టోల్‌ గేట్ల వద్ద పసుపు గీతలు.. భారీగా క్యూ ఉంటే నో టోల్‌ ఫీజు..!

4 Jun, 2021 05:14 IST|Sakshi

రద్దీ సమయాల్లో  వాహనాల క్యూ సమస్యకు పరిష్కారం 

ఎన్‌హెచ్‌ఏఐ ప్రతిపాదన 

వంద మీటర్ల దూరంలో ఎల్లో లైన్స్‌ ఏర్పాటు 

పెద్ద క్యూ ఏర్పడితే ఈలోపు ఉన్న వాహనాలన్నిటికీ ఒకేసారి గ్రీన్‌సిగ్నల్‌ 

 టోల్‌ రుసుము లేకుండానే తెరుచుకోనున్న గేట్లు.. అమలుపై అధికారుల్లో సందేహాలు

సాక్షి, హైదరాబాద్‌: పసుపు గీతలు.. టోల్‌గేట్ల వద్ద వాహనదారుల కష్టాల పరిష్కారానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) తాజాగా ముందుకు తెచ్చిన ప్రతిపాదన. ఈ పసుపు గీతలు టోల్‌ గేట్ల వద్ద వాహనాలు క్యూ ఏర్పడకుండా చేస్తాయని సంస్థ చెబుతోంది. సాధారణ రోజుల్లో సమస్య లేకున్నా.. పండగలు, రద్దీ ఎక్కువగా ఉండే ఇతర రోజుల్లో టోల్‌ గేట్ల వద్ద పెద్దయెత్తున వాహనాలు బారులు తీరుతూ గేటు దాటడం విసుగుగా మారుతోంది. ఇటీవల పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చిన ఫాస్టాగ్‌ కూడా దీనికి పూర్తిస్థాయి పరిష్కారం చూపలేకపోతోంది. ఈ నేపథ్యంలోనే ఎన్‌హెచ్‌ఏఐ ఈ ప్రతిపాదనను తెరపైకి తెచి్చంది. ఈ మేరకు మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలకు పంపింది. తెలంగాణ ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు కూడా వీటిని అందుకున్నారు. కానీ దీని అమలు విషయంలో వారిలో కొంత అయోమయం నెలకొంది.  

ఫాస్టాగ్‌లో కోత పడదు 
జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ ప్లాజాల వద్ద గేట్లను ఆనుకుని వంద మీటర్ల దూరంలో పసుపు రంగులో జీబ్రాలైన్స్‌ తరహా గీతలు ఏర్పాటు చేస్తారు. గేటు వద్ద ఆగే క్రమంలో ఈ వంద మీటర్ల దూరంలో ఉండే పసుపు రంగు గీతలకు మించి వాహనాలు బారులు తీరితే ఈ కొత్త విధానం అమలవుతుంది. అలాంటి సమయంలో పసుపు గీతలు ఉండే వంద మీటర్ల లోపు ఉన్న వాహనాలన్నింటినీ ఒకేసారి గేటు ఎత్తి ముందుకు వదులుతారు. అది కూడా ఎలాంటి టోల్‌ రుసుము వసూలు చేయకుండానే. అంటే ఫాస్టాగ్‌ మొత్తంలో ఎలాంటి కోతా పడదన్న మాట. అలా ఎప్పుడు పసుపు గీతలకు మించి క్యూలు ఏర్పడినా వదిలేయడం వల్ల భారీ క్యూలు ఏర్పడవనేది ఎన్‌హెచ్‌ఏఐ ఉద్దేశం.  

అలా అయితే టోల్‌ గేటు ఎందుకు? 
ఈ విషయమై స్థానిక అధికారుల్లో పూర్తిస్థాయి స్పష్టత లేదు. పసుపు రంగు గీత దాటి వాహనాలు క్యూగా ఏర్పడితే.. ముందున్న వాటిని గేటు ఎత్తి పంపించేస్తారు..సరే. కానీ అవి వెళ్లిన వెంటనే మళ్లీ వెనక క్యూ ఏర్పడితే వాటినీ అలాగే పంపాలి. అలా రద్దీ ఉన్న సమయంలో వంద మీటర్ల మేర వాహనాల వరస ఏర్పడటం సాధారణమేనని అధికారులు అంటున్నారు. అలా పంపుతూ అన్ని వాహనాలూ వదిలేస్తే ఇక టోల్‌ గేటు ఎందుకనేది అధికారుల ప్రశ్న. దీంతో దీనిపై ఢిల్లీ అధికారుల నుంచి స్పష్టత తీసుకున్నాక ఈ విధానం అమలులోకి తేవాలని భావిస్తున్నారు.   

మరిన్ని వార్తలు