ఎంపీడీవో భారతి ఆత్మహత్యాయత్నం

16 Jan, 2021 09:05 IST|Sakshi

సాక్షి, జక్రాన్‌పల్లి(నిజామాబాద్‌): జక్రాన్‌పల్లి ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న భారతి శుక్రవారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాలు.. భారతిని సిరికొండకు డిప్యూటేషన్‌పై పంపారు. అక్కడ ఎంపీడీవోగా ఉన్న లక్ష్మణ్‌ను జక్రాన్‌పల్లి ఎంపీడీవోగా డిప్యూటేషన్‌ వేశారు. అయితే భారతి తండ్రి అనారోగ్య కారణాలతో ఆమె సెలవులో ఉన్నారు. ఈ సమయంలో డిప్యూటేషన్‌పై పంపడంతో ఆమె తీవ్ర మానసిక ఓత్తిడికి లోనై ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిసింది. 

పరిపాలన సౌలభ్యం కోసమే.. 
జక్రాన్‌పల్లి ఎంపీడీవో భారతిని పరిపాలన సౌలభ్యం కోసమే సిరికొండకు, సిరికొండలో ఉన్న ఎంపీడీవోను జక్రాన్‌పల్లికి డిప్యూటేషన్‌ వేశామని జెడ్పీ సీఈవో గోవింద్‌ తెలిపారు. డిప్యూటేషన్‌ ఇచ్చే సమయంలో భారతి తండ్రి అనారోగ్య కారణాలతో సెలవులో ఉన్నారని తెలిపారు. భారతి ఆత్మహత్యాయత్నం చేశారని తెలియడంతో ఆమెతో మాట్లాడానని చెప్పారు. ఎలాంటి ప్రమాదం లేదని సోమవారం విధులకు హాజరు కానున్నట్లు జెడ్పీ సీఈవో పేర్కొన్నారు.

మహిళలపై దాడి చేసిన ఉపసర్పంచ్‌పై కేసు 
ఇందల్‌వాయి: ఎల్లారెడ్డిపల్లె గ్రామ ఉప సర్పంచ్‌ గొల్ల శ్రీనివాస్‌తో పాటు అతడి అనుచరులు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఉపసర్పంచ్‌ తన అనుచరులతో కలిసి గురువారం రాత్రి గ్రామానికి చెందిన గొట్టిముక్కుల ఒడ్డెన్న ఇంటిపై దాడి చేసి ఇంట్లో ఉన్న మహిళలను గాయపరిచారు. వ్యక్తిగత కక్ష్యలతో తమపై దాడి చేసినట్లు బాధిత మహిళలు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేశామని ఎస్సై పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు