గ్రేటర్‌ ఎన్నికల్లో ప్లాన్‌ మార్చిన అభ్యర్థులు

5 Oct, 2020 09:58 IST|Sakshi

బీరు, బిరియానీ ప్లేస్‌లో మాస్క్‌, శానిటైజర్‌..!

వలంటీర్లతో ఇంటింటికీ పంపిణీ

హైదరాబాద్‌: ఎన్నికలొస్తున్నాయంటే చాలు.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు నానా హడావిడి చేస్తుంటాయి. ఓటుకింత ముట్టజెప్పడమే కాకుండా బీరు.. బిరియానీ.. ఖరీదైన బహుమతులతో ‘ప్రచారం’ చేస్తుంటాయి. అతిత్వరలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు. అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ అప్పుడే ప్రచారాన్ని కూడా షురూ చేసేశాయి. కానీ.. ఇది ‘కరోనా సీజన్‌’ కావడంతో కాస్త ప్లాన్‌ మార్చారు ఆయా పార్టీల నేతలు. బీరు, బిరియానీల స్థానంలో మాస్క్‌, శానిటైజర్లను ఉచితంగా అందజేస్తూ ఓటర్ల ఆకట్టుకుంటున్నారు. 

ఎన్నికల సమయంలో తమ పార్టీ వలంటీర్లను ఓటర్ల ఇళ్లకు పంపించి తమకు చేతనైనంతలో బహుమతులు ఇవ్వడం తమకు అలవాటని టికెట్‌ ఆశిస్తున్న ఓ అభ్యర్థి చెప్పారు. ఈసారి ఆ వలంటీర్లతోనే పారాసిటమాల్‌ ట్యాబ్‌లెట్లు, మాస్క్‌లు, శానిటైజర్లు, విటమిన్‌ గోళీలను ఇంటింటికీ పంపిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే రెండు విడతల పంపిణీ ముగిసిందని, ఎన్నికలు పూర్తయ్యేలోపు మరోసారి పంపిస్తామని వివరించారు. ఆయా ప్రాంతాల్లో ఉచిత ఆరోగ్య శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారీ అభ్యర్థులు. మాస్కులు, శాటిటైజర్లు, మందులతోపాటు వలంటీర్లకు కూడా రాజకీయ పార్టీలు భారీగా ఖర్చుపెడుతున్నాయి. ఒక్కో వలంటీర్‌కు 6 గంటలు పనిచేస్తే 600.. 12 గంటలు పనిచేస్తే 1200 ముట్టుజెపుతున్నారట పోటీలో ఉన్న అభ్యర్థులు.
(చదవండి: అమాంతం పెరిగిన చికెన్‌ ధర)

మరిన్ని వార్తలు