Hyderabad: న్యూ ఇయర్‌ వేడుకలు.. ఇవి అస్సలు మరవద్దు!

31 Dec, 2022 08:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: న్యూ ఇయర్‌ పార్టీ విషయంలో సభ్యత, భద్రత మరువద్దని నగర పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇతరులకు ఇబ్బంది కలుగకుండా వీటిని నిర్వహించుకోవాలని చెప్తున్నారు. సాధారణ సమయాల్లో హోటళ్లు, పబ్స్, క్లబ్స్‌ను రాత్రి 12 వరకే తెరిచి ఉంచాలి. అయితే న్యూ ఇయర్‌ పార్టీల నేపథ్యంలో ఒక గంట అదనంగా అనుమతించనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి ఒంటి గంట తరవాత ఏ కార్యక్రమం కొనసాగకూడదని స్పష్టం చేస్తున్నారు. పోలీసులు జారీ చేసిన మార్గదర్శకాలివి.. కార్యక్రమాలకు వచ్చే ఆర్టిస్టులు, డీజేలకూ నిబంధనలున్నాయి.

►వీరి వస్త్రధారణ, హావభావాలు, పాటలు తదితరాల్లో ఎక్కడా అశ్లీలం, అసభ్యతలకు తావుండకూడదు. అక్కడ ఏర్పాటు చేసే సౌండ్‌ సిస్టం నుంచి వచ్చే ధ్వని తీవ్రత 45 డెసిబుల్స్‌ మించకూడదు.

►ఇళ్లు, అపార్ట్‌మెంట్స్‌లో వ్యక్తిగత పార్టీలు నిర్వహిస్తున్న వాళ్లూ పక్కవారికి ఇబ్బంది లేకుండా సౌండ్‌ సిస్టమ్‌ పెట్టుకోవాలి. న్యూ ఇయర్‌ కార్యక్రమాల్లో ఎక్కడా మాదకద్రవ్యాల వినియోగానికి తావు లేకుండా చూడాలి. వీటిని సేవించి వచ్చే వారినీ హోటల్స్, పబ్స్‌ నిర్వాహకులు అనుమతించకూడదు.

►యువతకు సంబంధించి ఎలాంటి విశృంఖలత్వానికి తావు లేకుండా, మైనర్లు పార్టీలకు రాకుండా నిర్వాహకులు చూసుకోవాలి. బౌన్సర్లు అతిగా ప్రవర్తించినా, ఆహుతులకు ఇబ్బందులు కలిగించినా వారితో పాటు ఏర్పాటు చేసిన సంస్థల పైనా చర్యలు తప్పవు.

►నిబంధనల పర్యవేక్షణ, నిఘా కోసం 150 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. వీరు కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో తనిఖీలు చేయడం, వాటిని చిత్రీకరించడంతో పాటు ఆడియో మిషన్ల సాయంతో శబ్ధ తీవ్రతనూ కొలుస్తారు. పోలీసులు నెక్లెస్‌రోడ్, కేబీఆర్‌ పార్క్‌రోడ్, బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.1, 2, 45, 36లతో పాటు జూబ్లీహిల్స్‌ రోడ్‌నెం. 10, సికింద్రాబాద్, మెహదీపట్నం, గండిపేట దారుల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు.
చదవండి: New Year Celebrations: అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో ..

►ఇక్కడ రేసులు, డ్రంకన్‌ డ్రైవింగ్‌ పైనా కన్నేసి ఉంచుతారు. బహిరంగ ప్రదేశాల్లో టపాసులు కాల్చడం నిషిద్ధం. వాహనాల్లో ప్రయాణిస్తూ, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చేస్తే చర్యలు తప్పవు. వాహనాలు టాప్స్, డిక్కీలు ఓపెన్‌ చేసి డ్రైవ్‌ చేయడం, కిటికీల్లోంచి టీజింగ్‌ చేయడం వంటిని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తారు.  

‘సాగర్‌’ చుట్టూ నో ఎంట్రీ... 
కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, దురుసుగా డ్రైవింగ్‌ చేయడం, మితిమీరిన వేగం, పరిమితికి మంచి వాహనాలపై ప్రయాణించడం చేయకూడదని పేర్కొన్నారు. శాంతి భద్రతల విభాగం అధికారులతో పాటు ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తారని, ఉల్లంఘనలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.

ట్యాంక్‌ బండ్‌ పైన భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా హుస్సేన్‌సాగర్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు విధించారు. శనివారం రాత్రి 10 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ఎన్టీఆర్‌ మార్గ్, నెక్లెస్‌రోడ్, అప్పర్‌ ట్యాంక్‌ బండ్‌లపై వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. ప్రత్యామ్నాయాలు లేని బేగంపేట, లంగర్‌హౌస్‌ ఫ్లైఓవర్‌ మినహా మిగిలిన అన్ని ఫ్లైఓవర్లను శనివారం రాత్రి మూసి ఉంచుతారు.  

ఓఆర్‌ఆర్, వంతెనలు బంద్‌ 
నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో ఔటర్‌ రింగ్‌ రోడ్డు, పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వేలపై వాహనాలకు అనుమతి లేదు. నేడు రాత్రి 11 గంటల నుంచి 1న ఉదయం 5 గంటల వరకు ఈ అంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. విమాన టికెట్, ఇతరత్రా ధ్రువీకరణ పత్రాలు చూపించిన ప్రయాణికులను మాత్రమే ఆయా మార్గలలో అనుమతి ఇస్తారు.

అలాగే దుర్గం చెవురు కేబుల్‌ బ్రిడ్జి, శిల్పా లైఅవుట్‌ ఫ్లైఓవర్, గచ్చిబౌలి, బయోడ్రైవర్సిటీ, షేక్‌పేట్, మైండ్‌స్పేస్, రోడ్‌ నం–45, సైబర్‌ టవర్, ఫోరంమాల్‌–జేఎన్‌టీయూ, ఖైత్లాపూర్, బాబు జగ్జీవన్‌రామ్‌ ఫ్లైఓవర్లు రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు పూర్తిగా బంద్‌ ఉంటాయి. అలాగే నాగోల్, కామినేని ఫ్లైఓవర్లు, ఎల్బీనగర్, చింతలకుంట అండర్‌పాస్‌లు రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు ద్విచక్ర వాహనాలకు, ప్యాసింజర్‌ వాహనాలకు అనుమతి లేదు.  

మరిన్ని వార్తలు