పదహారు రోజుల పండుగ ఆనందంలో ఉండగానే.. నూతన వధువు కన్నీరు మున్నీరు

11 Jun, 2022 07:46 IST|Sakshi
పృథ్వీ (ఫైల్‌) 

కోదాడ: కష్టపడి చదివి.. విదేశాల్లో ఉన్నత ఉద్యోగం చేస్తూ .. వివాహం కోసం స్వదేశం వచ్చిన ఆ యువకుడు పెళ్లి చేసుకొని 16 రోజులు పండుగ జరుపుకోవాలనే సంతోషంలో ఉండగా ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు కబళించింది. రెండు కుటుంభాలలో తీరని విషాదం మిగిల్చిన సంఘటన పలువురిని కలిచి వేచింది. గురువారం నకిరేకల్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అడపా పృథ్వీ (27) కుటుంబం మొత్తం  విషాదంలో కూరుకొని పోయింది.

కోదాడకు చెందిన అడపా రాజేందర్‌ కుమారుడు పృథ్వీ కెనడాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అక్కడే పని చేస్తున్న విజయవాడ సమీపంలోని కీలేశ్వరపురానికి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయం కావడంతో మే నెలలో ఇండియాకు వచ్చారు..మేనెల 26న వివాహం జరిగింది. గత సంవత్సరం కరోనా సమయంలో యువతి తల్లిదండ్రులు మరణించడంతో మేనమామలు దగ్గరుండి వీరి వివాహం జరిపించారు.

చదవండి: (పెళ్లయిన యువతికి తల్లిదండ్రులు మరో పెళ్లి.. భర్తకు తెలిసి..)

ఈనెల 10న  పదహారు రోజుల పండుగ జరగాల్సి ఉంది. 11న కెనడా వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో హలియాలో ఉన్న చిన్ననాటి మిత్రుడిని కలవడానికి తండ్రితో కలిసి వెళ్లాడు. గుగూల్‌ మ్యాప్‌ పెట్టుకొని వెళ్లడంతో అది మిర్యాలగూడ మీద నుంచి కాకుండా నకిరేకల్‌ మీదుగా చూపించడంతో నకిరేకల్‌ నుంచి నల్లగొండ మీదుగా వెళ్లాడు. ఈ క్రమంలో నల్లగొండ– నకిరేకల్‌ మధ్యలో మూల మలుపువద్ద  ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో పృథ్వీ అక్కడికక్కడే మృతి చెందాడు.

పదహారు రోజుల పండుగ చేసుకుంటామనే ఆనందంలో ఉన్న తల్లిదండ్రులతో పాటు నూతన వధువు పృథ్వీ మరణంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పృథ్వీ అమ్మమ్మ గతంలో కోదాడ పంచాయతీ వార్డు మెంబర్‌గా పని చేసింది. పృథ్వీ తండ్రి కోదాడలో కిరోసిన్‌ డీలర్‌ కాగా తల్లి లెనిన్‌కుమారి గృహిణి. ఇతడికి చెల్లెలు ఉంది. శనివారం కోదాడలో పృథ్వీ అంత్యక్రియలు నిర్వహించడానికి బంధువులు ఏర్పాట్లు చేశారు.

మరిన్ని వార్తలు