Nirmal Collector: అప్పుడు తండ్రి, ఇప్పుడు తల్లి మృతి.. ఐదేళ్ల చిన్నారిని అక్కున చేర్చుకున్న కలెక్టర్‌

18 Nov, 2021 09:46 IST|Sakshi

హుషారుగా ఉన్నావ్‌.. రోషిణీ బాగా చదవాలి: కలెక్టర్‌ ప్రశంస

సాక్షి, నిర్మల్‌: ‘రోషిణి నువ్వు చాలా హుషారుగా ఉన్నావ్‌. బాగా చదవాలి..’ అంటూ కలెక్టర్‌ ముషరఫ్‌ అలీ ఫారూఖి ఓ చిన్నారిని ప్రశంసించారు. ముధోల్‌ మండలం ఎడ్‌బిడ్‌ గ్రామానికి చెందిన భూమవ్వ అనారోగ్యంతో రెండ్రోజుల క్రితం చనిపోయింది. ఆమెకు భర్త కూడా లేకపోవడంతో కూతురు రోషిణి(5) అనాథలా మారింది. ఈ విషయం ఇటీవల ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్‌కు పోస్టు చేయగా.. కలెక్టర్‌ ముషరఫ్‌ అలీ ఫారూఖికి రీట్వీట్‌ చేశారు. మంత్రి సూచన మేరకు ఆయన బుధవారం ఎడ్‌బిడ్‌ గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్‌.. చిన్నారి రోషిణితో మాట్లాడారు. నీ పేరేంటి అని ప్రశ్నించగా.. రోషిణి అని సమాధానమిచ్చింది.
చదవండి: మనం ఏ స్థాయిలో ఉన్నా డ్రెస్సు, అడ్రెస్సు మారకూడదు: ఉప రాష్ట్రపతి

‘‘నువ్వు స్కూల్‌కెళ్తున్నవా..’’ అనగా.. బాలబడికి వెళ్తున్నానని చెప్పింది. ‘‘మీ అంగన్‌వాడీ టీచర్‌ ఎవరు..’’ అనగా.. ‘‘అగో ఆమెనే..’’ అని చూపించింది. ‘‘అంగన్‌వాడీలో ఏం పెడుతున్నరనగా.. ‘‘అన్నము, గుడ్డు..’’ అంటూ మెరుస్తున్న కళ్లు.. ఆడిస్తున్న చేతులతో చూపించగానే కలెక్టర్‌ ఒక్కసారిగా నవ్వారు. అనంతరం రోషిణి తన బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. శిశుసంరక్షణ అధికారులతో మాట్లాడి, రోషిణిని ఆదిలాబాద్‌ శిశుగృహానికి పంపించారు. గ్రామస్తులు దాతల ద్వారా సేకరించిన రూ.1.80లక్షల విరాళాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో లోకేశ్వర్‌రావు, తహసీల్దార్‌ శివప్రసాద్, సీడీపీవో శ్రీమతి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు