కేంద్ర నిర్ణయానికి కట్టుబడాలి

21 Oct, 2020 03:40 IST|Sakshi

కాళేశ్వరం విస్తరణపై తెలంగాణకు ఎన్‌జీటీ స్పష్టీకరణ

పర్యావరణ ఉల్లంఘనలకు బాధ్యులను గుర్తించాలి

ఏడుగురు సభ్యులతో నిపుణుల కమిటీ

పర్యావరణ శాఖకు ఆదేశాలు 

సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణ పనులపై కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఎత్తిపోతల సామర్థ్యాన్ని రోజుకు రెండు టీఎంసీల నుంచి మూడు టీఎంసీలకు పెంచడానికి ఎలాంటి పర్యావరణ అనుమతులు అవసరం లేదన్న తెలంగాణ వాదనతో విభేదించింది. ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయని తెలిపింది. 2008 నుంచి 2017 వరకు ప్రాజెక్టు నిర్మాణంలో పలు మార్పులు జరిగినప్పటికీ పర్యావరణ అనుమతులు విస్మరించినట్లు గుర్తించామని స్పష్టం చేసింది. ఎత్తిపోతల సామర్థ్యం పెంపు పనులకు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర జలసంఘం, పర్యావరణ శాఖల అనుమతులు తప్పనిసరి అని పేర్కొంది.

ప్రజా ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణ రెండింటిని సమన్వయం చేసుకుంటూ ముందుకువెళ్లాలే కానీ పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేయరాదని తెలిపింది. పర్యావరణ ఉల్లంఘనలకు బాధ్యులెవరనేది గుర్తించాలని, ఏడుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని నెలలోగా ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యావరణ శాఖను ఆదేశించింది. కమిటీ నివేదిక ఆరునెలల్లో అందజేయాలని పేర్కొంది. కాళేశ్వరం విస్తరణ పనులను ఆపాలంటూ తెలంగాణకు చెందిన హయతుద్దీన్, తుమ్మనపల్లి శ్రీనివాస్‌ తదితరులు వేర్వేరుగా వేసిన పిటిషన్లను విచారించిన జస్టిస్‌ ఆదర్శకుమార్‌ గోయెల్‌ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. 

‘‘ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం పర్యావరణ ఉల్లంఘనలు గుర్తించాం. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయిన నేపథ్యంలో పూర్వస్థితి తీసుకురావడం సాధ్యంకాదు. కానీ, ఉపశమన చర్యలు చేపట్టాల్సిన బాధ్యత, జవాబుదారీతనం ఎంతైనా అవసరం. బహుళ ప్రయోజనంతో నిర్మిస్తున్న ప్రాజెక్టు కావడంతో పర్యావరణ అనుమతులు అవసరం లేదన్న తెలంగాణ ప్రభుత్వ వాదన సరికాదు. పర్యావరణ అనుమతులు లేకుండా ముందుకు వెళ్లరాదని ట్రిబ్యునల్, హైకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. విస్తరణ పనులకు ముందు నిపుణుల కమిటీ అంచనా వేయాల్సిందే. గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు డీపీఆర్‌ ఇవ్వకుండా, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండా ప్రాజెక్టు పనులపై ముందుకెళ్లొద్దని కేంద్ర జల్‌శక్తి మంత్రి 7.8.2020న తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. విస్తరణ పనులకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదన లేదని కేంద్ర జలసంఘం కూడా పేర్కొంది. అనుమతులు అవసరమని తెలిపింది. ఈ పరిస్థితుల్లో 2.10.2020న తెలంగాణ ముఖ్యమంత్రి రాసిన లేఖను కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ పరిశీలించాల్సిన అవసరం ఉంది. అనంతరం జల్‌శక్తి శాఖ తీసుకునే నిర్ణయానికి తెలంగాణ కట్టుబడి ఉండాలి’’ అని తీర్పులో పేర్కొంది.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా