ఎన్‌వోసీ లభించక.. ఇంటికి చేరుకోలేక.. పాపం మనోడు

1 Dec, 2022 19:24 IST|Sakshi
మలేసియా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కూన గంగాధర్‌

మలేసియాలో  పక్షవాతంతో అవస్థలు పడుతున్న పాలెం వాసి

ముగిసిన విజిట్‌ వీసా గడువు

భారత విదేశాంగ శాఖ నుంచి ఎన్‌వోసీ కోరుతున్న అక్కడి ప్రభుత్వం

ఎన్‌వోసీ జారీ చేయడంలో విదేశాంగ శాఖ తాత్సారం 

మోర్తాడ్‌ (బాల్కొండ): ఉపాధికోసం విజిట్‌ వీసాపై మలేసియాకు వెళ్లిన నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ మండలం పాలెంకు చెందిన కూన గంగాధర్‌ పక్షవాతంతో మంచం పట్టాడు. వీసా గడువు ముగిసిపోవడంతో అతడిని ఇంటికి పంపించడానికి మలేసియా ప్రభుత్వం భారత విదేశాంగ శాఖ ద్వారా నో ఆబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌వోసీ)ను కోరుతోంది. అయితే ఎన్‌వోసీని జారీ చేయడంలో భారత విదేశాంగ శాఖ తాత్సారం చేయడంవల్ల అనారోగ్యంతో అవస్థలు పడుతున్న కూన గంగాధర్‌ ఇంటికి చేరుకోలేకపోతున్నాడు. 

గంగాధర్‌ నాలుగు నెలల క్రితం మలేసియాకు వెళ్లాడు. అక్కడ ఒక కంపెనీలో పని చేస్తున్నాడు. పదిహేను రోజుల కిందట పని ముగించుకుని తన గదికి చేరుకున్న తరువాత గంగాధర్‌కు పక్షవాతం వచ్చింది. దీంతో అతనితో పాటు ఉన్న తెలంగాణ వాసులు అక్కడి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. పక్షవాతంతో బాధపడుతున్న గంగాధర్‌ను ఇంటికి పంపించడానికి తెలుగు అసోసియేషన్‌ ప్రతినిధులు యనమల వెంకటస్వామి, శుభ్రలు ప్రయత్నిస్తున్నారు. 


విజిట్‌ వీసాపై వెళ్లిన గంగాధర్‌ మలేసియాలో చట్టవిరుద్ధంగా ఉండిపోవడంతో అతడిని ఇంటికి పంపించడానికి రూ.25 వేల జరిమానా చెల్లించడంతో పాటు భారత రాయబార కార్యాలయం నుంచి ఎన్‌వోసీ తీసుకోవాల్సి ఉంది. జరిమానా చెల్లించడానికి బాధితుని పక్షాన తెలంగాణ వాసులు సిద్ధంగా ఉన్నారు. ఎన్‌వోసీ జారీ చేయడానికి విదేశాంగ శాఖ అధికారులు స్పందించకపోవడంతో పదిహేను రోజులుగా గంగాధర్‌ ఆస్పత్రిలోనే ఉండిపోయాడు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కూన గంగాధర్‌ను ఇంటికి పంపడానికి వేగంగా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. (క్లిక్ చేయండి: పాస్‌పోర్టులో ఇంటి పేరు ఉండాల్సిందే)

మరిన్ని వార్తలు