ ముమ్మరం చేసింది. దర్యాప్తుకు కావాల్సిన పూర్తి స్థాయి ఆధారాల కోసం ప్రయత్నాలు చేస్తుంది. ఓ వైపు సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమా..? లేక మానవ తప్పిదం ఉందా..? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదంతా సాంకేతికమైన అంశం కావడంతో ప్రధానంగా యూనిట్ల పనితీరు, తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. అందుకోసం విద్యుత్ రంగ నిపుణుల సహకారం, ఉద్యోగుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఐతే సీఐడి విచారణ ఇలా కొనసాగుతుండగానే ప్రమాదం రోజుకో ఒకరమైన వాదనలు వెలుగు చూస్తున్నాయి. ఆ వాదనలు ప్రమాదం ముమ్మాటికి మానవ తప్పిదాలే కారణం అన్న ప్రచారం సాగుతుంది. (కొంపముంచిన అత్యవసర స్విచ్‌!)

220 కేవీకి డీసీ కరెంటు సరఫరాకు బ్యాటరీలు బిగించే సమయంలో ప్యానల్ బోర్డులో మంటలు వచ్చి అగ్ని ప్రమాదం జరిగిందని జన్‌కో ఉద్యాగులు భావిస్తున్నారు. జనరేటర్‌ను నియంత్రించే సెన్సార్ కు నేరుగా విద్యుత్ సరఫరా కాకపోవడంతో లోడ్ పెరిగి మంటలు చెలరేగినట్టు అధికారులు అనుకుంటున్నారు. ప్రమాదం జరిగిన రోజున హైద్రాబాద్ జల సౌదాలో సీఈ స్థాయిలో ఉన్న ఓ అధికారి వచ్చి బ్యాటరీలను మార్పించే పనులను హడావిడిగా చేశారన్న గుసగులు వినిపిస్తున్నాయి. ఇక్కడ సీఈ ఉన్నా ఆయన ప్రమేయం లేకుండానే సదరు అధికారే నలుగురిని తీసుకువచ్చి బ్యాటరీ మార్పిడి కార్యక్రమం చేపట్టినట్టు సమాచారం. అక్కడ పనిచేస్తున్న డీఈ, ఏఈ హడాహుడి పనులపై అభ్యంతరం వ్యక్తం చేసినా పట్టించుకోకుండా నేను చెప్పింది చేయాల్సిందేనని హుకుం జారీ చేసినట్టు తెలుస్తుంది. ఈ సందర్భంలో ఇక్కడి నుంచి బదిలీ ఐన ఓ డీఈ రిలీవ్ అంశం ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. బ్యాటరీలను మార్చాలని రెండేళ్ల క్రితమే ప్రతిపాదించినా... ఇంత జాప్యం జరగడం వెనక ఈ తతంగం నడిపిన సీఈ హస్తం ఉన్నట్టు తెలుస్తుంది. అంతే కాకుండా అర్దరాత్రి సమయంలో హడావిడిగా బ్యాటరీల మార్పు వెనక కూడా ఈయన హస్తం ఉందని స్పష్టమౌతుంది. (శ్రీశైలం ప్రమాదం: మృతుల చివరి సంభాషణ)

ఐతే ఈ దారుణ ఘటనపై అనుమానాలు, వాదనలు, విమర్శలు ఎలా ఉన్నా... ఈ నిర్లక్ష్యానికి ప్రభుత్వం  మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్ప లేదు. ప్రస్తుతం జల విద్యుత్ కేంద్రం మళ్లీ పూర్వ వైభవానికి నోచుకోవాలంటే వేల కోట్లకు పైగా ఖర్చు చెయ్యక తప్పని పరిస్థితి నెలకొంది. అంతే కాదు ప్రమాదానికి గురైన యూనిట్లలో కొన్ని పరికరాలను జపాన్ కు ఆర్డర్ పై తెప్పించాల్సి ఉండటంతో పునరుద్దరణకు నెలలు సమయం పట్టే అవకాశాలున్నాయి. మొత్తంగా ఏది ఏమైనా పూర్తి స్థాయిలో విచారణ జరిగి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరిన్ని వార్తలు