ఏడువారాల గుహలు.. తళుక్కుమంటున్న రాళ్లు

26 Feb, 2022 09:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నిర్మల్‌ జిల్లా సిరాలగ్రామం శివారులోని గుహలు తళుక్కుమంటున్నాయి. ఎవరో రంగులద్దినట్టు ఇంద్రధనస్సు తరహాలో వాటిల్లోని రాళ్లు మెరుస్తున్నాయి. దాదాపు అర కిలోమీటరు వెడల్పుతో నాలుగైదు కిలోమీటర్ల మేర ఈ గుహలు విస్తరించి ఉన్నాయి. లిమొనైట్, హెమటైట్‌ తదితరాలతో కూడిన ఈ శిలలు ఇనుప ఖనిజంతో ఉన్నందుననే ఇలా రకరకాల రంగుల్లో కనిపిస్తున్నాయని జీఎస్‌ఐ విశ్రాంత డిప్యూటీ డైరక్టర్‌ జనరల్‌ చకిలం వేణుగోపాల రావు చెప్పారు. ఈ నిక్షేపాలు జీఎస్‌ఐ అధికారికంగా గుర్తించిన జాబితాలో లేవన్నారు. శిలల్లో ఇనుప ఖనిజ పరిమాణం ఎంత ఉందో శాస్త్రీయ పద్ధతిలో పరిశీలించాల్సి ఉందని చెప్పారు.

25 కోట్ల నుంచి 17 కోట్ల సంవత్సరాల క్రితం శిలలు ఏర్పడి ఉంటాయని జీఎస్‌ఐ అంచనా. తాజాగా ఈ గుహలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు బలగం రామ్మోహన్‌ పరిశీలించారు. ఈ ఖనిజం విషయాన్ని పక్కనపెడితే గుహలు సందర్శకులకు కొత్త వినోదాన్ని పంచుతున్నాయని చెప్పారు. వీటి గురించి స్థానికులకు తప్ప ఇతర ప్రాంతాల వారికి పెద్దగా అవగాహన లేదని, అందుకే పెద్దగా పర్యాటకులు రావట్లేదని అన్నారు. స్థానికులు వీటిని ఏడువారాల గుహలంటున్నారని చెప్పారు. రుషులు ఒక్కో రోజు ఒక్కో గుహలో తపస్సు చేసుకునేవారని ప్రచారంలో ఉందని అన్నారు.

మరిన్ని వార్తలు