సాగు పెరిగింది.. ఎరువుల కోటా పెంచండి 

19 Aug, 2020 05:38 IST|Sakshi
ఢిల్లీలో కేంద్ర మంత్రి సదానందగౌడకు వినతిపత్రం ఇస్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి, చిత్రంలో జనార్దన్‌రెడ్డి

కేటాయించిన యూరియాను వెంటనే పంపండి  

కేంద్ర మంత్రికి రాష్ట్ర మంత్రి నిరంజన్‌రెడ్డి విన్నపం 

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిందని, ఎరువుల కోటా కూడా పెంచాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానందగౌడను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి కోరారు. సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు మంత్రి మంగళవారం ఇక్కడ కేంద్ర మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణకు కేటాయించిన యూరియా కోటాను వెంటనే పంపించాలని విన్నవించారు. ‘తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సానుకూల విధానాలు, కలిసొచ్చిన వాతావరణ పరిస్థితులతో రాష్ట్రంలో ఈసారి గణనీయంగా సాగు విస్తీర్ణం పెరిగింది. కోటీ 25 లక్షల ఎకరాల్లో సాగైంది.

మరో 8.5 లక్షల ఎకరాల్లో ఉద్యానవన పంటలు ఉండగా, ఇంకో ఆరేడు లక్షల ఎకరాల్లో వరినాట్లు వేయాల్సి ఉంది. మొత్తంగా ఈ వానాకాలంలో దాదాపు కోటీ 41 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా. సాగు విస్తీర్ణం పెరిగిన నేపథ్యంలో ఎరువుల వాడకం కూడా గణనీయంగా పెరిగింది. గతేడాది ఇదే సమయానికి 3.5 లక్షల టన్నుల యూరియా వాడితే, ఈ ఏడాది ఇప్పటి వరకు 7 లక్షల టన్నుల యూరియా వినియోగమైంది’అని మంత్రి వివరించారు.

రాష్ట్రంలో సాగునీటి వనరుల రాకతో గతంతో పోలిస్తే ఆరేళ్లుగా సాగు విస్తీర్ణం పెరుగుతోందని వివరించారు. ఈ ఖరీఫ్‌ సీజన్‌కు 10.5 లక్షల టన్నుల యూరియా కేటాయించగా.. ఈ నెల కోటా కింద రెండున్నర లక్షల టన్నుల యూరియా రావాల్సి ఉందని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి 80 వేల టన్నుల యూరియా మాత్రమే వచ్చిందని, మిగిలిన మొత్తాన్ని వెంటనే పంపించాలని కోరారు. మంత్రి వెంట రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్‌ రెడ్డి ఉన్నారు.   

మరిన్ని వార్తలు