Smartphone Screen Cover: గుడ్‌ న్యూస్‌.. ఇక ఫోన్‌ స్క్రీన్‌ పగలదు

1 Oct, 2021 05:08 IST|Sakshi

ఎంత కొత్త మోడల్‌ కొన్నా.. ఎంత ఖరీదైన ఫోన్‌ కొన్నా.. ఒక్కసారి కిందపడిందంటే స్క్రీన్‌ గ్లాస్‌ పగలడం ఖాయం. ఫోన్‌ స్క్రీన్‌ అనే కాదు.. గాజు ఏదైనా కాస్త ఒత్తిడిపడితే పుటుక్కుమంటుంది. కానీ అత్యంత గట్టిగా ఉండి ఓ మోస్తరు ఒత్తిడి తట్టుకునే సరికొత్త గాజు త్వరలోనే అందుబాటులోకి రానుంది. కెనడాకు చెందిన మెక్‌గిల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు.. సాధారణ గాజును, ఆక్రిలిక్‌ (దృఢంగా ఉండే పారదర్శక ప్లాస్టిక్‌)ను కలిపి ఈ సరికొత్త గాజును రూపొందించారు. సాధారణ గాజుతో పోలిస్తే ఇది ఐదు రెట్లు ఎక్కువ ఒత్తిడిని తట్టుకుంటుందని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త అలెన్‌ ఎర్లిచర్‌ తెలిపారు. 

ముత్యాల తరహాలో.. 


ఆల్చిప్పల్లో ముత్యాలు రూపొందే పద్ధతి ఆధారం గానే శాస్త్రవేత్తలు సరికొత్త గ్లాస్‌ను తయారు చేశారు. ఆల్చిప్పల లోపలి వైపు ‘నెక్ర్‌’గా పిలిచే పదార్థం ఉంటుంది.  పెళుసుగా ఉండే కాల్షియం కార్బోనేట్‌ పదార్థం, సాగే గుణమున్న ఆర్గానిక్‌ (కొన్ని రకాల ప్రొటీన్లు) పదార్థం కలిసి ‘నెక్ర్‌’గా రూపొందుతాయి. దీనితో రూపొందే ఆల్చిప్పలు, ముత్యాలు దృఢంగా ఉంటూనే.. ఒత్తిడిని తట్టుకోగలుగుతాయి.

ఈ నిర్మాణాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు.. పెళుసుగా ఉండే గాజును, సాగే గుణమున్న ఆక్రిలిక్‌ను కలిపి దృఢమైన గ్లాస్‌ను రూపొందించారు. దీని తయారీ సులువని, ధర కూడా తక్కువని తెలిపారు. స్మార్ట్‌ఫోన్ల స్క్రీన్లతోపాటు టీవీలు, మానిటర్లు వంటివాటికి ఈ గాజును వినియోగించవచ్చన్నారు.  

మరిన్ని వార్తలు