ఇక్కడకే రావాలా.. గాంధీ, ఉస్మానియాకి పోవచ్చుగా..

26 Jul, 2022 17:41 IST|Sakshi

నిమ్స్‌లో పేదరోగిపై ఓ ఉన్నతాధికారి చిర్రుబుర్రులు 

పేదలకు కార్పొరేట్‌ స్థాయి వైద్య సేవలకు కేరాఫ్‌గా పేర్కొనే నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్‌)లో నిరుపేదలకు ఛీత్కారాలే ఎదురవుతున్నాయి. ఇక్కడకే రావాలా.. గాంధీ, ఉస్మానియాకు పోవచ్చుగా.. అక్కడ కాకపోతే ఇక్కడికి రావాలి కానీ.. అందరూ నిమ్స్‌కు వచ్చేస్తే ఎలా అంటూ ఓ ఉన్నతాధికారి అగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.

సాక్షి, హైదరాబాద్‌: నిమ్స్‌ ఆస్పత్రికి వచ్చే రోగులకు వెనువెంటనే వైద్యం అందించాలన్న కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నారు. ఆ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు నిమ్స్‌కు వచ్చిన ప్రతి రోగికీ మెరుగైన వైద్యసేవలను అందించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగా ఆస్పత్రికి అవసరమైన మౌలిక సదుపాయాలను మరింతగా ఆధునికీకరించారు. ఈ క్రమంలో ఆస్పత్రికి వచ్చే రోగులకు వారి సహాయకులకు సైతం ఉచిత భోజన సదుపాయాన్ని కల్పించారు. ఆచరణలో నిమ్స్‌ అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా పేద రోగులకు సరైన వైద్య సేవలు అందించకపోగా వారి పట్ల అమర్యాదగా ప్రవర్తించడం బాధాకరంగా మారుతోందంటూ పేదరోగులు వాపోతున్నారు.  


గరీబోళ్లం సారూ.. డబ్బులు లేవంటే ఉన్నకాడికి కట్టించుకొని మిగతావి సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి ఎన్‌వోసీ తెచ్చుకోమంటూ ఉచిత సలహాపడేస్తున్నారు. రేపు డిశ్చార్జి చేస్తాం.. పోయి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ తెచ్చుకోవాలంటూ ఆయా రోగులపై ఒత్తిడి తేవడంతో జిల్లాలకు వెళ్లి ఎమ్మెల్యే ఆఫీసుల చుట్టూ తిరిగి ఎన్‌వోసీ లెటర్‌ తెచ్చుకోవాల్సి వస్తోంది. తీరా అప్పటికే నాలుగైదు రోజులు గడిచిపోతుండటంతో ఆ బిల్లు చెల్లించేదాకా డిశ్చార్జీ చేయడం లేదు. సారూ.. ఆరోగ్యశ్రీ కార్డు ఉంది అంటే పది రోజులు ఆగి రమ్మంటున్నారు. పది రోజుల తర్వాత వస్తే టెస్టులన్నీ చేసి బెడ్లు లేవు వారం రోజులు ఆగాలంటున్నారు. డబ్బులు చెల్లిస్తే మాత్రం వెంటనే బెడ్‌ ఇచ్చి అడ్మిట్‌ చేసుకుంటున్నారు. 


ఆరోగ్యశ్రీ ఉన్నా.. డబ్బులు కట్టించుకున్నారు..

ఆదిలాబాద్‌ జిల్లాకి చెందిన కళావతి(54) కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. నొప్పి తీవ్రతరం కావడంతో ఈ నెల 4వ తేదీన మెరుగైన వైద్యం కోసం నిమ్స్‌ను ఆశ్రయించారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా రూ. 5 వేలు కట్టించుకొని మరీ అడ్మిషన్‌ చేయించుకున్నారు. చికిత్సలో భాగంగా ఇన్ఫెక్షన్‌ కారణంగా కాలేయంలో సగభాగాన్ని తొలగించారు. అందుకు అవసరమైన మందులు, ఇంజక్షన్లు, చివరకు బ్యాండేజ్‌ సైతం బయట నుంచి తెచ్చుకోమన్నారు. అందుకు ఆమెకు రూ. 25 వేల వరకు ఖర్చయ్యింది. తీరా డిశ్చార్జి చేస్తాం.. సీఎంఆర్‌ఎఫ్‌ తెచ్చుకోమన్నారు. ప్రభుత్వం నుంచి రూ. 1.50 లక్షలు సహాయం అందింది. బుధవారం డిశ్చార్జి సమ్మరీని ఇచ్చిన అధికారులు ఇంకా రూ. 13 వేలు కట్టమన్నారు. అంతంతమాత్రంగా ఉన్న తమ ఆర్థిక పరిస్థితితో ఆ మొత్తాన్ని కూడా కట్టలేని పరిస్థితి. ఆ రోజంతా అధికారుల చుట్టూ ఎంత తిరిగి ప్రయోజనం లేకుండా పోయింది. 

ఆస్పత్రి మెడికల్‌ సూపరిండెంటెంట్‌ను కలిసి డబ్బులు లేవంటూ వేడుకున్నా ఫలితం లేకుండా పోయిందని కళావతి తనయుడు నరేష్‌ వాపోయారు. పైగా ఇక్కడికి ఎందుకొచ్చారు. గాంధీకో.. ఉస్మానియాకో వెళ్లాల్సింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంది సారూ.. అంటే ప్రభుత్వం ఎప్పుడో డబ్బులు ఇస్తుంది.. అప్పటివరకు ఆస్పత్రి ఎలా నడవాలి అంటూ ప్రశ్నించారన్నారు. మా దగ్గర ఊరికి పోయేందుకు డబ్బులు లేవు సార్‌.. వేరే వాళ్ల దగ్గర అప్పు తెచ్చుకున్నాం.. అంటూ వేడుకున్నా నా పరిధిలో లేదు ఓ రెండు వేలు తగ్గిస్తా.. పొద్దున్నే మూడ్‌ ఆఫ్‌ చేయొద్దు.. వెళ్లిపోండి అంటూ ఆయన చిర్రుబుర్రులాడటంతో.. చివరికి మిత్రుల సహాయంతో ఆస్పత్రి నుంచి బయటపడ్డామని నరేష్‌ తెలిపారు. (క్లిక్‌: మంకీపాక్స్‌పై ఆందోళన వద్దు.. నిర్లక్యం చేయొద్దు!)

మరిన్ని వార్తలు