టీఆర్‌ఎస్‌పై విరుచుకుపడ్డ బీజేపీ ఎంపీ అరవింద్

25 Mar, 2021 19:46 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టో పై టీఆర్ఎస్ నాయకులు పిచ్చికుక్కల్లా మాట్లాడుతున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ధ్వజమెత్తారు. తమిళనాడులో అన్నాడీఎంకే, బీజేపీ పార్టీలు మిత్రపక్షాలుగా పోటీ చేస్తున్నాయని, అక్కడ ఇరు పార్టీల కూటమి అధికారంలోకి వస్తే పసుపు రైతుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అక్కడ పసుపు బోర్డును కేంద్రమే ఏర్పాటు చేస్తే, ఆ రాష్ట్ర ఇంచార్జీగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టతనిస్తారన్నారు. 

కేంద్ర ప్రభుత్వం.. నిజామాబాద్ పసుపు రైతులకు ఆశించిన స్థాయి కన్నా ఎక్కువగానే సహాయం చేస్తుందని పేర్కొన్నారు. పసుపు రైతుల కోసం కేంద్రం స్పైసెస్ ఎక్స్‌టెన్షన్‌ బోర్డును ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్త చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దిగుమతులను తగ్గించి ఎగుమతులను పెంచిందని ప్రకటించారు. పసుపు రైతుల కోసం ప్రతి ఏటా బడ్జెట్ కేటాయింపుల్లో పది కోట్ల రూపాయలు పెంచుతున్నామని, వారికి మద్దతు ధరకు మించిన రేటునే ఇస్తున్నామని వెల్లడించారు. క్వాలిటీ పసుపు పదివేలకు పైగానే ధర పలుకుతోందని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్‌లు రైతులకు రుణ మాఫీ చేస్తామని అన్యాయం చేస్తున్నారని, నిరుద్యోగ  భృతి ఇస్తామని నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేక నాపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు