అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం

19 Jan, 2022 02:08 IST|Sakshi
పరకాల మండలం మల్లక్కపేటలో దెబ్బతిన్న మిర్చి పంటను పరిశీలిస్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి తదితరులు 

పంట నష్టంపై ముఖ్యమంత్రికి నివేదిస్తాం

వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

3 నియోజకవర్గాల్లో మంత్రులు, అధికారుల పర్యటన

సాక్షిప్రతినిధి, వరంగల్‌: ‘అకాల వర్షాలతో చేతికొచ్చిన మిర్చి నేలరాలింది. నర్సంపేట, పరకాల, భూపాలపల్లి, మంథనిలో పంట దెబ్బతింది. రైతులకు జరిగిన నష్టాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నాం. పరిస్థితిని ముఖ్యమంత్రికి వివరించి న్యాయం జరిగేలా చూస్తాం. అధైర్యపడొద్దు..’అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు.

మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి నిరంజన్‌రెడ్డి మంగళవారం హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి జిల్లాల్లోని మూడు నియోజకవర్గాల్లో పర్యటించారు. వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమకు జరిగిన నష్టాన్ని వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు.  

ఏం చేసి బతకాలో తెలుస్తలేదు 
‘కౌలుకు తీసుకుని ఆరెకరాల్లో మిర్చి పంట వేసిన నేను రూ.4 లక్షల వరకు పెట్టుబడి పెట్టిన.. నా భార్య, నేను, ముగ్గురు ఆడపిల్లలు పంట మీదే ఆశలు పెట్టుకున్నం. తామర పురుగు సోకితే మందులు కొట్టినా.. పరిస్థితి చక్కబడి పంట చేతికందే సమయం లో వడగళ్లకు మొత్తం నేలరాలింది.. ఏం చేసి బతకాలో తెలుస్తలేదు..’అంటూ నడికుడ యువరైతు తోర్నె అనిల్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.

‘ఐదెకరాల్లో మిర్చిపంట వేసి ధర బాగా పలుకుతుండటంతో తాహ తుకు మించి ఎకరానికి రూ.లక్షకు పైగా పెట్టుబడి పెట్టిన. అకాల వర్షం వచ్చి మొ త్తం ఊడ్చుకెళ్లింది.. మీరు ఆదుకోకుంటే మాకు చావే శరణ్యం’అంటూ నడికుడకు చెందిన రైతు మాషబోయిన బాబు బోరుమన్నారు. అనంతరం మంత్రులు నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి  మీడియాతో మాట్లాడారు. 

కేంద్ర విధానాలు లోపభూయిష్టం 
దేశ పాలకుల అసంబద్ధ విధానాల వల్ల రైతులకు న్యాయం జరగడం లేదని, వ్యవసాయ విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయని మంత్రులు విమర్శించారు. రైతుకు వెన్నుదన్నుగా నిలిచింది దేశంలో కేసీఆర్‌ సర్కారేనని, ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలవుతోంది ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనేనని చెప్పారు. అకాల వర్షాలతో కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్న మాట వాస్తవమేనని, నష్టపోయిన రైతుల పంటల వివరాలు వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సేకరిస్తారని తెలిపారు.

రైతులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. పంటలను పరిశీలించిన అనంతరం మంత్రులు నర్సంపేటలో అధికారులతో పంట నష్టంపై సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎంపీలు పసునూరి దయాకర్, మాలోతు కవిత, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హనుమంతు, గోపి తదితరులు పర్యటనలో పాల్గొన్నారు. కాగా.. మంత్రుల బృందం నష్ట పరిహారంపై ఎటువంటి హామీ ఇవ్వకపోవడంపై నర్సంపేట మండలంలోని ఇప్పల్‌తండా, ఆకులతండా తదితర గ్రామాలకు చెందిన రైతులు నిరసన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు