నిఖత్‌కు నీరాజనం

28 May, 2022 01:30 IST|Sakshi
విజయోత్సవ ర్యాలీలో బాక్సర్‌ నిఖత్‌ జరీన్, షూటర్‌ ఇషాసింగ్, ఫుట్‌బాల్‌ క్రీడాకారిణి సౌమ్య, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌  

శంషాబాద్‌ నుంచి విజయోత్సవ ర్యాలీ 

దేశం, రాష్ట్రం గర్వపడేలా పతకాలు సాధించారంటూ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కితాబు 

మరిన్ని పతకాలు సాధిస్తానన్న నిఖత్‌

శంషాబాద్‌: ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన రాష్ట్ర క్రీడాకారిణి నిఖత్‌ జరీన్‌కు హైదరాబాద్‌లో అపూర్వ స్వాగతం లభించింది. నిఖత్‌ జరీన్‌తోపాటు జర్మనీలో జరిగిన జూనియర్‌ ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీలో మూడు స్వర్ణ పతకాలు సాధించిన షూటర్‌ ఇషాసింగ్,  జాతీయ మహిళల ఫుట్‌బాల్‌ లీగ్‌లో టైటిల్‌ గెలిచిన కేరళ గోకులం క్లబ్‌ జట్టుకు ఆడిన గుగులోత్‌ సౌమ్య కూడా శుక్రవారం నగరానికి వచ్చారు. వీరికి శంషాబాద్‌ విమానాశ్రయంలో క్రీడలు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఘనస్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుంచి ఓపెన్‌టాప్‌ జీప్‌లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. పలు పాఠశాలలకు చెందిన క్రీడాకారులు కూడా రహదారి వెంట ఆత్మీయ స్వాగతం పలికారు. జాతీయ పతాకాలు చేతబట్టి నినాదాలు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా కార్యదర్శి సందీప్‌ సుల్తానియా, స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. 

క్రీడలకు పెద్ద పీట 
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. ప్రపంచస్థాయిలో తెలంగాణ అమ్మాయిలు రాష్ట్రం, దేశం గర్వపడేలా పతకాలు సాధించారంటూ కితాబునిచ్చారు. క్రీడారంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని, దేశానికి మంచి క్రీడాకారులను ఇవ్వడానికి నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఊరూరా క్రీడా మైదానాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో క్రీడారంగానికి ప్రా«ధాన్యత తక్కువగా ఉండేదన్నారు. అన్ని రంగాల్లో బాగుపడుతున్న రాష్ట్ర ప్రగతిని చూసి ఢిల్లీ నుంచి వస్తున్న కొందరు కాళ్లలో కట్టెలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రానికి ఏమి చేయలేని వారు.. వారి సొంత రాష్ట్రాల్లో బాగుచేయలేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నిఖత్‌ జరీన్, ఇషాసింగ్, సౌమ్య ముగ్గురు కూడా నిజామాబాద్‌ బిడ్డలు కావడం జిల్లాకు గర్వకారణంగా ఉందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. 

మరింత వన్నె తెస్తా: నిఖత్‌ జరీన్‌ 
తాను సాధించిన పతకం దేశానికి, రాష్ట్రానికి పేరు తీసుకొచ్చిందని ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ అన్నారు. భవిష్యత్తులో దేశానికి, రాష్ట్రానికి మరింత వన్నె తెచ్చేలా పతకాలు సాధిస్తానని ధీమా వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఎంతగానో ప్రోత్సాహం అందించా రని చెప్పారు. ఎమ్మెల్సీ కవిత ప్రోత్సాహంతోనే తాను ఈ స్థాయిలో ఉన్నానన్నారు.  

మరిన్ని వార్తలు