Mukarram Jah: చివరి నిజాం రాజు మనవడు కన్నుమూత.. స్పందించిన సీఎం కేసీఆర్‌

15 Jan, 2023 21:48 IST|Sakshi

హైదరాబాద్: హైదరాబాద్ సంస్థానం చివరి నిజాం రాజు, అసఫ్ జాహీ వంశానికి చెందిన ఉస్మాన్ అలీ ఖాన్ మనవడు మీర్ అలీ ఖాన్ ముకర్రం ఝా (నిజాం 8వ రాజు) మరణించారు. శనివారం రాత్రి టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఆయన తుదిశ్వాస విడిచారు. పార్థీవదేహాన్ని హైదరాబాద్ తీసుకువస్తారు. అంత్యక్రియలు మక్కా మసీదులో మంగళవారం నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు.

నిజాం పెద్దకొడుకు ఆజమ్ ఝా, దుర్రె షెహవార్ దంపతుల కుమారుడు ముకర్రమ్ ఝా 1933లో జన్మించారు. డెహ్రాడూన్, లండన్‌లో చదువుకున్నారు. 1971 వరకు ప్రిన్స్ ఆఫ్ హైదరాబాద్‌గా ఉన్నారు. 1980ల్లో ఈయన దేశంలోనే అత్యంత ధనవంతుడు కావడం గమనార్హం.

సీఎం కేసీఆర్ స్పందన
ముకరం ఝా మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిజాం వారసుడుగా, పేదల కోసం విద్యా వైద్య రంగాల్లో ముకర్రమ్ ఝా చేసిన సామాజిక సేవలకు గుర్తుగా, వారి అంత్యక్రియలను అత్యున్నతస్థాయి అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించారు.

ముకర్రమ్ ఝా పార్థివ దేహం హైద్రాబాద్‌కు చేరుకున్న తర్వాత, వారి కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు అంత్యక్రియల సమయాన్ని, స్థలాన్ని నిర్దారించి తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్‌కు కేసీఆర్ సూచించారు.
చదవండి: ఫిబ్రవరి 17న తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభం

మరిన్ని వార్తలు