ఆరోగ్యం ముసుగులో ఉగ్రవాదం.. పీఎఫ్‌ఐ చార్జిషీటులో విస్మయకర అంశాలు

4 Jan, 2023 21:23 IST|Sakshi
సోదాలు నిర్వహిస్తున్న ఎన్‌ఐఏ అధికారులు (ఫైల్‌)

సాక్షి, కరీంనగర్‌: రాడ్డు.. కర్ర..కత్తి ఏ ఆయుధాన్ని ఎలా వాడాలి..? ఎలా దాడి చేయాలి? మనిషి శరీరంలో ఎక్కడెక్కడ సున్నిత ప్రాంతాలు ఉంటాయి..? ఎక్కడ కొడితే ప్రాణాలు పోతాయి..? ఇవీ.. ఆరోగ్య పరిరక్షణ ముసుగులో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) రహస్యంగా నిర్వహించిన కార్యకలాపాలు. శారీరక, మానసిక ఆరోగ్యం ముసుగులో పీఎఫ్‌ఐ చేసిన సంఘ వ్యతిరేక చర్యలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.

యోగా.. కరాటే పేరుతో ఆయుధాల వినియోగం, మనుషులను సులువుగా చంపడం ఎలా..? తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారని తేలింది. ఈ వ్యవహారంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణలో అనేక కీలక విషయాలు వెలుగుచూశాయి. ఇవే విషయాలను ఎన్‌ఐఏ ఇటీవల దాఖలు చేసిన చార్జిషీటులోనూ పేర్కొంది. శారీరక ఆరోగ్యానికి, ఆత్మరక్షణ పేరిట నడిపిన కరాటే శిబిరాలు, యోగా పేరిట నడిపిన ధ్యానకేంద్రాలన్నీ ఉగ్ర కార్యకలాపాలకు నిలయంగా మారాయని చార్జిషీటులో పేర్కొంది.

ఎలా బయటపడిందంటే..?
పీఎఫ్‌ఐ కీలక సభ్యుడు, నిజామాబాద్‌కు చెందిన (స్వస్థ­లం జగిత్యాల) అబ్దుల్‌ఖాదర్‌ను పోలీసులు నిజామాబాద్‌లో అరెస్టు చేయడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. ఇతను నిజామాబాద్‌లో దాదాపు 200 మంది ముస్లిం యువకులకు శిక్షణ ఇచ్చినట్లు స్థాని­క పోలీసులు వెల్లడించారు. గతేడాది జూలై 4న  పోలీసులు అబ్దుల్‌ ఖాదర్, అతని అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. అతను ఇచ్చిన సమా­చారంతో సాదుల్లా, ఇమ్రాన్, మొబిన్‌ను మరుసటి రోజు అరెస్టు చేశారు. వీరి నెట్‌వర్క్‌ను ఏపీలోని కడప, కర్నూలు నుంచి పీఎఫ్‌ఐ సభ్యులు ఆపరేట్‌ చేస్తున్నట్లు గుర్తించారు.

దీంతో నిజామాబాద్‌ 4వ టౌన్‌లో పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ కేసులో నిందితుడు అబ్దుల్‌ఖాదర్‌ విదేశాలకు వెళ్లి రావడం, పలు దేశాల నుంచి పీఎఫ్‌ఐకి నిధులు తెచ్చినట్టు కూడా పోలీసులకు సమాచారం ఉంది. దీంతో ఎన్‌ఐఏ రంగంలోకి దిగి సెక్షన్‌ 120 (బి), 153(ఎ), ఐపీసీ సెక్షన్లు 17, 18, 18(ఎ), 18(బి) యూఏ(పి) యాక్ట్‌ కింద ఆగస్టు 26న తిరిగి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.

ఈ కేసులో అబ్దుల్‌ ఖాదర్‌ (ఆటోనగర్, నిజామాబాద్‌), అబ్దుల్‌ అహ్మద్‌ (ముజాహెద్‌నగర్, నిజామాబాద్‌), షేక్‌ ఇలియాస్‌ అహ్మద్‌ (ఖాజానగర్, నెల్లూరు), అబ్దుల్‌ సలీమ్‌ (ఇస్లాంపూర్, జగిత్యాల), షేక్‌ షాదుల్లా (గుండారం, నిజామాబాద్‌), ఫిరోజ్‌ ఖాన్‌ (శాంతినగర్, ఆదిలాబాద్‌), మహమ్మద్‌ ఉస్మాన్‌  (తారకరామనగర్, జగిత్యాల), సయ్యద్‌ యాహియా సమీర్‌ (ఆటోనగర్, నిజామాబాద్‌), షేక్‌ ఇమ్రాన్‌ (ముజాహెద్‌నగర్, నిజామాబాద్‌), మొహమ్మద్‌ అబ్దుల్‌ ముబీన్‌ (హబీబ్‌నగర్, నిజామాబాద్‌), మొహమ్మద్‌ ఇర్ఫాన్‌ (హుస్సేన్‌పురా, కరీంనగర్‌)పై చార్జీషీటు దాఖలు చేసింది.

హింసలో సుశిక్షితులు
నిజామాబాద్‌లో శిక్షణ పొందిన 200 మంది యువ­తను పథకం ప్రకారం ముందుగా ఆరోగ్యం, ధ్యానం పేరిట యోగా, కరాటే అంటూ పోగుచేశారు. ఆపై వారిలో దేశ వ్యతిరేక భావజాలం నింపుతూ వారి మనసులను కలుషితం చేసేందుకు యత్నించారు. యోగా క్యాంపుల ముసుగులో విద్వేషాలు రెచ్చగొట్టడం, కరాటే పేరిట దాడి చేయడంలో తర్ఫీదు ఇచ్చారని ఎన్‌ఐఏ చార్జిషీటులో పేర్కొంది. గొంతు, తల, ఉదరం తదితర సున్నిత ప్రాంతాలపై దాడి చేయడం, ఎక్కడ కొడితే మనిషి త్వరగా మరణిస్తాడన్న విషయాలపైనా తరగతులు ఇచ్చినట్లు కూడా ఎన్‌ఐఏ ఛార్జిషీటులో స్పష్టం చేసింది.

కొనసాగుతున్న నిఘా..
ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాపై ఎన్‌ఐఏ నిఘా కొనసాగుతోంది. గతంలో క్రియాశీలకంగా ఉన్న సిమి (స్టూడెంట్‌ ఇస్లామిక్‌ మూమెంట్‌ ఆఫ్‌ ఇండియా) నిషేధానికి గురవడంతో పీఎఫ్‌ఐ ముసుగులో తిరిగి కార్యకలాపాలు మొదలు­పెట్టినట్టు గుర్తించింది. అందుకే దేశవ్యాప్తంగా దీని కార్యకలాపాలకు కళ్లెం వేసేందుకు గతేడాది సెప్టెంబర్‌ 18న పీఎఫ్‌ఐ స్థావరాలపై దాడులు చేసింది. అందులోభాగంగా జగిత్యాల, కరీంనగర్‌ ప్రాంతాల్లోనూ సోదాలు నిర్వహించింది. పలువురి నుంచి కీలక డాక్యుమెంట్లు, పీఎఫ్‌ఐ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకుంది. సంస్థకు సంబంధించి ఇంకా ఎవరైనా సానుభూతిపరులు, స్లీపర్‌సెల్స్‌ ఉన్నారా? అన్న కోణంలో నిరంతర నిఘా కొనసాగుతూనే ఉంది. 

మరిన్ని వార్తలు