జవాన్ల గ్రామం.. ఊరి తల్లిదండ్రులకు పాదాభివందనం

5 Aug, 2022 20:12 IST|Sakshi

సైన్యంలోకి 21 మంది యువకులు

తాజాగా అగ్నిపథ్‌ కోసం మరికొందరి దరఖాస్తులు

కుటుంబాలకు దూరంగా ఉంటూ దేశ సేవలో తరిస్తూ..

గర్వంగా ఉందంటున్న సైనికుల కుటుంబాలు

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : ప్రాణాలు పణంగా పెట్టి సరిహద్దుల్లో పహారా కాసే జవాన్లుగా ప్రత్యక్షంగా దేశసేవ చేస్తూ తమ ఊరికే కాక నిజామాబాద్‌ జిల్లాకే గర్వకారణంగా నిలుస్తున్నారు ఈ యువకులు. మాక్లూర్‌ మండలంలోని అడవి మామిడిపల్లి నుంచి గత 21 ఏళ్లలో సగటున ఏడాదికొకరు చొప్పున 21 మంది యువకులు ఆర్మీ, ఐటీబీపీ (ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌) దళాల్లోకి వెళ్లారు. మొత్తం ఉత్తర తెలంగాణలోనే ఈ ఊరి ప్రత్యేకతను చాటుతున్నారు. దీంతో ఈ గ్రామాన్ని ‘అడవి మామిడిపల్లి’ అని కాకుండా ‘జైహింద్‌ మామిడిపల్లి’ అని మార్చాలనే స్ఫూర్తిని కలిగిస్తోంది.

ఇక ఊరిలోకి అడుగుపెట్టగానే స్వామి వివేకానంద విగ్రహం కనిపిస్తుంది. ఊరి మధ్యలో ఛత్రపతి శివాజీ మహరాజ్‌ విగ్రహం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాలు దర్శనమిస్తాయి. దేశభక్తి స్ఫూర్తిగా విగ్రహాలు నెలకొల్పడంతో పాటు తమ బిడ్డలను దేశ రక్షణ కోసం సరిహద్దుల పహారాకు పంపుతున్న ఆ ఊరి తల్లిదండ్రులకు పాదాభివందనం చేయాలని పలువురు చెబుతుండడంలో అతిశయోక్తి లేదు.

చాలాసార్లు ఏడుపొస్తుంది
మా కుమారుడు కల్లెడి సాయికుమార్‌ 2012లో ఆర్మీలోకి వెళ్లాడు. ఉన్న ఎకరం అమ్మి కుమార్తె పెళ్లి చేశాం. మాకు ఇల్లు లేదు. అద్దెకు ఉంటున్నాం. ఇంటర్‌ తర్వాత చదివించలేకపోయాం. ఉన్న ఒక్క కొడుకు పట్టుబట్టి ఆర్మీలోకి వెళ్లాడు. ఒక్కడే కొడుకు కావడంతో బాధతో చాలాసార్లు ఏడుస్తాం. అయినా దేశానికి సేవ చేస్తున్నందుకు గర్వంగా ఉంది. ఫోన్‌ చేసి ఏడవద్దని ఓదారుస్తాడు. మా కోడలి డెలివరీకి సైతం అతి కష్టంమీద సెలవు తీసుకుని వచ్చి వెళ్లాడు.  
–కల్లెడి జయ, నారాయణ దంపతులు 

అగ్నిపథ్‌కు ముందుకొస్తున్నారు..
మా ఊరి నుంచి యువకులు సైన్యంలోకి వెళ్లడం 2000 సంవత్సరం నుంచి మొదలైంది. ఇప్పటి వరకు 21 మంది యువకులు ఆర్మీ, ఐటీబీపీ విభాగాల్లోకి వెళ్లారు. ముగ్గురు ఇప్పటికే ఆర్మీ నుంచి రిటైర్‌ కాగా మిగిలినవారు సర్వీసులో ఉన్నారు. మరో ఎనిమిది మంది యువకులు అగ్నిపథ్‌కు దరఖాస్తులు చేసుకున్నారు. 600 గడపలు ఉన్న మా ఊరి నుంచి క్రమం తప్పకుండా యువకులు సైన్యంలోకి వెళుతుండడం ఊరంతటికీ గర్వకారణం. 
– గంగోని సంతోష్, మాజీ సర్పంచ్‌

ఎన్‌ఎస్‌జీలో పనిచేశాను..
దేశ సేవ చేయాలని ఆర్మీలోకి వెళ్లాను. అసోంలో పనిచేసే సమయంలో కఠినంగా సాధన చేసి ఎన్‌ఎస్‌జీ(నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌)కి ఎంపికయ్యా. ఎన్‌ఎస్‌జీలో మూడేళ్లు పనిచేశా. 90 రోజుల కఠిన శిక్షణలో నెగ్గితేనే దీనికి ఎంపిక చేశారు. మిలిటెంట్‌ ఆపరేషన్, వీఐపీ పర్యటనలు, బాంబ్‌ స్క్వాడ్‌ విధుల్లో పాల్గొన్నాను. 16 ఏళ్ల సర్వీసు పూర్తయ్యాక ఊరికి వచ్చి కౌలు వ్యవసాయం చేస్తున్నా. ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగావకాశాలు ఇవ్వడం లేదు. 
– కాపుకారి జానకీరాం, మాజీ జవాన్‌ 

