నిజామాబాద్ అర్బన్‌లో.. 'బిగాల గణేష్‌గుప్త' కే అవకాశం ఎక్కువ..

19 Sep, 2023 08:35 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌: ప్రతి ఎన్నికల్లో కాలనీల్లో మౌలిక సదుపాయలు, రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి వసతి , పెన్షన్ల కేటాయింపు ఈ అంశాలు ముఖ్యంగా ప్రభావితం అవుతాయి.. ఈ పనులతో పాటు ప్రజాప్రతినిధులు అభ్యర్థులు కాలనీ వాసులతో అందుబాటులో ఉండే వారి పట్ల ప్రజలు మొగ్గుచూపుతారు. మరోవైపు కులాల వారిగా ఓటర్లు ప్రధానంగా ప్రభావం చూపుతారు.

అర్బన్‌లో ముస్లీంలు, మున్నూరు కాపులు, పద్మశాలిలు వరుసగా అత్యధిక ఓటర్లు కలిగి ఉన్నారు. ఇక్కడ కులాల వారిగా ఏదైనా అభ్యర్థికి మద్దతు ఇవ్వడంలోనూ ముందుకు వస్తే రాజకీయ సమీకరణలు తీవ్రంగా ఉంటాయి. కులాల వారు మద్ధతు తెలిపితే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మైనార్టీలు మాత్రం గత కొన్ని సంవత్సరాలుగా ఏకపక్షంగా ఎంఐఎంకు, మైనార్టీ నాయకులకు ఎక్కువ మద్దతు పలుకుతున్నారు. వీరి ఓట్లను సాధించిన వారు అనుకూలంగా మలుచుకున్నవారు గెలిచే అవకాశాలు ఎక్కువ.

ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ..
నిజామాబాద్ అర్బన్లో ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త మళ్లీ పోటీచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతన్ని కాదని మరొకరికి టికెట్ ఇస్తే ఇతర నాయకులు బలంగా లేరని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు బిగాల గణేష్‌గుప్త తమ్ముడు మహేష్‌గుప్తకు టికెట్‌ ఇప్పించాలని ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత అర్బన్‌లో టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ ఆశిస్తున్న వారిలో అభ్యర్థుల సంఖ్య ఎక్కువగానే ఉంది. టీపీసీసీ రాష్ట్ర నాయకుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ మరోసారి తనకే టికెట్‌ కావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మాజీ మేయర్‌ ధర్మపురి సంజయ్‌ టికెట్‌ తనకే వస్తుందని ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించారు. మరో వైపు సీనియర్‌ నాయకుడు కేశవేణు , తాహెర్‌బిన్‌హుందాన్‌లు టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.  మరో వైపు ఎన్‌ఆర్‌ఐ నరాల కళ్యాణ్‌ టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

బీజేపీలో మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ మరోసారి టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పార్టీలో ఉంటూ సేవ కార్యక్రమాలు కొనసాగిస్తున్న ధన్‌పాల్‌ సూర్యనారాయణ సైతం టికెట్‌ కోసం ఈసారి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంఐఎం తరపున భైంసా మున్సిపల్‌ చైర్మన్‌ జుబేర్‌తో పాటు మాజీ డిప్యూటీ మేయర్‌ ఫయూమ్‌లు, మాజీ కార్పొరేటర్‌ రఫత్‌ఖాన్‌లు టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

ఓటర్ల సంఖ్య..
అర్బన్‌ నియోజక వర్గంలో ముస్లీం ఓటర్లు అధికంగా ఉంటారు. వీరు 48వేల వరకు ఉండగా, మున్నూరుకాపు ఓటర్లు 44 వేల వరకు ఉంటారు. పద్మశాలిలు 41 వేల  వరకు ఉంటారు. వీరే అర్బన్‌లో రాజకీయాలకు కీలకంగా మారారు.

భౌగోళిక పరిస్థితుల పరంగా..
నిజామాబాద్ అర్బన్‌ నియోజక వర్గంలో భౌగోళిక పరిస్థితుల పరంగా పెద్దగా గుర్తింపు బడిన అంశాలు లేవు. ఖిల్లా రామాలయం, నీల కంఠేశ్వరాలయం, శంభునిగుడి, జెండాగుడిలు ఉన్నాయి. ఇందులో శుంభుని గుడి రాజకీయ పరంగా తరచుగా వివాదం అవుతుంది. ఈ గుడికి అనుకొని ఉన్న ముస్లిం దుకాణాలను తొలగించాలని వివాదాలు జరుగుతాయి..

టికెట్ల కేటాయింపులో ఆసక్తికరం..
అర్బన్‌ నియోజక వర్గంలో కులాల వారిగా ఓటర్లు కీలకంగా ఉండగా అభ్యర్థుల టికెట్ల కేటాయింపులో ఆసక్తికరంగా ఉంటుంది. సీనియర్‌ రాజకీయ నాయకులు వారి కుటుంబ సభ్యులకు టికెట్లు కేటాయించుకోవడం ఎక్కువగా కొనసాగుతుంది. సామాన్య, తక్కువ స్థాయి లీడర్లకు పోటీచేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.. డి. శ్రీనివాస్ కుటుంబం మూడు పార్టీల్లో కొనసాగింది.. ఆ తరవాత డి. శ్రీనివాస్ బీఆర్‌ఎస్‌ కు దూరం కావడంతో ప్రస్తుతం ఆ సంఖ్య రెండుకు చేరింది.. ఆయన పెద్దకొడుకు సంజయ్ ప్రస్తుతం కాంగ్రెస్ గూటికి మళ్లీ చేరిపోగా చిన్న కొడుకు అరవింద్ బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నారు.

వర్గాల వారిగా..
అర్బన్‌ నియోజక వర్గంలో హిందూ, ముస్లీం వర్గాలకు సంబంధించి తరచుగా వివాదాలు నెలకొనడం జరుగుతుంది. ఇక్కడ రాజకీయ పరిస్థితులు అలాగే ఉన్నాయి. రెండు వర్గాల వల్ల ఓటర్లు కూడా హిందూ, ముస్లీం వారిగా ఓట్లు వేసే అవకాశాలు ఉన్నాయి. ఇందులో భాగంగానే గతంలో ఇక్కడ బీజీపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలువడం, మున్సిపల్‌ ఎన్నికలతో పాటు అసెంబ్లీ, సాధారణ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులు రెండవ స్థానంలో  నిలువడం ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు