Hyderabad New Year Events: ఇయర్‌ వేడుకలకు గ్రీన్‌ సిగ్నల్‌.. అరకొరే...అయినా హుషారే... 

30 Dec, 2021 08:21 IST|Sakshi

నిర్వాహకుల్లో కొత్త ఉత్సాహం

పలు ఈవెంట్లకు రంగం సిద్ధం

కోవిడ్‌ రూల్స్‌ తప్పక పాటించాల్సిందే... 

సాక్షి, హైదరాబాద్‌: న్యూ ఇయర్‌ వేడుకలకు అడ్డంకి తొలగిపోయింది. పార్టీ ప్రియత్వం ఉప్పొంగిపోతోంది. అయితే షరతులు వర్తిస్తాయి అంటున్న ప్రభుత్వం... హద్దులు దాటితే కేసుల పద్దులు తప్పవంటోంది. మరోవైపు కరోనా పరిస్థితుల్లో కళావిహీనమైన ఈవెంట్‌ పరిశ్రమకు న్యూ ఇయర్‌ వేడుకలతో పునరుత్తేజం తప్పక తిరిగొస్తుందని ఈవెంట్‌ మేనేజర్లు ఆశిస్తున్నారు. 

దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో న్యూ ఇయర్‌ వేడుకలపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో, కొన్ని రాష్ట్రాల్లో నైట్‌ కర్ఫ్యూ ప్రకటించిన పరిస్థితుల్లో తెలంగాణలో ఈ ఏడాది వేడుకలు జరుగుతాయా లేదా అనే సందిగ్థం ఏర్పడింది. మన దగ్గరా లాక్‌డౌన్‌ పెడతారంటూ పుకార్లు కూడా షికారు చేశాయి. అయితే వీటన్నింటికీ తెర దించుతూ నయాసాల్‌ జోష్‌కి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో ఇప్పటిదాకా మీమాంసలో ఉన్న ఈవెంట్‌ ఆర్గనైజర్లు హడావిడిగా ఏర్పాట్లు ప్రారంభించారు.  
చదవండి: హైదరాబాద్‌ కొత్త సంవత్సర వేడుకలు.. కండిషన్స్‌ అప్లై

అరకొరే...అయినా హుషారే... 
నగరంలో నూతన సంవత్సర వేడుకలకు ప్రధాన వేదికలుగా మారే పబ్స్, క్లబ్స్, రిసార్ట్స్‌లలో కొన్ని ముందస్తు ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉండగా, మరికొన్ని ఆదరా బాదరా సిద్ధమవుతున్నాయి. తమ అతిధులకు, సభ్యులకు పూర్తిగా కాకున్నా ఎంతో కొంత సంబరాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో అందుబాటులో ఉన్న డిజెలతో, రాక్‌ బ్యాండ్స్‌తో రాక్‌ స్పీడ్‌తో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.

సిటీలో ఈవెంట్స్‌ జరిగే పరిస్థితి లేదనే ఆలోచనతో గోవా తదితర ప్రాంతాలకు తరలిపోయిన వీజేలు, డిజెలను కూడా వెనక్కు రప్పిస్తున్నారు.  మొత్తంగా చూస్తే ఈ సారి సిటీకి సెలబ్రిటీల రాక దాదాపుగా లేనట్టే.  లైవ్‌ మ్యూజిక్, ఫుడ్, ఇండోర్‌ గేమ్స్, యాంకర్, ఫైర్‌ వర్క్స్‌ వంటి సాదా సీదా సరదాలతోనే సందడి పూర్తి చేయనున్నారు. పోలీసుల సూచనల మేరకు వీరు ప్రకటిస్తున్న నిబంధనల జాబితా కార్యక్రమాల జాబితాకు రెట్టింపు ఉంది.

దిగొచ్చిన ఎంట్రీ ధర... 
సిటీలో అన్ని పేరొందిన పబ్స్, క్లబ్స్‌ న్యూ ఇయర్‌ ఈవెంట్లను నిర్వహిస్తున్నాయి. అయితే చరిత్రలోనే ఎన్నడూ లేనంత తక్కువ ధరలకే ఈ సారి ఎంట్రీ పాస్‌లు అందుబాటులోకి రావడం విశేషం. ప్రత్యేక మెనూ, సంగీతం...తదితర చిన్న చిన్న ఆకర్షణలు తప్ప మరేమీ లేకపోవడంతో కనీస ధర రూ.1000 ఆపైనకు తగ్గిపోయింది. కోవిడ్‌ నిబంధనల అమలు కఠినంగా ఉండబోతున్న నేపధ్యంలో పార్టీలకు వెళ్లాలనుకున్న సిటిజనులు జాగ్రత్తలు తీసుకోవాలి.

>
మరిన్ని వార్తలు