శ్రీనగర్‌లో హవల్దార్‌గా..
గత 19 సంవత్సరాలుగా ఆర్మీలో పనిచేస్తున్నా. సిపాయిగా ఎంపికై లాన్స్‌నాయక్, నాయక్‌గా ఉన్నతి పొంది ప్రస్తుతం హవల్దార్‌గా ఉన్నాను. ప్రస్తుతం శ్రీనగర్‌లో విధులు నిర్వహిస్తున్నాను. పలుసార్లు తీవ్ర మంచులో ఆపరేషన్లలో పనిచేశాను. రోడ్లు ధ్వంసమై, కొండచరియలు విరిగిపడిన సందర్భాల్లో నెలలతరబడి బయటకు రాలేని పరిస్థితి. కనీసం ఎవరితోనూ కమ్యూనికేషన్‌ లేకుండా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. 
– కేతావత్‌ రవీందర్‌ 

పెద్దనాన్న మృతి సైతం తెలియలేదు..
2011లో ఆర్మీలో చేరాను. ప్రస్తుతం జమ్ములో నాయక్‌ హోదాలో పనిచేస్తున్నా. మహారాష్ట్ర, రాజస్థాన్, సికింద్రాబాద్, కశ్మీర్‌లలో పనిచేశాను. మేం మరణించినా సరే శత్రువును చంపడమే లక్ష్యంగా పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది. కొన్ని సందర్భాల్లో 3 నెలల పాటు కుటుంబ సభ్యులతో పాటు మరెవరితోనూ కమ్యూనికేషన్‌ లేదు. నా పెద్దనాన్న మృతి గురించి కూడా తెలియకుండా అయింది. 
– బాణావత్‌ నరేశ్‌ 

ఆర్టికల్‌ 370 రద్దు తరువాత..
2012లో ఆర్మీలో చేరి ప్రస్తుతం జమ్ములో హవల్దార్‌గా విధులు నిర్వహిస్తున్నా. ఆర్టికల్‌ 370 రద్దు చేసిన సమయంలో మూడు నెలల పాటు ఏమాత్రం కమ్యూనికేషన్‌ అనేది లేకుండా పోయింది. బయటి ప్రపంచంతో సంబంధం లేని లేకుండా విధులు నిర్వహించాం. ఆర్మీలో పనిచేయడం ఆనందంగా ఉంది. 
– సంగెం అనిల్‌ 

17 ఏళ్ల సర్వీసు పూర్తి.. 
మా ఊరి నుంచి మొదటిసారి 2000 సంవత్సరంలో చంద్రశేఖర్‌ ఆర్మీలోకి వెళ్లారు. ఆయన స్ఫూర్తితో నేను సైతం దేశ సేవ చేసేందుకు 2004లో ఆర్మీలో చేరాను. జమ్ము కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో పనిచేశాను. 17ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుని 2021లో వచ్చాను. అప్పటినుంచి గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్నా. 
– మావూరి రవీందర్, మాజీ జవాన్‌ 

భర్త గురించి టెన్షన్‌ పడ్డా..
నా భర్త జానకీరాం ఆర్మీలో చేసే సమ యంలో నేను కూడా పంజాబ్, ఢిల్లీ, జమ్ము కశ్మీర్, హైదరాబాద్‌ క్వార్టర్స్‌లో ఉన్నా. అయితే అభినందన్‌ వర్ధమాన్‌ ఘటన నేపథ్యంలో నా భర్త కిట్‌ బ్యాగులతో వెళ్లిన సందర్భంలో ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందాను. నా భర్త ఏ విషయం చెప్పకపోవడంతో బాగా టెన్షన్‌ కలిగింది. ప్రస్తుతం సర్వీసు పూర్తి చేసుకుని ఊర్లోనే ఉంటున్నాం.          
– కాపుకారి భవిత 

గర్వంగా ఉంది..
నా భర్త అనిల్‌ ఆర్మీ లో పనిచేస్తున్నాడంటే ఏదో ఉద్యోగం అనుకున్నా. అయితే ఇది దేశం కోసం చేసే అత్యంత రిస్క్‌ అని తెలిసి ఆందో ళన చెందినప్పటికీ గర్వంగానే ఉంటోంది. కు టుంబాన్ని మిస్‌ అవుతున్నప్పటికీ మాకు గర్వమే. గతంలో ఢిల్లీలో ఉన్నాను. ఇప్పుడు నా భర్త జమ్ములో పనిచేస్తుండగా, నేను ఇద్దరు పిల్లలు, అత్త, మామలను చూసుకుంటూ ఊర్లోనే ఉంటున్నా.                 
– సంగెం వాణి 

అప్పుడప్పుడు బాధ కలుగుతుంది
మాకు ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఏకైక కుమారుడు అనిల్‌ జమ్ము లో ఆర్మీలో పనిచేస్తున్నాడు. అందరికీ పెళ్లిళ్లు చేశాను. ఒక్కగానొక్క కొడుకును ఆర్మీలోకి ఎలా పంపావని చాలామంది అడుగుతుంటే, జమ్ము కశ్మీర్‌లో విధ్వంసకర వార్తలు వస్తుంటే బాధ కలుగుతుంది. అయినప్పటికీ మా కొడుకు విషయంలో గర్వంగా ఉంటోంది.
– సంగెం చిన్న హనుమాండ్లు

మరిన్ని వార్తలు