తెలంగాణకు ఎన్‌జీటీ చురక..ఉల్లంఘనల కేసులు మీపైనా ఉన్నాయ్‌

24 Jul, 2021 14:24 IST|Sakshi

తెలంగాణ న్యాయవాదితో ఎన్జీటీ 

‘రాయలసీమ’ తనిఖీ చేయాలని కృష్ణా బోర్డుకు ఆదేశం  

సాక్షి, న్యూఢిల్లీ: నిబంధనలు ఉల్లంఘించి తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రాజెక్టులు చేపడుతోందంటూ పలు పిటిషన్లు ఉన్నాయని జాతీయ హరిత ట్రిబ్యునల్‌(ఎన్‌జీటీ) వ్యాఖ్యానించింది. పర్యావరణ అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేపడుతున్నారంటూ గవినోళ్ల శ్రీనివాస్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్‌ రామకృష్ణన్, విషయ నిపుణుడు సత్యగోపాల్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఉల్లంఘనలు చేస్తోందని తెలంగాణ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ రాంచందర్‌రావు చెప్పబోతుండగా... ధర్మాసనం జోక్యం చేసుకుని మీపైనా ఉల్లంఘన కేసులు ఉన్నాయని వ్యాఖ్యానించింది.

ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయా లేదా అనేది స్వయంగా వెళ్లి తనిఖీ చేయాలని కృష్ణా బోర్డును ధర్మాసనం ఆదేశించింది. పర్యావరణ శాఖ కూడా తనిఖీ చేయాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది శ్రావణ్‌కుమార్‌ కోరగా, అసలు ఏ పనులు సాగుతున్నాయనేది కృష్ణాబోర్డు తేల్చిన తర్వాత నిర్ణయిస్తామని ధర్మాసనం పేర్కొంటూ తదుపరి విచారణ ఆగస్టు 9కి వాయిదా వేసింది.  
 

మరిన్ని వార్తలు