లేని కారుకు కిరాయి.. అది ఇతని వల్లే సాధ్యం..

30 Mar, 2021 11:49 IST|Sakshi

ఐదు నెలల అద్దె డబ్బులు స్వాహా

జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖలో వెలుగు చూసిన అక్రమం

సిబ్బందిపై ఒత్తిడి చేసి బిల్లులు చేయించుకున్న ఓ అధికారి

శాఖలో హాట్‌ టాపిక్‌గా  మారిన వైనం

సాక్షి, నిజామాబాద్‌ : సాధారణంగా కొందరు అధికారులు కారు అద్దె డబ్బులను స్వాహ చేసేందుకు తమ సొంత కార్లను, బంధువుల పేరిట ఉన్న వాహనాలను వినియోగిస్తారు. కానీ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ లో ఓ అధికారి మరో అడుగు ముందుకేశాడు. లేని కారును ఉన్నట్లుగా, తిరగకున్నా తిరిగినట్లుగా చూపించి అద్దె డబ్బులు స్వాహా చేశారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఐదు నెలల పాటు అక్రమంగా ప్రభుత్వ సొమ్మును మింగాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూడగా, ప్రస్తుతం ఆ శాఖ ఉద్యోగుల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. గ్రామీణాభివృద్ధి శాఖలో ఇదివరకు డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తికి టీఎస్‌ 05యూఏ 7336 నంబరు గల కారు ఉండేది. ఆ కారు తన భార్య పేరుపై రిజిస్టరై ఉంది. అయితే సదరు కారు గ్రామీణాభివృద్ధి శాఖలో అద్దెకు వినియోగించనేలేదు. కానీ శాఖకు చెందిన ఓ అధికారి సంబంధిత కారు ఆర్‌సీని ఆధారంగా చేసుకొని కారు తిరిగినట్లుగా రికార్డులు సృష్టించాడు.

మొదట ఒక నెల అద్దె డబ్బులను తీసుకోగా, రుచి మరగడంతో వరుసగా ఐదు నెలల అద్దె డబ్బులను స్వాహా చేశాడు. ప్రతినెలా 25వేలు, అంతకు పైగానే తిరిగినట్లుగా చూపించి నెలకు రూ. 32,340 చొప్పున ఐదు నెలలు కలిపి రూ. లక్షా 50 వేలకుపైనే జేబులో వేసుకున్నారు. లేని కారు పేరిట తిరగకున్నా బిల్లులు తీసుకోవడం పద్ధతి కాదని శాఖలోని ఒకరిద్దరు ఉద్యోగులు సదరు అధికారికి చెప్పినా వినలేదు. అంతా నేను చూసుకుంటానని చెప్పి వారితో బలవంతంగా బిల్లులు చేయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. విషయం బయటకు పొక్కడంతో ఉద్యోగులు గుసగుసలాడుతున్నారు.

డ్రైవర్‌ వద్దన్నా..
డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తి తన భార్య పేరిట ఉన్న కారు పేరుతో అక్రమంగా బిల్లులు తీసుకోవడంపై తొలుత అభ్యంతరం వ్యక్తం చేశాడు. అధికారి కింద పనిచేస్తుండడంతో ఉద్యోగానికి ప్రమాదం ఏర్పడి ఉపాధి దెబ్బ తింటుందనే ఉద్దేశంతో గట్టిగా అనలేకపోయాడు. అయితే కొన్నిరోజులకు సదరు కారును వేరే వ్యక్తులకు అమ్మేశాడు. అయినప్పటికీ కూడా ఆర్‌సీని ఆధారంగా చేసుకుని అధికారి బిల్లులు పొందాడు. ఇలాగే ఉంటే తనకు ప్రమాదం ఏర్పడుతుందని ఆ కారు డ్రైవర్‌ కూడా గ్రామీణాభివృద్ధి శాఖలో విధులు మానుకుని వేరేశాఖలో పని చేసున్నాడు. ఇదిలా ఉండగా, అద్దె వాహనాన్ని నిబంధనల ప్రకారం జిల్లా పరిధిలోనే తిప్పాలి. శాఖకు సంబంధించిన పని ఉంటే రాష్ట్ర శాఖకు వెళ్లడానికి హైదరాబాద్‌ వరకు నెలలో నాలుగైదు సార్లు వెళ్లే అవకాశం కూడా ఉంది. కానీ గ్రామీణాభివృద్ధి శాఖలోని సదరు అధికారి మాత్రం వారంలో ఒకటి, రెండు సార్లు వేరే జిల్లాకు వెళ్లి వస్తున్నట్లు తెలిసింది. అలాగే శాఖలోని ఇతర ఉద్యోగుల వాహనాలను కూడా సొంత పనులకు వినియోగించుకున్నట్లు విమర్శలున్నాయి.

శాఖ పనులకు ఉపయోగించాం
కారును శాఖ పనులకు వినియోగించాం. వేరే జిల్లాకు రెండు, మూడు సార్లు వెళ్లిన విషయం వాస్తవమే. రికార్డులు పక్కగా ఉంటేనే బిల్లులకు అనుమతి ఇచ్చాం. 
– శ్రీనివాస్, ఇన్‌చార్జి డీఆర్‌డీవో

చదవండి: ఖమ్మం నగరంలో మోడల్‌ ‘వైకుంఠధామం’
కొడుకా.. నువ్వులేక మేము బతుకుడెట్లా!

మరిన్ని వార్తలు