ఎన్‌ఐఏ దాడులు: ముంచంగి పుట్టు కేసులో ఆరుగురు అరెస్ట్‌

2 Apr, 2021 03:14 IST|Sakshi

పౌరహక్కుల నేతలను అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఏ

మావోయిస్టులకు సహకరిస్తున్నారు అంటూ ఎన్‌ఐఏ అభియోగం

ఆధారాలకోసం తెలంగాణ, ఏపీల్లోని 31 ప్రాంతాల్లో సోదాలు

రూ.10 లక్షల నగదు, 40 మొబైల్‌ ఫోన్లు, 44 సిమ్‌కార్డులు, 

పలు పరికరాలు స్వాధీనం

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన విశాఖ జిల్లా ముంచంగి పుట్టు కేసులో ఆరుగురు పౌరహక్కుల సంఘం నేత లను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. ఈ సోదాలన్నీ ముంచంగిపుట్టు ఠాణాలో నమోదైన కేసు ఆధారంగానే జరిగినట్లు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఏపీ, తెలంగాణల్లో 31 చోట్ల సోదాలు జరిపినట్టు తెలిపింది. ఏపీలో విశాఖ పట్నం, గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం,కర్నూలు, కృష్ణా, తూర్పు గోదావరి, కడపతోపాటు తెలంగా ణలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజి గిరి, మెదక్‌ జిల్లాల్లో తనిఖీలు చేసినట్లు పేర్కొంది. వారికి మావోలతో లింకులపై అనుమానాల నేపథ్యంలో ఈ సోదాలు జరిపినట్టు వివరించింది. 

గతేడాది కేసు నమోదు..
మావోయిస్టులకు విప్లవ సాహిత్యం తీసుకెళ్తున్న జర్నలిస్టు పంగి నాగన్నను ముంచంగిపుట్టు పోలీసులు గతేడాది అరెస్టు చేశారు. దీనిపై గతేడాది నవంబర్‌ 23న ముంచంగిపుట్టు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టేందుకు గత నెల 7న కేసు నమోదు చేసిన ఎన్‌ఐఏ పంగి నాగన్నను విచారించింది. మావోయిస్టులకు సహకరిస్తున్నట్టు నాగన్న అంగీకరించడం తోపాటు మరో 64 మంది పౌరహక్కుల సంఘల, విరసం నేతల పేర్లు వెల్లడించడంతో వారిపై ఎన్‌ఐఏ దృష్టి పెట్టింది.

ఈ క్రమంలోనే పంగి నాగన్న, అదులూరి అన్నపూర్ణ, జంగర్ల కోటేశ్వర్‌రావు, మానుకొండ శ్రీనివాసరావు, రేలా రాజేశ్వరి, బొప్పుడి అంజమ్మ అనే ఆరుగురిని అరెస్టు చేసినట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా సాగించిన తనిఖీల్లో 40 మొబైల్‌ఫోన్లు, 44 సిమ్‌కార్డులు, హార్డ్‌డిస్క్, మైక్రో ఎస్డీ కార్డులు, ఫ్లాష్‌ కార్డులు తదితర 70 స్టోరేజ్‌ డివైజెస్, 184 సీడీలు/డీవీడీలు, 19 పెన్‌డ్రైవ్‌లు, ట్యాబ్, ఆడియో రికార్డర్, ఒక అనుమానితుని నుంచి రూ.10లక్షల నగదు, కొడవళ్లు, గొడ్డళ్లు, కత్తులు మావోయిస్టు పార్టీ సాహిత్యంతో ఉన్న లేఖలు, అనేక అనుమానాస్పద డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించింది.

విశాఖ ఏజెన్సీలోని మావోయిస్టులకు పౌరహక్కుల నేతలు సహకరించారని, పోలీసుల కదలికలను మావోయిస్టులకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారని, ఏజెన్సీ గ్రామాల్లో ప్రజలను మావోయిస్టులకు అనుకూలంగా సమీకరించి పోలీసులను అక్కడికి రాకుండా అడ్డంకులు కల్పిస్తున్నారని, ప్రజలను పోలీసులకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారని అభియోగాలు మోపింది. 

సోదాలపై నిరసన.. 
పౌరహక్కుల సంఘాలు, ప్రజాసంఘాలు, న్యాయవాదుల ఇళ్లల్లో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించడాన్ని ఖండిస్తూ గురువారం విశాఖ జీవీఎంసీ గాంధీ పార్కులో ఆయా సంఘాలు నిరసన చేపట్టాయి. పీవోడబ్ల్యూ ప్రధాన కార్యదర్శి ఎం.లక్ష్మి మాట్లాడుతూ ఎన్‌ఐఏ అధికారులు ప్రజాసంఘాల నేతల ఇళ్లపై అక్రమంగా సోదాలు చేయకూడదని హైకోర్టు ఇచ్చిన రిలీఫ్‌ఆర్డర్‌ను కూడా పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. ప్రజాజీవన స్రవంతిలో కలిసిపోయిన వారికి మీరిచ్చే గౌరవం ఇదేనా.. ప్రజాస్వామ్యాన్ని బతకనివ్వరా? అంటూ మావోయిస్టు నేత ఆర్‌కే సతీమణి శిరీష ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు