బురఖా ధరించి మహిళ వేషంలో గోడ దూకి పరారైన... నిజాం నవాబు ప్రధాని

17 Sep, 2022 16:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏడో నిజాం నవాబు హయాంలో హైదరాబాద్‌ సంస్థానం ప్రధానమంత్రి మీర్‌ లాయఖ్‌ అలీ.. నరనరాన భారత దేశంపై ద్వేషాన్ని, హిందువులపై కోపాన్ని నింపుకున్న వ్యక్తి. హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కాకుండా చివరివరకూ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. నిజాంకు విశ్వాసపాత్రుడైన లాయఖ్‌ అలీ చివరలో ప్రాణభయంతో పాకిస్తాన్‌కు పారి పోయాడు. ఇక్కడే పెద్ద హైడ్రామా చోటు చేసుకుంది. అచ్చు సినిమా ఫక్కీలో ఆయన పరారీ కథ నడిచింది.

మీర్‌ లాయఖ్‌ అలీ ఓ ఇంజనీరు, పారి శ్రామిక వేత్తగా నిజాం ఆంతరంగికుల్లో ఒకడిగా ఉండేవాడు. ఈ క్రమంలోనే రజాకార్ల నేత కాసిం రజ్వీ దారుణాలకు అండదండలందిస్తూ హిందువుల ఊచకోతలను ప్రోత్సహించాడని చెబుతారు. దేశ విభజన అనంతరం అనేక కుట్రలు చేశా డనీ అంటారు. ఈయన ఎత్తుగడలకు మెచ్చే,  దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మీర్‌ లాయఖ్‌ అలీని నిజాం నవాబు ప్రధానమంత్రిగా నియమించారు. కథ క్లైమాక్స్‌కు వచ్చేసరికి.. నిజాం నవాబు కూడా భారత సేనల ముందు దోషిగా నిలబడక తప్పలేదు. 

దిల్‌కుషా నుంచి పరారీ..
నిజాం నవాబు తన ఓటమిని అంగీకరించిన వెంటనే భారత సైన్యం రజాకర్ల నేత ఖాసిం రజ్వీని అరెస్టు చేసింది. హైదరాబాద్‌ సంస్థానం ప్రధాన మంత్రి మీర్‌ లాయఖ్‌ అలీ సహా ఇతర నేతలను గృహనిర్బంధంలో ఉంచింది. తొలుత లాయఖ్‌ అలీని ఆయన ఇంటిలోనే ఉంచి ఆ తర్వాత దిల్‌కుషా (తర్వాత ప్రభుత్వ వసతి గృహంగా మార్చారు) భవనానికి మార్చారు. అప్పటికే నిజాం రేడియో ప్రసంగం ద్వారా కాసిం రజ్వీ, లాయఖ్‌ అలీలను దోషులుగా తేల్చి.. స్వయంగా ప్రాసిక్యూషన్‌కు ఆదేశించారు.
చదవండి: ఇది టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య ఫైట్‌ కాదు.. కేంద్రం తీరుపై కేటీఆర్‌ ఫైర్‌

అయితే ఇక్కడే నిజాం దుష్టబుద్ధి చూపించుకున్నారు. లాయఖ్‌ అలీకి స్వయంగా నిజామే లోపాయికారిగా సహాయం చేశారని చెబుతారు. ఆయన పారిపోయేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. దిల్‌కుషాకు కారును పంపారు. దీంతో లాయఖ్‌ అలీ బురఖా ధరించి మహిళ వేషంలో గోడదూకి ఆ కారులో బొంబాయికి పారిపోయాడు. అక్కడి నుంచి విమానంలో పాకిస్తాన్‌ చేరుకున్నాడు. కానీ ఈ విషయం బయటకు పొక్కకుండా నిజాం చక్రం తిప్పారు. 

పాకిస్తాన్‌లోని కరాచీలో ఓ పార్టీ జరుగుతోంది. అందులో పాకిస్తాన్‌లో భారత రాయబారి కూడా పాల్గొన్నా­రు. కొద్దిసేపటి తర్వాత ఓ వ్యక్తి వచ్చి, భారత రాయబారిని పరిచయం చేసుకోవటంతో ఆశ్చర్యపో­వటం ఆ రాయబారి వంతైంది. తాను మీర్‌ లాయఖ్‌ అలీ అని, హైదరాబాద్‌ సంస్థానం మాజీ ప్రధానినంటూ ఆయన పేర్కొనటమే దీనికి కారణం. వెంటనే ఆయన భారత అధికారుల దృష్టికి ఈ విషయం తెచ్చారు. అప్పటికి గాని లాయఖ్‌ అలీ పారిపోయిన విషయం తెలియలేదు.

4రోజుల తర్వాత.. 
ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ భారత్‌కు రాని లాయఖ్‌ అలీకి పాకిస్తాన్‌ ప్రభుత్వం ప్రముఖ స్థానమిచ్చింది. తర్వాత ఆయన న్యూయా­ర్క్‌లో స్థిరపడ్డాడు. 1971లో అక్కడే చనిపోగా ఆయన శవాన్ని సౌదీ అరేబియాలోని మదీనాలో ఖననం చేసినట్టు చరిత్ర చెబుతోంది. 

మరిన్ని వార్తలు