అంతా మీ ఇష్టం అంటే నడవదు.. కేసీఆర్‌ సర్కార్‌కు నిర్మలా సీతారామన్‌ కౌంటర్‌

3 Sep, 2022 17:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ నేతలు మాటల తూటలు పేలుస్తున్నారు. రెండు పార్టీల నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. కాగా, కేంద్ర వాటా ఉన్నా స్కీమ్‌కు కేంద్రం పేరు పెట్టాల్సిందేనని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తేల్చి చెప్పారు. 

బీజేపీ కార్యాలయంలో నిర్మలా సీతారామన్‌ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం వాటా ఉన్న పథకాలకు కేంద్రం పేరు పెట్టాల్సిందే. రాష్ట్రం వాటా ఇచ్చిన మరుక్షణమే కేంద్రం వాటా విడుదల చేస్తున్నాము. 2021 వరకు తెలంగాణ ఆయుష్మాన్‌ భారత్‌లో ఎందుకు చేరలేదు?. మీడియా సమావేశంలో నేనేం మాట్లాడానో మంత్రి హారీష్‌ రావు పూర్తిగా తెలుసుకోవాలి. హారీష్‌ రావు వ్యంగంగా, వెటకారంగా మాట్లాడటం సరికాదు. మంత్రులు అవతలి వారు ఏం మాట్లాడారో జాగ్రత్తగా విని స్పందించాలి అని కౌంటర్‌ ఇచ్చారు. ఆదిలాబాద్‌లో ఉన్న ప్రాజెక్ట్‌కు హైదరాబాద్‌ ఎంపీ ఫొటో పెడతారా? అని ప్రశ్నించారు. 

కేంద్రం నిధులు ఇచ్చినా రాష్ట్రం ఇవ్వకపోవడంతో ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉంటున్నాయి. రాష్ట్ర మంత్రులు నిజానిజాలు తెలుసుకొని మాట్లాడాలి. 60 శాతం నిధులు కేంద్రం ఇస్తే.. 40 శాతం రాష్ట్రాలు భరించాలి. హైదరాబాద్‌ నుంచే తెలంగాణకు 55 శాతం ఆదాయం వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ లాభసాటి కాదని నిపుణులే అంటున్నారు. అప్పులు తీసుకొచ్చి చేసే పనులు ఆలస్యం అయితే కేంద్రానిది బాధ్యత కాదు.

రైతుల సమస్యలపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టాం. జిల్లాల పర్యటనలో చాలా విషయాలు తెలుసుకున్నాను. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు పార్లమెంట్‌ ప్రవాస్‌ యోజన ఉంది. ప్రతీ పథకంలో కేంద్రం వాటా ఉంటుంది. నిధులు పక్కదారి పట్టకుండా డిజిటలైజేషన్‌ తెచ్చాము. సెస్‌ల పేరుతో వసూలు చేసే నిధులు కూడా రాష్ట్రాలకే వెళ్తాయి. ఏ కారణంతో సెస్‌ వసూలు చేశారో.. వాటి కోసమే ఆ నిధులు ఖర్చు చేయాలి. ఫైనాన్స్‌ కమిషన్‌ ఇచ్చిన ఫార్ములా ప్రకారం రాష్ట్రాలకు నిధులు ఇస్తూనే ఉన్నాము. ఈ స్టేట్‌కు తక్కువ, ఒక రాష్ట్రానికి ఎక్కువ ఇవ్వడం అనేది ఉండదు అని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు