హైదరాబాద్‌లోని పిల్లల్లో ఇవి తక్కువగా ఉన్నాయి..

7 Jun, 2021 03:47 IST|Sakshi

పిల్లలకు ఒమేగా–3 ఫ్యాటీ ఆమ్లాల ఆవశ్యకతపై ఎన్‌ఐఎన్‌ అధ్యయనం 

పిల్లల్లో మేధో శక్తితో పాటు ఏకాగ్రత పెరుగుతుందని స్పష్టీకరణ 

హైదరాబాద్‌లోని పిల్లల్లో ఇవి తక్కువగా ఉన్నాయని వెల్లడి 

సముద్రపు చేపల్లో అధికంగా ఉంటాయని, వారంలో కనీసం 200 గ్రాములు తినాలని సూచన

సాక్షి, హైదరాబాద్‌: పిల్లల మేధోశక్తితో పాటు ఏకాగ్రత పెరగాలంటే ఎక్కువగా ఒమేగా–3 పాలీ అచ్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ ఆమ్లాలు ఆహారంతో పాటు అందేలా చూడాలని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) శాస్త్రవేత్తలు సూచించారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని పిల్లల్లో (7– 13 ఏళ్ల మధ్య వయస్కులు) ఈ రకమైన కొవ్వులు తక్కువగా ఉన్నాయని ఎన్‌ఐఎన్‌ అధ్యయనం ఒకటి స్పష్టం చేసింది. శరీర, జీవక్రియలు సక్రమంగా జరిగేందుకు కొవ్వులు లేదా ఫ్యాటీ ఆమ్లాలు చాలా అవసరం. ఆహారంలోని కొన్ని రసాయనాల ద్వారా శరీరం వీటిని తయారు చేసుకోగలదు. కానీ కొవ్వుల్లో కొన్నింటిని మాత్రం తయారుచేసుకోలేదు.

ఆల్ఫా లినోలిక్‌ యాసిడ్‌ (ఏఎల్‌ఏ) లేదా ఒమేగా–3, లినోలిక్‌ యాసిడ్‌ (ఎల్‌ఏ) లేదా ఒమేగా–6 ఫ్యాటీ ఆమ్లాలను ఆహారం ద్వారా అందించాల్సి ఉంటుంది. అందుకే వీటిని ఆవశ్యక కొవ్వులుగా పిలుస్తారు. ఒమేగా–3 ఫ్యాటీ ఆమ్లాల్లో రెండు రకాలు ఉంటాయి. అవి డోకోసా హెక్జనోయిక్‌ యాసిడ్‌ (డీహెచ్‌ఏ), ఈకోసాపెంటనోయిక్‌ యాసిడ్‌ (ఈపీఏ). మెదడులో ఉండే పాలీ అన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ ఆమ్లాల్లో డీహెచ్‌ఏ అత్యధికం. గుండె, రోగ నిరోధక వ్యవస్థ, మేధోశక్తి పనితీరుపై ప్రభావం చూపుతుంటుంది. గర్భధారణ చివరి త్రైమాసికంలో పిండంలోని మెదడులోకి చేరే డీహెచ్‌ఏ.. పుట్టిన తర్వాత రెండేళ్లవరకు ఎక్కువఅవుతూ ఉంటుంది. తద్వారా మెదడు ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. 


శాఖాహారులకు అవిశగింజలు, చియాసీడ్స్‌..
హైదరాబాద్‌లోని 5 పాఠశాలల నుంచి 625 మంది విద్యార్థులను ఎంపిక చేసుకుని వారు ఒమేగా–3 ఫ్యాటీ ఆమ్లాలను ఎలా.. ఎంత మోతాదుల్లో అందుకుంటున్నారో పరిశీలించారు. చాలా మందిలో తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వీరిలో 80 శాతం మంది ఒమేగా–3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే చేపలను ఆహారంగా తీసుకుంటున్నారని, కానీ నెలకు 100 గ్రాములకు మించి తినకపోవడం, ఈపీఏ, డీహెచ్‌ఏలు అత్యధికంగా ఉండే సముద్ర చేపలను కాకుండా మంచినీటి చేపలను తినడం కారణంగా తగిన మోతాదులో శరీరానికి ఈ ఫ్యాటీ ఆమ్లాలు అందట్లేదని తెలిసింది. ఈపీఏ, డీహెచ్‌ఏ ప్రయోజనాలను గరిష్ట స్థాయిలో పొందేందుకు వారానికి వంద నుంచి 200 గ్రాముల వరకు చేపలు.. ముఖ్యంగా ఉప్పునీటి చేపలను తినడం అవసరమని ఎన్‌ఐఎన్‌ సూచించింది.

మాంసం, పౌల్ట్రీ, గుడ్లలో ఈపీఏ, డీహెచ్‌ఏలు తక్కువ మోతాదులో ఉంటాయని, శాఖాహారంలో అసలు ఉండవని ఈ అధ్యయనం నిర్వహించిన శాస్త్రవేత్త పి.దేవరాజ్‌ తెలిపారు. అవిశగింజలు, చియాసీడ్స్, వాల్‌నట్స్‌ వంటి వాటిల్లో ఏఎల్‌ఏ పూర్వ రూపంలోని రసాయనాలు కొన్ని ఉంటాయని, శాఖాహారులు వీటిని తీసుకోవడం ద్వారా ఏఎల్‌ఏ లేమిని భర్తీ చేసుకోవచ్చని సూచించారు. ఆవనూనె, సోయా నూనెల్లోనూ ఈ కొవ్వులు ఉంటాయని తెలిపారు. ఒమేగా–3 ఫ్యాటీ ఆమ్లాలను ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ అధ్యయనం తెలుపుతోందని ఎన్‌ఐఎన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌.హేమలత వివరించారు.   

మరిన్ని వార్తలు