వీధి వీధిలో విద్య..

26 Aug, 2021 08:37 IST|Sakshi

శిల్గాపురం పాఠశాల ఉపాధ్యాయుల వినూత్న ఆలోచన 

గ్రామంలోని వీధుల్లో ఫ్లెక్సీలు, చార్ట్‌లు 

వాటిని చూస్తూ ఇంటి వద్దనే చదువుకునేలా ఏర్పాటు 

ఆ ఊరికి నాలుగేళ్లుగా ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులు బంద్‌ 

పిల్లలంతా ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసం 

ఆ ఊరి నుంచి ఒక్క విద్యార్థీ ప్రైవేట్‌ స్కూలుకు వెళ్లరు.. గ్రామంలోని వీధి వీధిలో విద్య అందుబాటులో ఉంటుంది.. వారికి నచ్చిన చోట కూర్చొని చదువుకోవచ్చు.. ఆంగ్లం పదాలు టకాటకా చెప్పగలరు.. గణితం కూడికలు, తీసి వేతలు, ఎక్కాలు చకచకా చదవగలరు.. ఇదీ నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్‌) మండలం శిల్గాపురం ప్రత్యేకత. అక్కడి ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎం సైదయ్య ఆలోచన పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతోంది.  

తిరుమలగిరి (నాగార్జునసాగర్‌): కరోనా నేపథ్యంలో పాఠశాలలు బంద్‌ కావడంతో ఎంతో మంది విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారు. ప్రభుత్వం ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నా.. గవర్నమెంట్‌ స్కూల్‌ పిల్లలు అవి వినే పరిస్థితి అంతంతే. ఆన్‌లైన్‌ పాఠాలకు సెల్‌ఫోన్లు, సిగ్నల్స్, డాటా అందుబాటులో లేక 50 శాతం మంది విద్యార్థుల చదువు సాగడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్‌) మండలం శిల్గాపురం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కట్టెబోయిన సైదయ్య ఓ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు.

గ్రామంలోని వీధుల్లో బ్లాక్‌బోర్డులు, ఫ్లెక్సీలు, చార్టులపై వర్ణమాల, సరళ పదాలు, ఏబీసీడీలు.., ఒత్తులు, పదాలు, ఎక్కాలు, జంతువులు, ఆంగ్లపదాల్లో జంతువులు, పండ్లు, పక్షుల చిత్రా లను ప్రతి వీధిలో ఏర్పాటు చేశారు. దీనికి పాఠశాల పూర్వ విద్యార్థులు, గ్రామస్తుల సహకారం తీసుకున్నారు. ప్రతి వీధికి ఓ ఇన్‌చార్జ్‌ని నియమించి విద్యార్థులను చదివించే బాధ్యతను వారికి అప్పగించారు. ఇలా గ్రామంలో 65 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఉపాధ్యాయులు రోజు విడిచి రోజు విధులకు హాజరవుతూ విద్యార్థులు ఎలా చదువుతున్నారు.. ఇన్‌చార్జీలు వారిని ఎలా పోత్సహిస్తున్నారు అనే అంశాలను పర్యవేక్షిస్తున్నారు.  

నాలుగేళ్లుగా ప్రైవేట్‌ స్కూల్‌ వాహనాలు బంద్‌.. 
ప్రస్తుతం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రైవేట్‌ స్కూల్‌కు పంపిస్తుండటంతో చాలాచోట్ల ప్రభుత్వ పాఠశాలలు మూతబడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో శిల్గాపురం పాఠశాలలో ఐదేళ్ల క్రితమే ఆంగ్ల మాధ్యమ బోధన ప్రారంభించారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ఐదేళ్ల నుంచి ఒక్క విద్యారి్థని కూడా ప్రైవేట్‌ పాఠశాలకు ఆ ఊరి నుంచి పంపిన దాఖలాలు లేవు. ప్రతి సంవత్సరం ఈ పాఠశాల నుంచే పది మంది విద్యార్థులు గురుకులాల్లో సీట్లు సాధిస్తుండటం విశేషం.   

మరిన్ని వార్తలు