ఏం ఇంట్లో చూసినా మందులే మందులు! పారేస్తే పాతరేసినట్టే! వద్దనుకుంటే ‘మాత్ర’మే..

6 Dec, 2022 18:42 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్‌కు ముందేమో గాని, తర్వాత ప్రతీ ఇల్లూ చిన్నపాటి క్లినిక్‌లా మారింది. వాడినా, వాడకున్నా రకరకాల మాత్రలు ఇంట్లో పేరుకుంటున్నాయి. అయితే వాడని  వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేయడం సరైన పనికాదంటున్నారు వైద్యులు. దానికి బదులుగా వాటిని పడేసేందుకు  తొలిసారిగా డ్రాప్‌ బాక్స్‌లు నగరంలో అందుబాటులోకి వచ్చాయి. 

జలుబో, జ్వరమో మరొకటో..  చిన్నా చితకా వ్యాధులకు కూడా డాక్టర్ల నుంచి చాంతాడంత మందుల చిట్టీలు తప్పడం లేదు. ఎందుకైనా మంచిదని మనం వాటిని కొనకా తప్పడం లేదు. అయితే సాధారణంగా ఒకటి  రెండు రోజులకే స్వస్థత చేకూరిన పరిస్థితిలో మందులు ఆపేసేవారే ఎక్కువ. అలాంటి వాటిలో యాంటీ బయాటిక్స్‌ ఎక్కువగా ఉండడం సాధారణమే. వీటిని సరైన పద్ధతిలో నిర్మూలించాలి లేదా గడువు ముగియకపోతే అవసరార్థులకు అందించాలే తప్ప ఎలా పడితే అలా పడేయవద్దని సూచిస్తున్నారు వైద్యులు.  

పారేస్తే.. పాతరేసినట్టే.. 
బెల్జియం లాంటి దేశాల్లో ముఖ్యంగా యాంటీబయాటిక్స్‌ విషయంలో కఠినమైన డ్రగ్‌ పాలసీ ఉంది. అక్కడ వీటిని హానికారక వ్యర్థాల కోవలో లెక్కిస్తారు. అవసరం ఉన్నా లేకున్నా యాంటీబయాటిక్స్‌ అధిక వినియోగం వల్ల ఆరోగ్యపరమైన నష్టాలొస్తాయి. ఉపయోగించనవి, అదనంగా ఉన్నవి నిర్లక్ష్యంగా పారవేయడంతో అవి నీటిలోకి చేరి కెనాల్స్‌ ద్వారా పంట పొలాల వరకూ చేరుతున్నాయి. దీంతో ఇది అంతిమంగా యాంటీమైక్రోబయాల్‌ నిరోధకత/యాంటీమైక్రోబయల్‌ రెసిస్టెన్స్‌ (ఏఎమ్‌ఆర్‌)కు దారి తీస్తుందని వైద్యులు అంటున్నారు. 

డ్రాప్‌ బాక్స్‌ల ఏర్పాటు..  
ఈ సమస్యను పరిష్కరించే క్రమంలో నిమ్స్‌కు చెందిన క్లినికల్‌ ఫార్మకాలజీ అండ్‌ థెరప్యూటిక్స్‌ (సీపీటీ) విభాగం ఆస్పత్రి ఆవరణలో రెండు డ్రాప్‌ బాక్స్‌లను అమర్చింది. అవుట్‌ పేషెంట్స్‌ బ్లాక్‌లో, స్పెషాలిటీ బ్లాక్‌లో మరొకటి చొప్పున వీటిని ఏర్పాటు చేశారు. వీటిని చోరుల నుంచి కాపాడే క్రమంలో బాక్స్‌లకు తాళాలు వేశారు. ఆస్పత్రి సిబ్బంది మొదలుకుని, రోగులు, సంబంధీకులు ఎవరైనా సరే ఇంట్లో అనవసరంగా కొనుగోలు చేసిన, ఉపయోగించని లేదా గడువు ముగిసిన యాంటీబయాటిక్స్‌ ఉన్నట్లయితే ఈ డ్రాప్‌ బాక్స్‌లో వేయవచ్చని తద్వారా ఈ బాక్స్‌లకు వచ్చే స్పందనను అనుసరించి భవిష్యత్తులో మరిన్ని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. 

భస్మం.. క్షేమం..  
‘తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇదే మొదటిది. వీటి ద్వారా హానికారక రసాయనాలు కాలుష్యానికి కారణం కాకుండా నిరోధించవచ్చు’ అని చెప్పారు నిమ్స్‌ డీన్‌ ఇన్‌చార్జి డైరెక్టర్‌ ఎన్‌.బీరప్ప. ‘డ్రాప్‌ బాక్స్‌ల ద్వారా పోగుపడిన మందులను సేకరించి వాటిని 1200 డిగ్రీల సెల్సియస్‌ టెంపరేచర్‌లో భస్మం చేయిస్తాం’ అని నిమ్స్‌ లెర్నింగ్‌ సెంటర్‌ ప్రొఫెసర్‌ సీపీటీ విభాగాధిపతి పి.ఉషారాణి చెప్పారు.  

మరిన్ని వార్తలు