‘గేట్‌’ మనోళ్లదే! ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకు సొంతం

18 Mar, 2022 01:24 IST|Sakshi
మణి సందీప్‌రెడ్డి, ప్రణీత్‌కుమార్‌  

ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకు సాధించిన మణి సందీప్‌రెడ్డి, మాచర్ల ప్రణీత్‌కుమార్‌

సాక్షి, హైదరాబాద్‌/కాజీపేట అర్బన్‌/మధిర: ఐఐటీలు, ఇతర ప్రముఖ విద్యాసంస్థల్లోని మాస్టర్‌ డిగ్రీలో ప్రవేశానికి నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూట్‌ టెస్ట్‌(గేట్‌)–2022 ఫలితాలను గురువారం ఐఐటీ ఖరగ్‌పూర్‌ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన మాచర్ల ప్రణీత్‌ కుమార్, మణి సందీప్‌రెడ్డి ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకు సాధించారు. గేట్‌ కోసం దేశవ్యాప్తంగా 9 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో జరిగిన ఈ పరీక్షకు 7,11,542 మంది హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి లక్ష మందికిపైగా గేట్‌ రాశారు. దేశవ్యాప్తంగా 1,26,813 (17.82 శాతం) మంది అర్హత పొందారు. మొత్తం 100 మార్కులుండే ఈ పరీక్షకు ఈసారి 25 మా ర్కులు అర్హత(కటాఫ్‌)గా నిర్ణయించారు. ర్యాంకుల వివరాలు, డౌన్‌లోడ్‌ కోసం gate.iitkgp.ac.in వెబ్‌సైట్‌ను లాగిన్‌ కావాలని ఐఐటీ ఖరగ్‌పూర్‌ తెలిపింది.

గేట్‌లో మొదటి ర్యాంకు సాధించిన వరంగల్‌ నిట్‌ కెమికల్‌ ఇంజనీరింగ్‌ విభాగం ఫైనలియర్‌ విద్యార్థి మణి సందీప్‌రెడ్డికి ఆ సంస్థ డైరెక్టర్‌ ఎన్వీ రమణారావు గురువారం మొక్కను బహూకరించి అభినందించారు. అదేవిధంగా నిట్‌ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన హర్‌దీప్‌ 42వ ర్యాంకు సాధించాడు.  

స్వీయశిక్షణతోనే టాప్‌ర్యాంక్‌:మణి సందీప్‌రెడ్డి 
గేట్‌లో మొదటిర్యాంకు పొందడం సంతోషంగా ఉంది. రాజమండ్రికి సమీపంలోని వెదురుపాక సొంతూరు అయినప్పటికీ, టెన్త్, ఇంటర్‌ హైదరాబాద్‌లోనే చదువుకున్నాను. మా నాన్న రామగోపాల్‌రెడ్డి హైదరాబాద్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌తోపాటు షాపు నిర్వహిస్తాడు. అమ్మ ఐశ్వర్య భాగ్యలక్ష్మి గృహిణి. ఇంజనీరింగ్‌ చేస్తూనే సొంతంగా గేట్‌కు ఆరునెలలపాటు తర్ఫీదు అయ్యాను. మార్కెట్లో దొరికే వివిధ రకాల స్టడీ మెటీరియల్స్‌తో నా ప్రిపరేషన్‌ అయ్యాను.  

పేద కుటుంబంలో విద్యాకుసుమం 
ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన మాచర్ల శ్రీనివాసరావు– రమామణి దంపతుల కుమారుడు ప్రణీత్‌కుమార్‌ అలహాబాద్‌ నిట్‌లో బీటెక్‌(ఈఈఈ) పూర్తిచేశారు. శ్రీనివాసరావు స్థానిక సీపీఎస్‌ రోడ్డులో బడ్డీకొట్టు ఏర్పాటు చేసుకుని దారాలు, గుండీలు వంటి టైలరింగ్‌ మెటీరియల్‌ విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. పేద కుటుంబమే అయినా కష్టపడుతూ కుమారుడిని చదివించారు. మాచర్ల శ్రీనివాసరావు ‘సాక్షి’తో మాట్లాడుతూ రేయింబవళ్లు కష్టపడి చదివిన ప్రణీత్‌ జాతీయస్థాయిలో ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించటం సంతోషంగా ఉందన్నారు. ప్రణీత్‌కుమార్‌ ఫోన్‌లో మాట్లాడుతూ చిరు వ్యాపారం చేసే తన తల్లిదండ్రుల కష్టాన్ని కళ్లారా చూసిన పట్టుదలతో చదివినట్లు తెలిపారు.  

తెనాలి యువకుడికి 21వ ర్యాంకు
గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి గ్రామానికి చెందిన ఆళ్ల శేషసాయిరెడ్డి 21వ ర్యాంకు సాధించారు. ఈయన ప్రస్తుతం కోల్‌ ఇండియాలో డిప్యూటీ మేనేజరుగా పనిచేస్తున్నారు. మరోవైపు యూపీఎస్సీ నిర్వహిం చిన ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీస్‌ (ఐఈఎస్‌) ఇంటర్వ్యూకూ హాజరయ్యారు. ఈయన తల్లి దీపలత సెకండరీ గ్రేడ్‌ టీచరు కాగా.. తండ్రి ఆళ్ల రవీంద్రారెడ్డి రైతు. శేషసాయిరెడ్డి నాగపూర్‌ ఎన్‌ఐటీలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ చదివా రు. బెంగళూరులో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌లో సీటు.. ఎంటెక్‌ చేయటం, తర్వాత పీహెచ్‌డీ పూర్తిచేయాలని ఉందని ఆయన చెప్పారు. ఐఈఎస్‌లో జాబ్‌ వస్తే మరింత సంతోషమన్నారు.

మరిన్ని వార్తలు