Kadem Project: దడ పుట్టిస్తున్న‘కడెం’ ప్రాజెక్టు.. 64 ఏళ్ల రికార్డు బద్దలు

13 Jul, 2022 09:18 IST|Sakshi

సాక్షి, నిర్మల్‌: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నిర్మల్‌ జిల్లా కడెం ప్రాజెక్టుకు రికార్డుస్థాయిలో వరద వస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో గతంలో ఎన్నడూ లేనివిధంగా 64 ఏళ్ల రికార్డును బద్దలు చేస్తూ వరదనీరు వచ్చి చేరుతోంది. మంగళవారం రాత్రి నుంచి ప్రాజెక్టుకు వరద ఉధృతి భారీగా కొనసాగుతుంది. వరద నీరు తీవ్రంగా పోటెత్తుతుండటంతో ప్రాజెక్ట్‌లో నీటిమట్టం ప్రమాద స్థాయిలో ఉందని అధికారులు ప్రకటించారు. కడెం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 7.603 టీఎంసీలు. 

ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నీటిమట్టానికి చేరుకొని 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరడంతో  ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తిన అందులో ఒక్కటి లేవక పోయేసరికి మొత్తం 17 గేట్లు ఎత్తి అధికారులు రెండు లక్షల 50వేల క్యూసెక్కుల నీటిని దిగకు వదిలారు. అయినా  అవుట్ ఫ్లో కంటే ఇన్ ఫ్లో రెండు లక్షల క్యూసెక్కులు ఎక్కువ ఉండడంతో ప్రాజెక్టు కట్ట పైనుంచి నీరు ప్రవహిస్తుంది. వరద ఇంకా పెరిగితే ప్రమాదం పొంచిఉందని అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

అదనంగా మూడు లక్షల నీరు ప్రాజెక్టు పైనుండి వారుతుండడంతో జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ, ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఎమ్మెల్యే రేఖా నాయక్, అదనపు కలెక్టర్ హేమంత్ ప్రాజెక్టు వద్ద ప్రాంతాన్నిపరిశీలించారు. స్థానిక అధికారులు అప్రమత్తమై కడెం మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు ముంపు గ్రామాలను ఎత్తైన ప్రాంతాలకు తరలించారు.  ఇప్పటి వరకు 12 గ్రామాలకు చెందిన 3 వేల కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. 
చదవండి: హైదరాబాద్‌ పరిధిలో 68% అధిక వర్షపాతం.. వరద నీరు ఇంకే దారేదీ?

‘గడ్డెన్నవాగు’కు భారీగా ఇన్‌ఫ్లో
భైంసాటౌన్‌: ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు భైంసాలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. సోమవారం మధ్యాహ్నం ఇన్‌ఫ్లో తగ్గడంతో గేట్లు మూసివేయగా, రాత్రి నుంచి మళ్లీ ఇన్‌ఫ్లో పెరుగుతుండడంతో అర్ధరాత్రి గేట్లు ఎత్తారు. ఉదయం రెండు, ఆ తరువాత మూడు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు 32 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, 25,200 క్యూసెక్కుల నీటిని వదిలిపెడుతున్నారు. 

‘సదర్మాట్‌’ పరవళ్లు..
ఖానాపూర్‌: ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మంగళవారం గోదావరి అత్యంత ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎస్సారెస్పీలో 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదలడంతో గోదావరికి ఉగ్రరూపం దాల్చింది. మండలంలోని మేడంపల్లి గ్రామంలోని సదర్మామాట్‌ వద్ద పూర్తిస్థాయి నీటిమట్టం 7.6 ఫీట్లు కాగా, మగంళవారం 9.11 ఫీట్లలో నీటిమట్టం కొనసాగుతోంది. 35,399  క్యూసెక్కుల వరద గోదావరిలోకి వెళ్తుందని జేఈఈ ఉదయ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు