వ్యాక్సిన్‌ తీసుకున్న 108 డ్రైవర్‌ మృతి

21 Jan, 2021 07:08 IST|Sakshi

వ్యాక్సిన్‌ వేసుకున్న మరుసటి రోజే ఛాతీలో నొప్పితో మరణించిన విఠల్‌రావు

ఫోరెన్సిక్‌ వైద్యబృందంతో పోస్టుమార్టం

హైదరాబాద్, పుణెలకు టిష్యూ, సీరం 

సాక్షి, నిర్మల్‌/ కుంటాల: కరోనా టీకా తీసుకున్న మర్నాడే... ఓ 108 అంబులెన్స్‌ డ్రైవర్‌ మృతి చెందడం కలకలం రేపింది. గుండెపోటుతో ఈ మరణం సంభవించిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించినా... ఇది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నిర్మల్‌ జిల్లా కుంటాల మండలం ఓలా గ్రామానికి చెందిన 108 అంబులెన్స్‌ పైలట్‌ విఠల్‌రావు బుధవారం ఛాతీలో నొప్పితో మృతిచెందారు. వ్యాక్సినేషన్‌ అనంతరం సంభవించిన మరణం కావడంతో... అది ఎలా జరిగిందన్న విషయాన్ని తెలుసుకోవడానికి వైద్యశాఖ ఉన్నతాధికారులు ఫోరెన్సిక్‌ బృం దంతో పోస్టుమార్టం చేయించారు. ఇందుకోసం నిజామాబాద్, ఆదిలా బాద్‌ మెడికల్‌ కళాశాలల నుంచి ఇద్దరేసి చొప్పున నలుగురు ఫోరెన్సిక్‌ వైద్యులు, నిజామాబాద్‌ నుంచి ముగ్గురు పాథాలజీ విభాగం వైద్యులు, నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ ఆస్పత్రి నుంచి మరో వైద్యుడిని రప్పించారు. భౌతికకాయం నుంచి సేకరించిన శాంపిళ్లను పుణే, హైదరాబాద్‌ పరీక్ష కేంద్రాలకు పంపించారు.

సెలవులో ఉన్నా.. వ్యాక్సిన్‌కు వెళ్లాడు
కుంటాలలో భార్యాపిల్లలతో అద్దె ఇంట్లో ఉంటున్న విఠల్‌రావు (42).. ఇదే మండలంలోని కల్లూరులో 108 అంబులెన్స్‌ పైలట్‌ (డ్రైవర్‌)గా పని చేస్తున్నాడు. భార్య రుక్మిణి బీడీలు చుడుతుంది. కూతురు నవనిక పదో తరగతి, కుమారుడు మణికంఠ ఎనిమిదో తరగతి చదువుతున్నారు. గత నెల 6న సారంగాపూర్‌ మండలం కంకెట వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో విఠల్‌రావు గాయపడ్డాడు. చికిత్సలో భాగంగా కుడికాలు బొటనవేలిని తొలగించారు.

అప్పటి నుంచి సెలవులోనే ఉన్నాడు. కుంటాల పీహెచ్‌సీలో మంగళవారం వైద్య సిబ్బందికి వ్యాక్సిన్‌ వేస్తుండటంతో విఠల్‌రావు కూడా వెళ్లి తీసుకున్నాడు. కొద్దిసేపు అబ్జర్వేషన్‌లో ఉండి ఇంటికి వెళ్లాడు. రాత్రి పడుకునే ముందు కూడా బాగానే ఉన్నట్లు చెబుతున్నారు. బుధవారం తెల్లవారుజామున ఛాతిలో నొప్పి రావడంతో సహచర 108 సిబ్బందికి ఫోన్‌ చేసి చెప్పాడు. దీంతో వారు అంబులెన్స్‌ తీసుకుని వెంటనే కుంటాలకు వచ్చి, అక్కడి నుంచి నిర్మల్‌ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారిలోనే విఠల్‌రావు మృతిచెందాడు.

కుటుంబానికి రూ.10 లక్షల వరకు బీమా సొమ్ము 
మా సంస్థలో ఉద్యోగులకు రెండు రకాల ఇన్సూరెన్స్‌ పాలసీలున్నాయి. ఒక్కో పాలసీలో రూ. 5 లక్షల చొప్పున మొత్తంగా రూ.10 లక్షల వరకూ బీమా సొమ్ము వచ్చే అవకాశం ఉంది. మృతుడు విఠల్‌ రావుకు కుటుంబానికీ నిబంధనల మేరకు రూ.10 లక్షల వరకూ బీమా సొమ్ము చెల్లిస్తాం. భార్యకు విద్యార్హతలను బట్టి సంస్థలో ఉద్యోగం ఇస్తాం.
 – జీవీకే–ఈఎంఆర్‌ఎ చీఫ్‌ ఆపరేటింగ్‌ అధికారి బ్రహ్మానందరావు  

ఈ నేపథ్యంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కుంటాల పీహెచ్‌సీలో విఠల్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నాడు. ఇక రాత్రి‌ తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో కుటుంబ సభ్యులు అతడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. విఠల్‌ మృతి చెందాడు. అయితే విఠల్‌ మృతిపై ప్రజా  డైరెక్టర్  అప్ పబ్లిక్ హెల్త్ స్పందించారు. గుండెపోటుతో ఆయన మరణించారని ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా వ్యాక్సిన్ కు సంబందం లేదన్నారు.  మరణంపై  విచారణ కోసం  కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు బుదవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

Poll
Loading...
Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు