చెత్తతో ‘ఎరువులు– వెలుగులు’

8 Oct, 2021 03:07 IST|Sakshi

అసెంబ్లీలో మంత్రి కేటీఆర్‌ వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ను సరికొత్త ప్రణాళికలతో విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి కె.తారకరామారావు అన్నారు. గురువారం పట్టణ ప్రగతిపై శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘‘నగరంలో రోజు ఉత్పత్తి అవుతున్న చెత్తను వేరు చేస్తున్నాం. తడి చెత్తతో ఎరువులు, పొడి చెత్తతో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నాం. తడిచెత్త కోసం కంపోస్టు యూనిట్లను, పొడిచెత్తతో జవహర్‌నగర్‌ సమీపంలో ప్రత్యేకంగా విద్యుత్‌ ప్లాంటును ఏర్పాటు చేశాం.

త్వరలోనే మరో రెండు ప్లాంట్ల ఏర్పాటు చేస్తున్నాం. ఎస్‌ఆర్‌డీపీ కింద రూ.6వేల కోట్లు ఖర్చు చేసి 42 ప్రాజెక్టులు చేపట్టగా.. ఇప్పటికే 24 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. నగరంలో ట్రాఫిక్‌ నియంత్రణ కోసం అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నాం. ఇవన్నీ ప్రతిపక్ష సభ్యులకు కూడా కనిపిస్తాయి. కానీ వాళ్లు ఇలాంటి అభివృద్ధి పనులను చూడలేరు. నిద్రపోయే వాళ్లను లేపొచ్చు కానీ నిద్ర పోతున్నట్లు నటించే వాళ్లను లేపలేం’’అని అన్నారు.

‘‘జీహెచ్‌ఎంసీ పరిధిలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని అర్బన్‌ లోకల్‌ బాడీస్‌ అన్నింటా సమగ్ర అభివృద్ధి చేస్తున్నాం. రహదారులన్నీ ఎల్‌ఈడీ లైట్లతో అలంకరించాం. దీంతో గ్రేటర్‌ పరిధిలో రూ.130 కోట్లు, ఇతర యూఎల్‌బీలలో రూ.80కోట్లు విద్యుత్‌ ఖర్చు ఆదా అవుతోంది. మహబూబ్‌నగర్‌లో కేసీఆర్‌ ఇకో పార్కును ప్రారంభించాం. ప్రతి పట్టణంలో పార్కులు, లంగ్‌స్పేస్‌లు, ప్రకృతివనాలు ఏర్పాటు చేస్తున్నాం. పచ్చదనానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. కోవిడ్‌ నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడొద్దని ఆస్తిపన్నులో రాయితీ ఇచ్చాం. అదేవిధంగా నీటి బిల్లుల్లో కూడా రాయితీలు ఇచ్చాం’’ అని వివరించారు.

మరిన్ని వార్తలు