నిజాం వెంట చీతా.. అతిథులకు వేట సరదా తీర్చిన నవాబులు

19 Sep, 2022 07:35 IST|Sakshi

వేటలో కొన్ని, మచ్చిక చేసుకునే క్రమంలో మరికొన్ని హతం

చివరికి బ్రిటిష్‌వారిని అడిగి మధ్యప్రదేశ్‌ నుంచి చీతాలను తెచ్చుకున్న నిజాం

ఇప్పటికీ వారి వారసుల ఇళ్లలో చీతాల అవశేషాలు 

నిజాం పాలనా సమయం.. అది మలక్‌పేటలోని రేస్‌ కోర్సు.. ఓ రోజు సాయంత్రం నాలుగు గంటల సమయం.. ఉన్నట్టుండి అలజడి మొదలైంది. ఆరో నిజాం తన వెంట రెండు చీతాలను తీసుకుని అక్కడికి వచ్చారు. చీతాలను రెండు వైపులా కూర్చోబెట్టుకుని గుర్రపు పందాలను వీక్షించి.. కాసేపటికి వెళ్లిపోయారు.

అది 1885.. బ్రిటిష్‌ అధికారి, రచయిత లార్కింగ్‌ హైదరాబాద్‌కు వచ్చారు. నిజాం ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. భోజనం, ఆ తర్వాత ప్యాలెస్‌ల వీక్షణంతో గడిచిపోయింది. మరునాడు పొద్దునే లార్కింగ్‌ను నిజాం పరివారం మహబూబాబాద్‌ ప్రాంతంలో వేటకు తీసుకెళ్లారు. వారు వెంట రెండు చీతాలను తీసుకురావటం, వాటి సాయంతో వేటాడటం చూసి లార్కింగ్‌ ఆశ్చర్యపోయారు. ఆ వేటను వివరిస్తూ ఓ పెయింటింగ్‌ రూపొందించారు. ‘బందోబస్త్‌ అండ్‌ ఖబర్‌’ పేరుతో రాసిన పుస్తకంలో దాన్ని ప్రచురించారు.

సాక్షి, హైదరాబాద్‌: నిజాం కాలంలో తెలంగాణ ప్రాంతంలోనూ చీతాలు ఉండేవి.  ప్రస్తుతం  మహారాష్ట్రలో ఉన్న విదర్భ ప్రాంతంలో చీతాలు ఉండేవని బ్రిటిష్‌వారి నివేదికలు చెబుతున్నాయి. అక్కడి నుంచి ఆదిలాబాద్‌ వరకు అటవీ ప్రాంతంలో అవి తిరుగాడేవి. నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ లెక్కల ప్రకారం.. 1900 నాటికి ఇండియాలో 414 చీతాలు ఉండేవి. అయితే హైదరాబాద్‌ సంస్థానానికి సంబంధించి నిజాం ఎలాంటి లెక్కలు తీయించలేదు. ఆ సమయంలో వేట విలాసంగా ఉండేది.

పెద్ద పులులను వేటాడేందుకు వెళ్లినవారికి చీతాలు సులభంగా చిక్కేవి. అలా ఎన్నింటినో చంపినా.. ఆ తర్వాతికాలంలో జింకల వేట కోసం చీతాలను వాడటం మొదలుపెట్టారు. ఇందుకోసం నిజాం పాలకులు వేటకుక్కల్లా చీతాలను మచ్చిక చేసుకున్నారు. కానీ వేట, అనారోగ్యం, ఇతర కారణాలతో త్వరగా అంతరించిపోయాయి. దీనితో అడవుల్లో చీతా పిల్లలు కనిపిస్తే తెచ్చి అప్పగించాలని ప్రజలకు నిజాం ఆదేశాలు జారీ చేశారు. చివరికి బ్రిటీష్‌ అధికారులకు లేఖ రాసి మధ్యప్రదేశ్‌ ప్రాంతంలో చీతాలను పట్టుకుని, హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.


ఎడ్ల బండిపై చీతాను తీసుకెళ్తున్నట్టు ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ గీయించిన చిత్రం

1908లో హైదరాబాద్‌కు వచ్చిన ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ ఆల్బర్ట్‌ ఎడ్వర్డ్‌.. ఇక్కడ నిజాంతో కలిసి వేటలో పాల్గొన్నారు. వేటకు వెళ్లేప్పుడు రెండు ఎడ్ల బండ్లపై మంచాలు వేసి, వాటికి చీతాలను కట్టి తీసుకురావడం ఆల్బర్ట్‌ ఎడ్వర్డ్‌ను ఆశ్చర్యపర్చింది. చీతాలు వాయువేగంతో పరుగెడుతూ జింకలను వేటాడటాన్ని చూసిన ఆయన.. ఆ దృశ్యాలను వివరిస్తూ ఈ చిత్రాలను గీయించారు.


జింకను వేటాడుతున్నట్టు గీయించిన మరో చిత్రం 

ఇప్పటికీ నాటి గుర్తులు
నిజాం వారసుల ఇళ్లలో చీతాలకు, నాటి వేటకు సంబంధించిన గుర్తులు ఇప్పటికీ ఉన్నాయి. హైదరాబాద్‌లోని మౌలాలి ప్రాంతంలో నిజాం ఆంతరంగికుడి వారసుడి నివాసంలో నాడు చీతాల కోసం వినియోగించిన పెద్ద పెద్ద ఇనుపబోన్లు ఉన్నాయి.

అప్పట్లో బ్రిటిష్‌ వైస్రాయ్‌ లార్డ్‌ కర్జన్‌ కూడా నిజాం సమక్షంలో వేట సరదా తీర్చుకున్నారు. నిజాం 1903లో లార్డ్‌ కర్జన్‌ను నిజాం పూర్వపు వరంగల్‌ జిల్లా నెక్కొండ అడవుల్లో వేటకు తీసుకెళ్లారు. వారు అక్కడ పెద్దపులిని వేటాడి.. దాని పక్కన కూర్చుని ఫొటోలకు ఫోజులిచ్చారు. (క్లిక్: 70 ఏళ్ల తర్వాత భారత్‌లోకి 8 చీతాలు.. పేరు పెట్టిన ప్రధాని మోదీ)

మరిన్ని వార్తలు