మద్యం వైపు మగువలు

16 Dec, 2020 12:15 IST|Sakshi

జిల్లాలో 9.8 శాతం స్త్రీలకు మద్యం అలవాటు

పొగాకు ఉత్పత్తుల వినియోగంలోనూ ఇదే తీరు

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడి 

సాక్షి, నిజామాబాద్‌: మద్యం మహమ్మారి మహిళలపైనా వల విసురుతోంది! ఆడ వారిని సైతం తన బాధితులను చేసుకుంటోంది. మద్యానికి అలవాటు పడుతున్న స్త్రీల సంఖ్య క్రమంగా పెరుగుతుండడం ఆందోళనకు గురి చేస్తోంది. జిల్లాలో ఉన్న మహిళల్లో 9.8 శాతం మంది మద్యం సేవిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో తేలింది. ఇది రాష్ట్ర సగటు కంటే అధికం కావడం గమనార్హం. జిల్లాలో ప్రతి వంద మంది మహిళల్లో సుమారు పది మందికి మందు తాగే అలవాటు ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు, పట్టణ ప్రాంతాల్లోనూ అతివలకు మద్యం తీసుకునే అలవాటు ఉన్నట్లు తేలింది. మద్యం సేవించే మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా 6.7 శాతం ఉండగా, మన జిల్లాలో మాత్రం అంత కంటే 3.1 శాతం అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇంట్లో భర్త తాగుడుకు అలవాటు పడితే మహిళలు మానిపించి కుటుంబాన్ని చక్కదిద్దుతుంటారు. అలాంటి మహిళలు సైతం క్రమంగా ఈ మద్యం బాధితులు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. 

15 ఏళ్లకు పైబడిన వారి వివరాల సేకరణ.. 
కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ దేశ వ్యాప్తంగా ఇటీవల ఐదో విడత జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నిర్వహించింది. కార్వీ డేటా మేనేజ్‌మెంట్‌ సరీ్వసెస్‌ అనే సంస్థ ద్వారా ఈ సర్వే చేపట్టింది. గతేడాది 2019 జూన్‌ 30 నుంచి నవంబర్‌ 14 వరకు సర్వే బృందం ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 27,351 కుటుంబాలను కలిసి వివరాలను తీసుకోగా, నిజామాబాద్‌ జిల్లాకు సంబంధించి 891 కుటుంబాలను సర్వే చేసింది. ఈ సర్వేలో 15 ఏళ్లకు పైబడిన వారి నుంచి వివరాలను తీసుకున్నారు. మొత్తం 104 అంశాలపై వివరాలు సేకరించారు. ఈ సర్వే నివేదికను ఇటీవల వెల్లడించగా, ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.

40 శాతం మందుబాబులే.. 
ఇక పురుషుల విషయానికి వస్తే, 40 శాతం మంది మగవారు మందు తీసుకున్నట్లు వెల్లడైంది. జిల్లాలో ఉన్న పురుషుల్లో 40.02 శాతం మందికి సుక్కేసుకునే అలవాటు ఉన్నట్లు సర్వేలో తేలింది. ఇది రాష్ట్ర సగటు కంటే కాస్త తక్కువగా ఉండడం గమనార్హం. రాష్ట్రంలో 43.3 శాతం మంది పురుషులు మద్యం సేవిస్తున్నట్లు సర్వే పేర్కొంది. 

పొగాకు వినియోగంలోనూ.. 
పొగాకు ఆధారిత ఉత్పత్తుల వినియోగంపై కూడా సర్వే చేసింది. ప్రధానంగా బీడీ, సిగరేట్, తంబాకు, గుట్కా వంటి వాటి అలవాటు ఉన్న వారి వివరాలను కూడా సేకరించారు. జిల్లాలో 8.6 శా తం మంది మహిళలు పొగాకు ఆధారిత ఉత్పత్తులకు అలవాటు పడినట్లు తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు వినియోగించే మహిళల శాతం 5.6 శాతం కాగా, అంతకంటే సుమారు మూడు శాతం ఎక్కు వ మంది మహిళలు జిల్లాలో పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడ్డారు. పురుషుల విషయానికి వస్తే, జిల్లాలో 20.6 శాతం మంది ఫురుషులు పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. ఈ అలవాట్లు ఉన్న వారు రాష్ట్ర వ్యాప్తంగా 22.3 శాతం ఉన్నట్లు తేలింది. 

మరిన్ని వార్తలు