కొత్త జోన్లు: మన ఉద్యోగాలు ఇక మనకే!

3 May, 2021 10:43 IST|Sakshi

కరీంనగర్‌ అర్బన్‌: రాష్ట్రంలో కొత్త జోనల్‌ వ్యవస్థకు రాజముద్ర పడింది. ఇక నియామకాల్లో నూతన అధ్యాయం మొదలు కానుంది. ఏ స్థాయి పోస్టులైనా 95 శాతం స్థానికులకే అవకాశం దక్కనుంది. ఈ క్రమంలో శాఖల వారీగా ఖాళీ పోస్టుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. నూతన జోన్ల ప్రకారమే పోస్టుల భర్తీ ఉండనుందని కలెక్టరేట్‌ వర్గాలు తెలిపాయి. ఉమ్మడి జిల్లాలో ఉన్న విధానానికి మంగళం పాడుతూ నూతన విధానాన్ని ప్రవేశపెట్టగా గత లోపభూయిష్ట విధానాలకు చరమగీతం పాడుతూ అటెండర్‌ నుంచి గెజిటెడ్‌ అధికారి వరకు అన్ని శాఖల్లో ఒకే విధానముండేలా సవరణలు చేసిన సంగతి తెలిసిందే. ఉద్యోగుల్లో ఉన్న భయాందోళనలను తొలగిస్తూ పాత ఉద్యోగులు అలాగే ఉండనుండగా జారీ అయ్యే ఉద్యోగ ప్రకటనల దరిమిలా నూతన విధానం కొనసాగనుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

గతంలో జరిగిన ఉద్యోగ నియామకాల్లో స్థానికేతర పోస్టుల్లో గల మూస ధోరణికి అడ్డుకట్ట వేయగా.. ఇక స్థానికులను ఉద్యోగాలు వరించనున్నాయి. మొత్తానికి ఏళ్లుగా ఊరిస్తున్న జోనల్‌ వ్యవస్థకు పచ్చజెండా ఊపడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఉద్యోగులు, అధికారులకు పదోన్నతులు, బదిలీలకు సముచిత స్థానమిస్తూ జిల్లాలను విభజించి జోన్లుగా ఖరారు చేయగా, కరీంనగర్‌ను రాజన్న జోన్‌గా ఖరారు చేశారు. మల్టీజోన్లుగా రాజన్న, కాళేశ్వరం, బాసర, భద్రాద్రిని ఏర్పాటు చేశారు.

ఉమ్మడి జిల్లా మూడు ముక్కలు
జిల్లాల విభజనతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్‌ జిల్లాలుగా విభజింపబడిన విషయం విదితమే. ఇక హుస్నాబాద్‌ సిద్దిపేట జిల్లాలో కలవగా మంథని డివిజన్‌లోని పలు మండలాలు భూపాలపల్లి జిల్లాకు, కమలాపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలు వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో కలిశాయి. ఈ క్రమంలో మళ్లీ జోనల్‌ వ్యవస్థ తెరపైకి రావడంతో వివిధ జోన్లలో కలిశాయి. జిల్లాలు విభజింపబడగా బదిలీలు, పదోన్నతులు పాతజిల్లా ప్రకారం ఉండనుండగా కొత్తగా నియామకమైన వారికి నూతన వి«ధానం అమలుకానుంది. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలు రాజన్న జోన్‌లో చేర్చగా పెద్దపల్లి జిల్లాను కాళేశ్వరం జోన్‌లో, జగిత్యాల జిల్లాను బాసర జోన్‌లో చేర్చారు.

నూతన విధానంతో ప్రయోజనాలు..
ఇప్పటివరకు కొనసాగుతున్న నియామక ప్రక్రియలో జిల్లాస్థాయి పోస్టులకు సంబంధించి 80 శాతం స్థానికత, 20 శాతం ఓపెన్‌ కేటగిరీ ఉండేది. జోనల్‌ స్థాయిలో 70 శాతం స్థానికత, 30 శాతం ఓపెన్‌ కేటగిరీ, రాష్ట్రస్థాయిలో 60 శాతం స్థానికత, 40 శాతం ఓపెన్‌ కేటగిరీలో పోస్టులను భర్తీ చేసేవారు. దీంతో స్థానికత విషయంలో బాగానే ఉన్నా ఓపెన్‌ కేటగిరీలో మాత్రం అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా, జోనల్, రాష్ట్రస్థాయి పోస్టులన్నీ 95 శాతం స్థానికత 5 శాతం స్థానికేతరులకు కేటాయించడంతో మన ఉద్యోగాలు మనకేనని స్పష్టమవుతోంది. ఏ స్థాయి పోస్టులైనా ఇదే విధానం అమలు కానుండటంతో వేల పోస్టులు తెలంగాణ యువతకు దక్కనున్నాయి.  

రాజన్న జోన్‌లో కరీంనగర్, రాజన్న సిరిసిల్ల
నూతన కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలు రాజన్న జోన్‌లో చేరనుండగా 43.09 లక్షల జనాభా ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్‌ జిల్లాలు కలిపి రాజన్న జోన్‌గా ఉండనుండగా జోనల్‌ పోస్టులన్నింటినీ ఈ పరిధిలో బదిలీలు, పదోన్నతులు చేపట్టనున్నారు. ఇక అన్ని శాఖలకు ఒకే విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. అటెండర్, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు జిల్లాస్థాయిలో బదిలీలు, పదోన్నతులు నిర్వహించనుండగా సీనియర్‌ అసిస్టెంట్, సూపరింటెండెంట్లను జోన్‌ పరిధిలో, గెజిటెడ్‌ అధికారులు, డీటీలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఏటీవో, ఎస్‌టీవో ఇలా వివిధ రకాల హోదా గల అధికారులకు మల్టీజోన్‌ వారీగా బదిలీ,     పదోన్నతులు ఉండనున్నాయి. ఆర్డీవోలు, జిల్లాస్థాయి అధికారులకు రాష్ట్రస్థాయిలో బదిలీలుండనున్నాయి. రాజన్న జోన్‌ మల్టిజోన్‌–1లో ఉండనుంది.

చదవండి: సీఎం కేసీఆర్‌ సంచలనం: ఈటల బర్తరఫ్‌  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు