Telangana: యాసంగి వడ్లేవీ కొనం

7 Nov, 2021 01:03 IST|Sakshi

వానాకాలం ధాన్యం కొనుగోలుకు ఓకే: మంత్రులు నిరంజన్‌రెడ్డి, కమలాకర్‌

ఈ యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి

ప్రభుత్వం కొనుగోలు చేస్తుందనే నమ్మకంతో సాగు చేయొద్దు

విత్తన కంపెనీలతో ఒప్పందం ఉంటే తప్ప వేయొద్దు

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరి అవమానకరం

వ్యవసాయ ఉత్పత్తులను నియంత్రించి కార్పొరేట్లకు అప్పగించే కుట్ర

సాక్షి, హైదరాబాద్‌: ‘వచ్చే యాసంగి సీజన్‌తో సహా ఏ యాసంగిలోనూ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయదు. వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి. ప్రస్తుత వానాకాలంతో పాటు భవిష్యత్‌లో ఏ వానాకాలం సీజన్‌లోనైనా ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది లేదు. అయితే ఎఫ్‌సీఐ ద్వారా ఏ సీజన్‌లోనూ బాయిల్డ్‌ రైస్‌ కొనుగోలు చేసేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది. యాసంగి దొడ్డు వడ్లలో నూక ఎక్కువ ఉంటుందనే కారణంతో ధాన్యం కొనుగోలు బాధ్యతల నుంచి ఎఫ్‌సీఐ తప్పుకున్న తర్వాత ఆ వడ్లు కొనుగోలు చేయమని కేంద్రం తెగేసి చెప్పింది.

ఈ యాసంగిలో పెసలు, మినుములు, వేరుశనగ వంటి పంటలు వేసుకోవాలని వినమ్రంగా చెప్తున్నాం’అని వ్యవ సాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి,పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. యాసంగిలో ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కుండబద్దలు కొట్టారు. శనివారం మంత్రుల నివాస సముదాయంలో ఇద్దరూ మీడియాతో మాట్లాడారు. ‘విత్తన కంపెనీలతో ముందస్తు ఒప్పందం చేసుకుని సాగు చేసే రైతులతో ఎలాంటి ఇబ్బంది లేదు. కొన్ని జిల్లాల్లో ముందస్తు ఒప్పందం కుదుర్చుకుని వరి సాగు చేసే సంప్రదాయం ఉంది. కానీ, ప్రభుత్వం కొనుగోలు చేస్తుందనే నమ్మకంతో సాగు చేయకండి’అని నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

రైతాంగాన్ని గందరగోళానికి గురిచేయొద్దు..
‘గత యాసంగిలో మిల్లింగ్‌ చేసిన 5 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని కేంద్రం నేటికీ తీసుకోలేదు. రైతులను రోడ్ల మీదకు తెచ్చి ధర్నాలు, నిరసనల ద్వారా లబ్ధిపొందాలని కొన్ని రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులను క్రమంగా నియంత్రించి కార్పొరేట్లకు అప్పగించే కుట్ర జరుగుతోంది. బీజేపీ రాష్ట్ర నేతలు తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు చేస్తామనే ఉత్తర్వులను కేంద్రం నుంచి ఇప్పించాలి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనకు మద్దతిచ్చాం’అని నిరంజన్‌రెడ్డి చెప్పారు. ‘రైతాంగానికి కేంద్రం మేలు చేయాలనుకుంటే కరోనా నేపథ్యంలో చేపట్టిన 5 కిలోల ఉచిత బియ్యం పంపిణీ పథకాన్ని మరో ఐదారు నెలలు పొడిగించాలి. రాష్ట్రాలు బియ్యం ఎగుమతి చేసుకోవచ్చని కేంద్రం చెప్తోంది, కానీ, బియ్యం ఎగుమతి విధానాలు రాష్ట్రం పరిధిలో ఉండవు. వ్యవసాయ ఉత్పత్తులను కొనాల్సిన బాధ్యత కేంద్రం మీదే ఉంటుంది. తన బాధ్యత నిర్వర్తించకుండా రాష్ట్రాలను బాధ్యులను చేయడం సరికాదు’అని నిరంజన్‌రెడ్డి అన్నారు. 

పత్తికి ధర తగ్గితే కొనుగోలు కేంద్రాలు...
‘యాసంగిలో ఉష్ణోగ్రతలను తట్టుకునే వరి వంగడాలను రూపొందించాలని భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థను కోరాం. ప్రస్తుతం యాసంగిలో సాగుకు సంబంధించి అన్ని రకాల విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయి. యాసంగికి అవసరమైన ఎరువుల సరఫరా కోసం త్వరలో కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రిని కలుస్తాం. పంటల సాగులో రైతులకు ఎలాంటి షరతులు పెట్టం. ప్రస్తుతం పత్తి సాగు చేసిన రైతులు ఎంఎస్‌పీ కంటే అదనపు ధర పొందుతున్నారు. ఎంఎస్‌పీ కంటే దిగువకు పత్తి ధర పడిపోతే సీసీఐ ద్వారా కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తాం.

రాష్ట్రంలో సాగునీటి రంగం అభివృద్ధితో పాటు రైతు సంక్షేమానికి సీఎం తీసుకున్న నిర్ణయాలతో ఈ ఏడాది వానాకాలంలో 1.41 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో 62.08 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. అయితే ధాన్యం కొనుగోలుకు సంబంధించి రాష్ట్రంలో ఉత్పన్నమవుతున్న కొన్ని పరిస్థితులను రైతులకు వివరించేందుకు వ్యవసాయ, పౌర సరఫరాల, మార్కెటింగ్‌ శాఖల అధికారులు ప్రయత్నిస్తున్నారు’అని నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. కామారెడ్డిలో ధాన్యం కుప్ప వద్ద రైతు మరణంపై కలెక్టర్‌ నివేదిక అందిందని, అది సహజ మరణమని పేర్కొన్నారు. కాగా, మిల్లులకు ధాన్యం తెస్తున్న రైతులను నియంత్రించేందుకు స్థానిక అధికారులు టోకెన్లు ఇస్తున్నారని గంగుల వెల్లడించారు. మీడియా సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌ రావు, పౌరసరఫరాల కమిషనర్‌ అనిల్‌కుమార్, మార్కెటింగ్‌ ఓఎస్‌డీ జనార్దన్‌రావు పాల్గొన్నారు.

ధాన్యం కొంటామని ప్రకటిస్తే కాళ్లు పట్టుకుంటా..
రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
పాలకుర్తి:
ధాన్యం కొనేందుకు కేంద్రం సిద్ధమని చెప్పే ధైర్యం బీజేపీ నాయకులు, ఆ పార్టీ ప్రజాప్రతినిధులకు లేదు.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కేంద్రంతో ప్రకటన చేయిస్తే ఆయన కాళ్లు పట్టుకుంటానని రాష్ట్ర పంచాయతీరాజ్‌ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి సహకార సొసైటీ ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన శనివారం ప్రారంభించి మాట్లాడారు. ఖరీఫ్‌ ధాన్యం కొనేందుకు కేంద్రం సిద్ధంగా లేకపోవడంతో రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో కేసీఆర్‌ రూ.25 వేల కోట్లు కేటాయించి కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొంటున్నారని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో తెలంగాణకు దొంగచాటుగా తీసుకువచ్చి మద్దతు ధరకు విక్రయిస్తున్నారని తెలిపారు. వచ్చే యాసంగిలో వరి పంట కొనడం సాధ్యంకాదని, రైతులు ఆరు తడి పంటలు వేసుకోవడం ద్వారా అధిక ఆదాయం పొందవచ్చని సూచించారు. ఆయిల్‌ ఫామ్‌ సాగుతో ఎకరాకు రూ.3 లక్షల వరకు పొందే అవకాశం ఉందని చెప్పారు.  

  • ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు, రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి అభ్యంతరకరం, అవమానకరం. ఈ విషయంలో కేంద్రం వద్దకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా రెండు పర్యాయాలు వెళ్లినా నిర్లిప్తవైఖరే చూపుతోంది. ధాన్యం కొనుగోలు చేస్తే కేంద్రంతో పంచాయితీ ఉండదు.    – నిరంజన్‌రెడ్డి
  • ప్రభుత్వపరంగా ధాన్యం కొనుగోలుకు సూర్యాపేట జిల్లాలో 247 కొనుగోలు కేంద్రాలు ప్రతిపాదించాం. ఇప్పటి వరకు ఐదు చోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా రైతులు రావడం లేదు. రాష్ట్రంలో కోతలు జరుగుతున్న కొద్దీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం.    – గంగుల 
మరిన్ని వార్తలు